e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home ఎడిట్‌ పేజీ పల్లె పల్లెనా ప్రజలు మురిసే..తెలంగాణలోనా..

పల్లె పల్లెనా ప్రజలు మురిసే..తెలంగాణలోనా..

తెలంగాణ రాష్ట్రంలో నూటికి 61 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ర్టాభివృద్ధి అని విశ్వసించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌. అందుకే తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే సదుద్దేశంతో సమగ్ర గ్రామీణాభివృద్ధి విధానాన్ని రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా గ్రామాలు అభివృద్ధి చెందాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. అందులో భాగంగానే గ్రామాల ముఖచిత్రాన్ని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నది.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్ర వికాసానికి దశలవారీగా ప్రయత్నం చేస్తున్నది. మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవన భద్రత కల్పించడానికి చర్యలు తీసుకున్నది. నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడం, ‘మిషన్‌కాకతీయ’ ద్వారా చెరువులను పూడికతీసి బాగుచేయడం, చేతి, కులవృత్తులకు అవసరమైన చేయూతనందించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసింది. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, రుణమాఫీ లాంటి సంక్షేమ పథకాలను అమలుచేసింది. ఆసరా పింఛన్లు, మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ లాంటి ప్రజాసంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రజలకు కనీస భరోసా కల్పిస్తున్నది. ‘మిషన్‌ భగీరథ’ ద్వారా నిరంతర మంచినీటి సరఫరా, 24 గంటల విద్యుత్‌ సరఫరా, రహదారులు, మరుగుదొడ్లు నిర్మాణం లాంటి మౌలికవసతుల కల్పన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించింది.

- Advertisement -

ఆదర్శగ్రామం అంటే గతంలో గంగదేవిపల్లి లాంటి ఏదో ఒక ఊరు పేరు చెప్పుకునేవాళ్లం. అలాంటిది ఇప్పుడు వేల గ్రామాలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. గతంలో గ్రామంలో ఉండాలంటే, గ్రామాలకు రావాలంటే అక్కడేం సౌకర్యాలున్నాయని ప్రజలు ప్రశ్నించేవాళ్లు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పట్టణాల్లో ఉన్నవారు గ్రామంలో కొత్తగా ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకువస్తున్నారు.

‘మిషన్‌ భగీరథ’ ద్వారా నిరంతర మంచినీటి సరఫరా, 24 గంటల కరెంటు, రహదారులు, మరుగుదొడ్లు నిర్మాణం లాంటి మౌలికవసతుల కల్పన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం
ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించింది.

పల్లె ప్రగతి: మలిదశలో గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం చేపట్టి అమలుచేసింది. ఈ కార్యక్రమాన్ని నాలుగు విడతల్లో
గత రెండేండ్లుగా విజయవంతంగా నిర్వహించింది. ‘పల్లె ప్రగతి’లో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కార్యాచరణ రూపొందించారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధికి చేపట్టవలసిన అంశాలపై గ్రామస్థాయిలో ప్రణాళికలు రూపొందించారు. గ్రామసభలు నిర్వహించి ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించారు. దేశంలోనే తొలిసారిగా 12,769 గ్రామాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతి గ్రామంలో వర్క్‌, శానిటేషన్‌, గ్రీన్‌కవర్‌, స్ట్రీట్‌లైట్‌ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రజా సంఘాల కమిటీల్లో 8,29,729 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సభ్యుల్లో 4,03,758 మంది మహిళలున్నారు.

‘పల్లె ప్రగతి’ విజయవంతం: జూలై 1 నుంచి 10వ తేదీవరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘పల్లె ప్రగతి’ నాలుగో విడత కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమ అమలును స్వయంగా పరిశీలించడానికి రాష్ట్రంలోని 16 జిల్లాల్లో పర్యటించాను. గ్రామసభల్లో పాల్గొన్నాను. ఆయా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్‌యార్డులు, ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్ల పనితీరు ఇతర కార్యక్రమాలను స్వయంగా పరిశీలించాను. జగిత్యాల జిల్లా హబ్సీపూర్‌, నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు గ్రామాల్లో పల్లెనిద్ర చేసి మర్నాడు ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాను. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించాను.
‘పల్లె ప్రగతి’ ఫలాలు: గ్రామీణ ప్రాంతాల్లో 6 లక్షల 43 వేల రోడ్లను తుడిచి పరిశుభ్రం చేశాం. 3 లక్షల 52 వేల డ్రైనేజీలను పూడిక తీసి మురుగు, వాననీరు పోవడానికి ఆటంకం లేకుండా చేశాం. లక్షా 64 వేల రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, అంగన్వాడీలు, దవాఖానలను శుభ్రం చేశాం. 51 వేల 215 లోతట్టు ప్రాంతాల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, దవాఖానలు, విద్యాసంస్థల్లో వాననీరు, డ్రైనేజీ నీటి నిల్వకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నాం. 26 వేల విద్యుత్‌ స్తంభాలను, తుప్పుబట్టిన, కుంగిన విద్యుత్‌ స్తంభాల స్థానంలో అవసరమైన చోట కొత్తవి ఏర్పాటుచేశాం. కొత్తగా 32 వేల 186 స్ట్రీట్‌ లైట్లకు మూడవ లైన్‌ వైర్లను అమర్చాం. కొత్తగా 13 వేల 442 విద్యుత్‌ మీటర్లు ఏర్పాటుచేశాం. 1,046 వినియోగం లేని బావులను, 3,909 పనిచేయకుండా ఉన్న బోరుబావులను పూడ్చివేశాం. అసంపూర్తిగా ఉన్న 53 వైకుంఠధామాలు, 27 డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తిచేశాం. గ్రామాల్లో నిర్మించిన 10 వేల 643 వైకుంఠధామాలకు, 10 వేల 542 డంపింగ్‌ యార్డులకు బయో ఫెన్సింగ్‌ చేశాం. కొత్తగా 98 పల్లె ప్రకృతి వనాలు నిర్మించాం. 533 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలకు కావాల్సిన స్థలాలను గుర్తించాం. 17 వేల 453 కి.మీ. పొడవునా రోడ్లకు ఇరువైపులా 70,02,182 మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్‌ చేశాం. గృహస్థులకు ఒక్కో ఇంటికి 6 మొక్కల చొప్పున 46 లక్షల 9 వేల ఇండ్లలో నాటడానికి 3 కోట్ల 80 వేల 945 మొక్కలను పంపిణీ చేశాం. ప్రభుత్వ, ప్రైవేట్‌, సామాజిక ప్రదేశాల్లో నాటడానికి కోటి 16 లక్షల 11 వేల 914 మొక్కలను పంపిణీ చేశాం.

పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీల సరఫరా: రాష్ట్రంలో ఉన్న 12,769 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలను సమకూర్చింది. అన్ని గ్రామాల్లో ఉదయం తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డులకు తరలించడానికి వీటిని వినియోగిస్తున్నారు. అదేవిధంగా ట్రాక్టర్లు, ట్యాంకర్ల సహకారంతో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు నీటి సరఫరా అందిస్తున్నాం. గ్రామానికి అవసరమయ్యే వస్తువులను ఈ యంత్రాల ద్వారా రవాణా చేస్తున్నాం.

వైకుంఠధామాలు: 12,769 గ్రామ పంచాయతీలలో రూ.1,555 కోట్ల వ్యయంతో వైకుంఠధామాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే 12,455 (98 శాతం) వైకుంఠధామాల నిర్మాణం పూర్తయింది.

డంపింగ్‌యార్డులు: 12,769 గ్రామ పంచాయతీల్లో రూ.319 కోట్ల వ్యయంతో డంపింగ్‌ యార్డుల నిర్మాణం చేపట్టగా, అందులో ఇప్పటికే 12,711 డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తయింది. వివిధ స్థాయిల్లో నిర్మాణంలో ఉన్న డంపింగ్‌యార్డ్‌, వైకుంఠధామాల, పల్లె ప్రకృతివనాల నిర్మాణాలను వెంటనే పూర్తిచేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు: రాష్ట్రంలోని అన్ని మండలాలలో బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటవుతున్నాయి. మండల కేంద్రంలో గాని, అదే మండలంలోని మేజర్‌ గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.40 లక్షల వ్యయంతో దాదాపు పదెకరాల విస్తీర్ణంలో ఈ వనాలు ఏర్పాటవుతాయి. ప్రతి వనంలో దాదాపు 31 వేల మొక్కలను ప్రభుత్వమే నాటుతుంది. దానికోసం ఇప్పటివరకు 543 మండలాల్లో భూమిని కూడా గుర్తించాం.

పంచాయతీ, మండలాలకు నిధుల విడుదల: గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ప్రతి నెల రూ.308 కోట్ల గ్రాంటును గ్రామ స్థానికసంస్థలకు విడుదల చేస్తున్నాం. అందులోభాగంగా 2019 సెప్టెంబర్‌ నుంచి ఇప్పటివరకు రూ.6,500 కోట్లను గ్రాంట్‌గా విడుదల చేశాం.

అసంపూర్తిగా ఉన్నపనులకు నిధులు మంజూరు: రాష్ట్రంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం చేపట్టిన అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయడానికి ఒక్కో మంత్రికి రూ.2 కోట్లు, ఒక్కో జిల్లా కలెక్టర్‌కు రూ. ఒక కోటి చొప్పున, అదనపు కలెక్టర్లకు రూ.25 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే పూర్తిచేస్తున్నాం.

నూతన పంచాయతీరాజ్‌ చట్టం: స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం ఉండేవిధంగా నూతన పంచాయతీరాజ్‌ చట్టం చేశాం. వారికి బాధ్యతలతో పాటు విధులు, నిధులు కేటాయించాం. పంచాయతీరాజ్‌ చట్టంలో గ్రీన్‌ బడ్జెట్లో తప్పనిసరిగా 10 శాతం నిధులు కేటాయించాం. దీంతో ప్రతి గ్రామం పచ్చదనంతో కళకళలాడుతుంది.

‘పల్లె ప్రగతి’ నిరంతర ప్రక్రియ: గ్రామాల స్వరూపాన్ని సమగ్రంగా మార్చేందుకు ఉపయోగకరంగా ఉన్న ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని, శ్రద్ధ తీసుకొని వాటిని సంరక్షించాలని, ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు నిర్వహించడం ద్వారా గ్రామాలను నిత్యం శుభ్రంగా ఉంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గ్రామాలు అభివృద్ధి చెందేందుకు అవసరమయ్యే నిధులను పారదర్శకంగా ఖర్చుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ పనులన్ని సజావుగా జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అధికారులచే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నది. ఆదర్శగ్రామం అంటే గతంలో గంగదేవిపల్లి లాంటి ఏదో ఒక ఊరు పేరు చెప్పుకోనేవాళ్లం. అలాంటిది ఇప్పుడు వేల గ్రామాలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. గతంలో గ్రామంలో ఉండాలంటే, గ్రామాలకు రావాలంటే అక్కడేం సౌకర్యాలున్నాయని ప్రజలు ప్రశ్నించేవాళ్లు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పట్టణాల్లో ఉన్నవారు గ్రామంలో కొత్తగా ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకువస్తున్నారు. పల్లెల మీద వారికి నమ్మకం పెరగడం కారణంగానే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఎక్కడో ఒకచోట చిన్నచిన్న లోటుపాట్లు, పనుల మందగమనం ఉండవచ్చు కానీ మొత్తంగా తెలంగాణలో పల్లె సమ గ్ర స్వరూపమే మారిపోయింది.

పల్లె ప్రకృతి వనాలు: రాష్ట్రంలో రూ.116 కోట్లతో 19,492 పల్లె ప్రకృతి వనాలను నిర్మించాం. ఇందులో 19,470 (99.8 శాతం) పూర్తయ్యాయి.

(వ్యాసకర్త: రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖామాత్యులు)

ఎర్రబెల్లి దయాకర్‌రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana