e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home ఎడిట్‌ పేజీ కొత్త విద్యకు సమాయత్తం

కొత్త విద్యకు సమాయత్తం

కొత్త విద్యకు సమాయత్తం

యూజీసీ మార్గదర్శకాల మేరకు 2021 మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం పది విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమించింది. కొవిడ్‌ మహమ్మారి మూలంగా కొంత జాప్యం జరిగినప్పటికీ, ఈ నియామకాల మూలంగా అనిశ్చితి తొలగిపోతుందనీ, దేశంలోనే ఉన్నత విద్యా కేంద్రంగా మన రాష్ట్రం మారడానికి సరికొత్త అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2017లోనే 1061 అధ్యాపక పోస్టులు మంజూరు చేసి, అందుకు బడ్జెట్‌ను కూడా కేటాయించింది. కానీ ఆయా విశ్వవిద్యాలయాలు ఎందుకో గానీ ఈ నియామకాలను చేపట్టలేదు. దీని వల్ల ఈ ఉన్నత విద్యా సంస్థలలో నాణ్యత ఘోరంగా దెబ్బతిన్నది. ఇప్పుడు కొత్తగా నియమితులైన వీసీలు చేయవలసిన మొదటి పని అధ్యాపక నియామకాలు చేపట్టడం.

కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ విద్యా విధానం, 2020’ (ఎన్‌ఈపీ)ని ప్రవేశ పెట్టిన నేపథ్యంలో వీసీల నియామకం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఈ ఎన్‌ఈపీ సమగ్రమైన విధాన పత్రం. విద్యారంగంలో ప్రత్యేకించి ఉన్నత విద్యా వ్యవస్థలో మౌలికమైన భావజాల మార్పు కోసం ఉద్దేశించినది. ఈ విధాన పత్రం అన్ని ప్రమాణాల గురించి చర్చించినప్పటికీ, అవసరమైనప్పుడు ‘సరళత’ను మార్గదర్శకంగా సూచించింది. అభ్యసన లక్ష్యాలు, ఫలితాల పట్ల కొంత పట్టింపును చూపినప్పటికీ, ఏ పంథాను అనుసరించాలనేది రాష్ర్టాలకే వదిలిపెట్టింది. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే, ఉన్నత విద్యా సంస్థలకే వదిలిపెట్టింది. అందువల్ల ఏయే కీలక రంగాలలో మార్పులు అవసరమో గుర్తించి ఉన్నత విద్యారంగానికి తదనుగుణమైన దృక్కోణాన్ని వృద్ధి చేయవలసిన బాధ్యత కొత్త వీసీలపైన, ఉన్నత విద్యా శాఖల అధికారులపైన ఉంటుంది.
విద్యారంగ పరివర్తనకు నిధుల కేటాయింపు ప్రధానమైన అంశం. ప్రస్తుతం జీడీపీలో మూడు శాతం ఉన్న కేటాయింపును ఆరు శాతానికి పెంచాలని ఎన్‌ఈపీ సూచించింది. అంటే కేంద్ర ప్రభుత్వ వాటా 5.6 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఎన్‌ఈపీ లక్ష్య నిర్దేశాలను రాష్ర్టాలు ఏమేర అనుసరిస్తున్నాయనే దాన్ని బట్టి నిధుల కేటాయింపు ఉంటుందనేది లోతుగా పరిశీలిస్తే అవగతమవుతుంది. ఎన్‌ఈపీ లక్ష్యాలను నెరవెర్చే రాష్ర్టాలు ఎక్కువ నిధులు పొందుతాయి. స్థానిక అవసరాలు, జాతీయ, అంతర్జాతీయ సవాళ్ళకు దీటుగా, ఉన్నత విద్యా సంస్థలలో విమర్శనాత్మక ఆలోచనా విధానం పెంచే రీతిలో కోర్సులను తీర్చిదిద్దుకోవడానికి మన రాష్ట్రం ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఈ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే, రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ‘సమయానికి నిధులు’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ, తగిన నిధుల కేటాయింపు వ్యవస్థను నెలకొల్పాలి. దీనివల్ల ఆయా కళాశాలలకు నిధులు సమయానికి చేరుతాయి. వేతనాలు, అభ్యసన పెట్టుబడులు, పరిశోధనలు, ఆవిష్కరణలకు అవసరమైన నిధులు తగిన సమయంలో అందుతాయి. నిధులు మిగిలిపోవడమనే సమస్య తీరుతుంది.

కొవిడ్‌ వేవ్‌లు మానవ మనుగడను అయోమయంలో పడేయడమే కాదు, మానవ విజ్ఞానానికి కూడా పరిమితులు ఉన్నాయనేది బయట పెట్టింది. అయితే ఆవిష్కరణల శక్తిని ఎత్తి చూపింది. వ్యాక్సిన్‌ వృద్ధి గమనంలో హైదరాబాద్‌ పాత్రను కళ్ళకు కట్టింది. కొవిడ్‌ అనంతర ప్రపంచం ఆరోగ్యం, విద్యపై మరింత శ్రద్ధ చూపిస్తుంది. మన రాష్ట్రం దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు.

హైదరాబాద్‌ నగరం ఆసియాకే నాలెడ్జ్‌ హబ్‌గా అవతరిస్తున్నది. అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థలు పబ్లిక్‌ రంగంలో ఉన్నాయి. ఈ పరిశోధనా సంస్థలు ప్రధాన కేంద్రాలుగా, ప్రభుత్వ సంస్థలకు మార్గదర్శకంగా మారే విధంగా సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టాలి. డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్స్‌, ఫాకల్టీ/స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ కోసం, నూతన బోధనా పద్ధతులను ప్రవేశ పెట్టడానికి అంతర్జాతీయ ప్రముఖమైన విశ్వవిద్యాలయాలతో ఎంఓయూలు, ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కొవిడ్‌ వ్యాపించిన నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్యాభ్యాసం సాగించడమనేది మనకు ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది. ఈ డిజిటల్‌ ప్రపంచంలో ఉత్తమ బోధకులు ఎక్కడ ఉన్నా తగిన పారితోషికం ఇచ్చి ఆన్‌లైన్‌ లెక్చర్స్‌, వర్క్‌షాప్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.

అన్ని భాషలలో, అన్ని వయసుల వారికి, అన్ని రకాల కోర్సులకు నాణ్యమైన పాఠ్యపుస్తకాలను ప్రచురించడమనేది ఎన్‌ఈపీ ఉన్నత లక్ష్యాలలో ఒకటి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వంటి సంస్థలు అదనంగా సప్లమెంటరీ మెటీరియల్‌ను డిజిటల్‌ రూపంలో, ప్రింట్‌ రూపంలో తేవచ్చు. లెర్నింగ్‌, కోర్స్‌ మెటీరియల్‌ను ప్రక్షాళన చేయవచ్చు. డిగ్రీ కాలేజీలు క్రమంగా పట్టాలు ఇచ్చే కాలేజీలుగా మారే పరిస్థితి రావాలని ఎన్‌ఈపీ వాంఛిస్తున్నది. ఇందుకు అభివృద్ధిని, వికాసాన్ని, జవాబుదారీతనాన్ని, విద్యానాణ్యతను, నిజాయితీని పెంపొందించే పరిస్థితి ఉండాలి. మన రాష్ట్రంలో మనుగడలో ఉన్న 700 ప్రైవేటు డిగ్రీ కళాశాలలతో పాటు 133 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. 2014లో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు, ‘నాక్‌’ గుర్తింపు గల కళాశాలలు 29 మాత్రమే. ఏడేండ్లలో మరో 35 కళాశాలలు అక్రెడిటేషన్‌ పొందాయి. మరో 15 ఈ క్రమంలో ఉన్నాయి. బెంచ్‌ మార్కింగ్‌, అక్రెడిటేషన్‌ ఉన్నత విద్యా సంస్థలను ముందుకు తీసుకుపోవడంలో కీలకమైనవి. ఇందుకు ఉద్యమ స్ఫూర్తితో సాగాలి. కాలేజీలు హయ్యర్‌ రేటింగ్‌ కోసం ఎంతగా కృషి చేస్తే, విద్యార్థులు అంతగా లబ్ధి పొందుతారు.

ఎన్‌ఈపీ నిర్దేశనల ప్రకారం 2030 నాటికి ప్రతి జిల్లాకు ఉన్నత ప్రమాణాలు గల మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థ కానీ, విశ్వవిద్యాలయం కానీ ఉండాలి. అంటే వచ్చే తొమ్మిదేండ్లలో ఇటువంటి 33 సంస్థలను నెలకొల్పాలి. 2030 నాటికి గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోను 18 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. 2040 నాటికి ఉన్నత విద్యా సంస్థలను మల్టీ డిసిప్లినరీ ఇన్‌స్టిట్యూషన్స్‌గా మార్చాలి. ఎన్‌ఈపీ దృక్కోణానికి అనుగుణంగా కొత్త వీసీలు ప్రణాళికలు రూపొందించుకోవాలి.

2014లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారానికి వచ్చిన వెంటనే వ్యూహాత్మకంగా విద్యుత్‌, నీటిపారుదల రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యుత్‌రంగంలో రాష్ట్రం స్వయం పోషకత్వం సాధించడంతో పాటు నీటిపారుదల రంగంలో చరిత్రను తిరగరాస్తున్నాం. ఈ రెండు రంగాలలో ఘనవిజయం సాధించిన తరువాత, ముఖ్యమంత్రి ఆరోగ్యం, విద్య రంగాలను ప్రధానమైనవిగా గుర్తించారు. ముఖ్యమంత్రి దార్శనిక స్ఫూర్తితో, ఉన్నత విద్యా సంస్థలలోని విజ్ఞాన వ్యవస్థ శక్తియుక్తులతో తెలంగాణను ఆవిష్కరణల కేంద్రంగా మార్చితీరుతాం.
(వ్యాసకర్త: రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు, పార్లమెంటు మాజీ సభ్యులు)

-బి. వినోద్‌ కుమార్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొత్త విద్యకు సమాయత్తం

ట్రెండింగ్‌

Advertisement