e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home ఎడిట్‌ పేజీ ఆధ్యాత్మిక అస్తిత్వానికి పునరుజ్జీవం

ఆధ్యాత్మిక అస్తిత్వానికి పునరుజ్జీవం

గుర్తింపు, గౌరవం వాటంతటవే సిద్ధించవు. వాటి వెనుక మొక్కవోని దీక్ష, దక్షతలుంటాయి. అశోకుడు మొక్కలు నాటించిండు. కాకతీయులు చెరువులు నిర్మించిండ్రు. గుళ్లు, గోపురాలు కట్టించిండ్రు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారంలో భాగంగా మొక్కలు నాటిస్తున్నరు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తున్నరు. గుళ్లని ఉద్ధరిస్తూ, పునర్నిర్మిస్తున్నరు. అశోకుడిని కేసీఆర్‌ ఎందుకు అనుసరిస్తున్నరు? కాలం కావడానికి, వానలు రావడానికి, వాతావరణ సమతౌల్యానికి, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు తప్ప మరేదిలేదు కాబట్టి. మరి ఆనాటి ఆలయాల పునరుద్ధరణ ఎందుకంటే మన తరతరాల సంస్కృతీసంప్రదాయాలు, విశ్వాసాలు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కాబట్టి.

అవతార మూర్తులతో వెలిసిన దేవాలయాల చరిత్ర, అందులోని నిర్మాణ విశిష్టత, కళానైపుణ్యం మొదలైనవి మనోవిజ్ఞానానికి, మానసికోల్లాసానికి అవసరం. అందుకే కేసీఆర్‌ గుళ్లు, గోపురాల పునరుద్ధరణ చేపట్టిండ్రు. ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలు ఇప్పుడు నిత్యదీపారాధనతో కళకళలాడుతున్నయి.

- Advertisement -

165 నూతన ఆలయాల నిర్మాణం : తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌ సంకల్పంతో ధూప దీప నైవేద్యాల కింద 3,645 ఆలయాలు నిత్య పూజలందుకుంటున్నయి. ఒక్కో ఆలయానికి ప్రభుత్వం ప్రతినెలా రూ.6వేల చొప్పున అందిస్తున్నది. బలహీనవర్గాల కాలనీల్లో ఆలయాలు నిర్మించాలని, గుడికి రూ.10 లక్షల వరకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 165 నూతన ఆలయాలకు రూ.50 కోట్లు కేటాయించింది. మరోవైపు అర్చకుల వేతనాలను పెంచిం ది. ట్రెజరీల నుంచి జీతాలు చెల్లిస్తున్నది. మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్‌, మౌజంలకు ప్రతినెలా రూ.5వేల గౌరవ వేతనం ఇస్తున్నది. గంగాజమునా తెహజీబ్‌ని పరిరక్షిస్తూ, సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే విధంగా బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. ప్రతిఏటా రూ.222 కోట్లతో కోటి 8లక్షల మందికి బతకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నది. 4 లక్షల మంది ముస్లింలకు, 2లక్షల మంది క్రిస్టియన్లకు దుస్తులు పంపిణీ చేస్తున్నది. బతుకమ్మ చీరల పంపిణీ పథకం గిన్నెస్‌ బుక్‌ రికార్డుల్లో కెక్కింది.

పుణ్యక్షేత్రాలకు పూర్వవైభవం: ఉమ్మడి రాష్ట్రంలో పుణ్యక్షేత్రాలు నిర్లక్ష్యానికి గురైనయి. స్వీయ ఆధ్యాత్మిక అస్తిత్వ అవసరాన్ని గుర్తించిన కేసీఆర్‌, సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా ఆలయాల అభివృద్ధిని దశలవారీగా చేపట్టారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టను యాదాద్రిగా తీర్చిదిద్దుతున్నరు. 1900 ఎకరాల భూమిలో రూ.600 కోట్లతో వైటీడీఏ ఆధ్వర్యంలో ఆలయ పునరుద్ధరణ శరవేగంగా పూర్తికావస్తున్నది. 2018-19 బడ్జెట్‌లో వేములవాడ డెవలప్‌మెంట్‌ అథారిటీకి రూ.100 కోట్లు, భద్రాద్రి ఆలయ ఆధునీకరణకు రూ.100 కోట్లు కేటాయించారు. నాగార్జునసాగర్‌ను శ్రీపర్వతారామ బుద్ధవనంగా తీర్చిదిద్దుతున్నరు. 164ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్లతో కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి పరుస్తున్నరు. రూ.కోటితో చారిత్రక ఐనవోలు మల్లికార్జున ఆలయాన్ని ఆధునీకరిస్తున్నరు. ఆది కవి పాల్కుర్కి సోమనాథుడు (పాలకుర్తి), సహజకవి బమ్మెర పోతన (బమ్మెర), రామాయణ కర్త వాల్మీకి తపస్సు చేసిన వాల్మీకిపురం గ్రామాలను కలుపుతూ ఆధ్యాత్మిక, పర్యాటక కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నరు. సీఎం చైర్మన్‌గా టూరిజం ప్రమోషన్‌ బోర్డు కూడా ఏర్పాటైంది.

చెక్కు చెదరని రామప్ప శిల్పకళ: నిర్మాణ విశిష్టత, కళలకు కాణాచి రామప్ప దేవాలయం. నునుపైన బయటి బండరాళ్లపై పడే సూర్య కిరణాలు పరివర్తనం చెంది చిమ్మచీకటిలో ఉండే గర్భగుడిని వెలుగించడం సైన్స్‌ కాక మరేమిటి? కేవలం నాలుగు కాళ్లతో ముగ్గురు మనుషులను చెక్కిన శిల్పి నేర్పరితనానికి కొలమానం లేదు. ఆలయం చుట్టూ 526 ఏనుగుల విగ్రహాలు చూడ ముచ్చటేస్తయి. ఎన్నో పురాణ గాథలను చెప్పే నల్లని రాతి స్తంభాలని చూసి తీరాలె. దర్శించి తరించాలి తప్ప, వర్ణించడానికి ఏ భాషా సరిపోదేమో.

వారసత్వ సంపదగా గుర్తింపు: రామప్ప ఆలయానికి ప్రపంచ గుర్తింపు రావాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించి రామప్ప చుట్టూ ఉన్న లక్నవరం వంటి పర్యాటక ప్రాంతాలను కలుపుతూ, పర్యాటక కారిడార్‌ ఏర్పాటుకు నిర్ణయించారు. కనీసం 15ఎకరాల స్థలాన్ని సేకరించి అభివృద్ధి పనులు చేపట్టారు. కేసీఆర్‌ చేసిన కృషికి ఫలితంగా ప్రపంచ వారసత్వ సంపదగా రామప్పను గుర్తించడం విశేషం. ఇక రామప్ప పురోగతికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సర్వే ఆఫ్‌ ఇండియా, పురాతత్వశాఖ, సాంస్కృతిక శాఖలు పూనుకోవాలె.

వడివడిగా అభివృద్ధి పనులు : రూ.3 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నయి. రూ.కోటితో మెయిన్‌ రోడ్డు నుంచి రామప్ప గుడి తూర్పు ముఖద్వారం వరకు డబుల్‌ రోడ్డు, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌, దేవాలయం నుంచి వాహనాల పార్కింగ్‌ వరకు డబుల్‌ రోడ్డు, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నయి. యునెస్కో నిబంధనలకనుగుణంగా, పర్యాటకులను ఆకర్షించే విధంగా, మార్గదర్శనం చేసే గైడ్స్‌, చరిత్రను తెలియజెప్పే మ్యూజియం, ప్రదర్శనశాల, పార్కింగ్‌ స్థలం, పర్యాటకుల విడిదికి అతిథిగృహాలు, పుస్తక కేంద్రం, భారీ రెస్టారెంట్‌ వంటివి సమకూరిస్తే పర్యాటకులు మరింతగా పెరుగుతారు. తద్వారా పేరుతోపాటు పర్యాటక ప్రాంతంగా గుర్తింపు, నిధుల పెంపు, స్థానికులకు ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. చిన్నపాటి కష్టనష్టాలకు, సర్దుబాట్లకు స్థానికులు సిద్ధంగా ఉండాలె.

మార్గం లక్ష్మీనారాయణ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana