e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home ఎడిట్‌ పేజీ కథలు చెబుదాం..కథా నాయకులను చేద్దాం

కథలు చెబుదాం..కథా నాయకులను చేద్దాం

మనషి జీవితంలో బాల్యదశ మధురమైనది. చెలిమె నీటిలా స్వచ్ఛమైనది. బాల్యంలో పడిన ప్రభావాలే పెరిగి పెద్దయ్యాక మార్గదర్శనం చేస్తాయి. బాల్యదశలో పిల్లల్లో నాటిన మానవీయ విలువలే, భవిష్యత్తులో వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దుతాయి. పిల్లలకు సాహిత్యాభిరుచిని కలిగిస్తే అది వారి ఎదుగుదలకు దోహదపడుతుంది. ‘కండపుష్టి ఆధారంగా బరువులు ఎత్తాలి. మానసిక ఎదుగుదల ఆధారంగా విషయాన్ని అందించాలి’. అలా పిల్లలకు అందించే కథలే ‘పిల్లల కథలు’.

పదహారేండ్లలోపు బాల్య కాలంలో ఒక్కో దశకు ఒక్కోరకమైన కథలుంటాయి. ఈ కథలను అనుసరించే వారి శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. వాటి ఆధారంగానే పిల్లల్లో భావోద్రేకస్థాయిలు ఏర్పడతాయి. వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటుంది.

- Advertisement -

ఐదేండ్లలోపు పిల్లలకు రంగురంగుల బొమ్మలతో, సరళమైన పదాలతో నాలుగు పంక్తుల వరకు ఉండే కథలను అందించాలి. ఈ వయస్సు చిన్నారులు ఆశ్చర్యంతోపాటు ఆనందం కలిగే కథలను చదివేలా ప్రోత్సహించాలి. కథల్లో బొమ్మలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఐదు నుంచి పదేండ్లలోపు పిల్లలకు పదాలు, వాక్యాలు చదవడం వస్తుం ది. వీరికి మెదడుకు మేత పెట్టి, ఆలోచింపజేసే కథలు ఇవ్వాలి. ఈ వయసులో నీతిబోధ అవస రం. అందుకు అనుగుణంగా కథలను ఇవ్వాలి. పాట, కథ లాంటి వాటిద్వారా బొమ్మల సహాయం తో వీరికి సాహిత్యాన్ని అందించాలి. పది నుంచి పదహారేండ్ల వయసులోని వారు సమస్యను గుర్తిం చి ఆలోచించగల స్థితిలో ఉంటారు. కాబట్టి, వీరికి సమస్యను విశ్లేషించి, పరిష్కరించే నేర్పును కలిగించే కథలను అందించాలి.

మొదటిరకం కథల్లో సంతోషాన్ని ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగించే అంశాలుండాలి. రెండో రకం కథల్లో భక్తి, స్నేహం, జాలి, కరుణ లాంటి మానవీయ విలువల్ని తెలిపే విషయాలుండాలి. మూడో రకం కథల్లో ఏది మంచి? ఏది చెడు? అని తెలిపే అంశాలు ఉండేలా చూసుకోవాలి. ఇదంతా పెద్దలు పిల్లల కోసం చేయాలి. పిల్లలందరికి కథలు అవసరమే. ఆయా స్థాయిల్లో ఉన్నవారికి అవసరమయ్యే కథలు అందించాలి.

మొత్తంగా పిల్లల మానసిక, బౌద్ధిక, వ్యక్తిగత, శారీరక సమస్యలను తెలుసుకొని, వాటికి కథల ద్వారా పరిష్కారం చూపవచ్చు. ప్రపంచ భాషల్లో అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ‘అలీబాబా 40 దొంగలు’ వంటి ‘అరేబియన్‌ నైట్స్‌’ కథలు, ‘సింద్‌బాద్‌ కథలు’, ‘పంచతంత్రం కథలు..’ ఇలా అనేక రకాల కథలు మానవ జీవితం నుంచి, అనుభవాల్నుంచి వచ్చినవే. ఈ కథలను పెద్దలు పిల్లల కోసం రాశారు. తమ జీవితానుభవాన్ని, అవగాహనను రంగరించి రాసిన కథల్లో పిల్లల సమగ్ర మూర్తిమత్వానికి దోహదపడే లక్షణాలు కనపడతాయి. కొన్ని నిడివిలో చిన్నగా ఉండి, విషయాన్ని సులువుగా అందిస్తాయి. పిల్లల నమ్మకాన్ని చూరగొనేవిగా ఉంటాయి.

భావవ్యక్తీకరణ, సంబంధాలను పెంచుకునేవిగా, సర్దుబాటు నేర్పేవిగా ఉంటాయి. నీతి బోధకంగా ఉంటూనే, ఆలోచనలను రేకెత్తించేవిగా ఉంటాయి. సానుకూల వైఖరులను పెంపొందించేవిగా ఉంటూ, సాహసం, ఆత్మవిశ్వాసం,సహనం, సంతోషం.. లక్షణాలను పెంచి పోషించేవిగా ఉంటాయి. సమాచారం అందిస్తూనే స్వయంగా ఆలోచించగలిగే సామర్థ్యాల్ని అందిస్తాయి, పెంపొందిస్తాయి.

పిల్లల కోసం కథలు రాసే పెద్దలు పిల్లల వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై దృష్టిపెట్టాలి. బాలల కథల్లో చెప్పదగిన అంశాలు: 1.క్రమశిక్షణ, దేశభక్తి, మాత, పిత, అతిథి దేవోభవ అనే విలువల్ని చెప్పాలి. 2. దురాశ, గర్వం, దర్పం, క్రూర త్వం, కృతఘ్నత, అధర్మం, స్వార్థం, అసూయ లాంటి ప్రతికూల విలువలు జీవితంలో ఓడిపోతాయనే నమ్మకం కలిగించాలి. 3.పర్యావరణం, స్త్రీలను గౌరవించడం, రోడ్డు ప్రమాదాలు వంటి అంశాల పట్ల స్పృహను కలిగించే సాంఘిక కథలు రాయాలి. 4.మానవ సంబంధాల (ప్రేమ, దయ మొదలగు విలువల) పట్ల ఆర్తిని పెంపొందించే అంశాలను ఎన్నుకోవాలి. 5.జీవిత పరీక్షలను ఎదుర్కొనేవిధంగా, బలహీనత, అహేతుకతల పట్ల జాగరూకతను నేర్పాలి.పూర్వకాలం నుంచి నేటివరకు వచ్చిన పిల్లల కథలను పరిశీలిస్తే అనేక రకాల కథలు కనపడతాయి. పిల్లల్లో సృజనాత్మకశక్తులను పెంచేవిగా, మానసిక వికాసాన్ని పంచేవిగా పేరుగాంచాయి. వాటిని చదివినట్లయితే పిల్లల పట్ల కథకులకు ఉన్న తపన తెలుస్తుంది. ఒక్కోరకం కథల్లో ఒక్కో విలువ ప్రతిష్టించారు.

1.జానపద కథల్లో- ఆనందం, కాల్పనికత;2.మర్యాదరామన్న కథలు- నీతి ప్రధానం; 3. సాహ స కథలు- చెడుపై గెలుపు, ఊహాశక్తి పెంపు; 4.పూటకూళ్లమ్మ కథలు- మానవత్వం; 5. వీరగాథలు- దేశభక్తి, జాతీయతా భావం; 6. శాస్త్రీయదృష్టిని పెంచే కథలు- సైన్స్‌ ప్రధానం; 7.బోధిసత్వుని కథలు- ధర్మం; 8. విక్రమార్క- భేతాళుడి కథలు- తార్కిక శక్తి; 9.అక్బర్‌- బీర్బల్‌ కథలు- సమయస్ఫూర్తి 10.పరమానందయ్య శిష్యుల కథలు- గురుభక్తి, హాస్యం; 11.తెనాలి రామలింగని కథలు-ముక్తి, హాస్యం; 12.సాంఘిక కథలు- మంచి ని, చట్టాన్ని గౌరవించడం; 13.పర్యావరణ కథలు-ప్రకృతి ప్రేమ, జంతు ప్రేమ; 14.పంచతంత్రం కథలు-లోకరీతి, పరిపాలన; 15.పురాణ కథలు- శక్తి, సత్యం.. తెలిసివస్తాయి. ఈ కథల్లో సంక్షిప్తత, సరళత, సూటిదనం ప్రధానలక్షణాలుగా కనిపిస్తాయి. వీటిని చదివితే పిల్లల్లో పదజాలం, భాష అభివృద్ధి చెందుతాయి.

హాస్యం, కరుణ ప్రధానం:

బాలల కథల్లో హాస్యం, కరుణ ప్రధానంగా ఉండాలి. అవి పిల్లల ఆత్మస్థయిర్యాన్ని, శాస్త్రీయదృష్టిని పెంచేవిగా, ఆనందం పంచేవిగా, సభ్యత, సంస్కారాలు అందించేవిగా ఉండాలి. పెద్దల కథల్లోలాగా వర్ణనలు, హింసాత్మకత, కఠిన వాస్తవాలు ఉండకూడదు. సమకాలీన సమస్యలు వాటిపట్ల స్ఫూర్తిదాయక దృష్టిని కలిగించే కథలు రావాలి. పిల్లలచే కథలు చదివించడమే కాదు, వారిచే కథలు చెప్పించడమూ ముఖ్యమే. కథలు చెప్పడం సామూహిక ప్రక్రియ. కథకుడు, శ్రోతలు ఎదురెదురుగా ఉండటం వల్ల అనేక లాభాలున్నాయి. వారిలో బిడియాన్ని తొలగించవచ్చు. కథల ద్వారా పిల్లలు తమ భావాలను, స్పందనలను తెలుపగలుగుతారు.

పిల్లలు కథలు చెప్పడం వల్ల ప్రయోజనాలు:

1.కథ చెప్పే క్రమంలో ఎలాంటి కథా వస్తువును ఎన్నుకోవాలో తెలుసుకుంటారు. 2.కథలోని పాత్ర ద్వారా ఏమి చెప్పదలచుకున్నారో, ఆ పాత్ర ఎందు కు నచ్చిందో చెప్పగలుగుతారు. 3.సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం తెలుస్తుంది. 4.కథల్లోని సంభాషణలను పలకడం వల్ల ఉచ్ఛారణ మెరుగవుతుంది. భాష పట్టుబడుతుంది. 5.చురుకుగా, తెలివిగా, హాస్యపూరితంగా, మెప్పించే విధంగా మాట్లాడటం అలవాటవుతుంది. 6.కథా సందేశాన్ని జీవితానికి అన్వయించుకునే నేర్పు తెలుస్తుంది. శ్రోతల సందేహాలు విని వివరణ ఇవ్వటం ద్వారా సమస్య పరిష్కార విధానం అబ్బుతుంది. 7.కొంత కథ చెప్పి, శ్రోతలను పూరించేట్లు చేయడం వల్ల సృజనాత్మకత, విషయ విశ్లేషణ చేకూరుతాయి. 8. పిల్లలు తమ సంతోషాలను, సమస్యలను కథల రూపంలో చెప్పగలుగుతారు. దానిద్వారా సుఖదుఃఖాల్ని వెల్లడించగలుగుతారు. 9.కథలు చెప్పడం నేర్చుకోవ డం ద్వారా తమ చుట్టూ జరుగుతున్న మార్పులను గ్రహిస్తారు. సమస్యలకు పరిష్కారాలను, ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తారు. 10.కథ చెప్పే సమయంలో సంఘటనల క్రమాన్ని పాటించాల్సి వస్తుం ది. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

కథ చెప్పడం, కథ వినడం అనేవి పిల్లలను ఇతరులకు దగ్గర చేస్తాయి. వారి అభివృద్ధికి దోహదపడుతాయి. కథలు పరిసరాల్ని, కుటుంబాన్ని, సమాజాన్ని సరళం గా తెలియపరుస్తాయి. అలా పిల్లల్లో గుణాత్మక మార్పును తెస్తాయి. అంతిమంగా కథాపఠనం ద్వారా పిల్లల్లో భాషా పరిజ్ఞానమే కాదు, సృజనాత్మకత పెరుగుతుంది. సమగ్ర మూర్తిమత్వంతో, ఉన్నతమైన వ్యక్తిత్వం గల భావిభారత పౌరులుగా పిల్లలు ఎదుగుతారు.

కథతో 3 రకాల ఉపయోగాలు

  • ఒక తరం నుంచి మరో తరానికి సమాచార వాహికగా వాడవచ్చు.
  • విలువలను, సంప్రదాయాలను, నైతికతను అందించేదిగా మలచవచ్చు.
  • పిల్లల మానసిక పెరుగుదలకు, వారిలో ప్రాపం చిక దృష్టి సంతరించుకునేలా ఉపయోగించవచ్చు.

బీవీఎన్‌ స్వామి
9110313762

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana