e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home ఎడిట్‌ పేజీ వాటాలు తేల్చకుంటే జగడాలే!

వాటాలు తేల్చకుంటే జగడాలే!

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగించుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ ఇటీవల ఒక గెజిట్‌ను విడుదల చేసింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి ‘కృష్ణా నదీ యాజమాన్య బోర్డు’ (కేఆర్‌ఎంబీ) (ఎస్‌ఓ 2842 ఈ), ‘గోదావరి నదీ యాజమాన్య బోర్డు’ (జీఆర్‌ఎంబీ) (ఎస్‌ఓ 2843 ఈ)ల పరిధిని ఈ గెజిట్‌లో ప్రకటించారు.

2014 మే 28న కేంద్రప్రభుత్వం కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఈ బోర్డుల పరిధిని నిర్ణయించటానికి కేంద్రానికి ఏడేండ్లు పట్టింది. ఇరురాష్ర్టాల్లో ప్రవహిస్తున్న నదీజలాల్లో వాటా విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదం సమసిపోయేలా కేంద్రం ఒక ఆచరణాత్మక పరిష్కారాన్ని చూపుతుందని ఇన్నేండ్లుగా భావిస్తుంటే.. కేంద్రం ఇప్పుడు ఈ గెజిట్‌ను విడుదల చేయటం గమనార్హం.

- Advertisement -

కేంద్రం తాజా చర్యను సైద్ధాంతిక, ఆచరణాత్మక కోణాల నుండి పరిశీలిద్దాం. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీల పరిధిలోకి కృష్ణా, గోదావరి నదుల యావత్తు బేసిన్‌ రాదు. కాబట్టి, నదులపై బోర్డుల నిర్వహణ అనే కేంద్రం నిర్ణయాన్ని పాక్షిక పరిష్కారంగానే భావించాలి. అంతేకాదు, ఈ నిర్ణయంపై బోర్డుల పరిధిలో లేని అనేక అంశాలు ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. భాగస్వామ్య రాష్ర్టాల మధ్య వాటాలను, ఇతర హక్కులను కేటాయించటమే సహజ వనరుల నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక సూత్రం. నదీజాలాల్లో న్యాయంగా దక్కాల్సిన వాటా కోసమే స్వరాష్ట్ర ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అయినా కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ, ఏపీలకు ఆమోదయోగ్యమైన వాటాల పంపిణీ అన్నది నేటికీ కొరకరానికొయ్యగానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో, కేంద్ర నిర్ణయం ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి. రెండు రాష్ర్టాలకు ఏకమొత్తం కేటాయింపులు జరుపకుండా, ప్రాజెక్టులవారీగా నీటిని బోర్డులు ఎలా కేటాయిస్తాయన్నది చూడాలి.

నీళ్లు కేవలం నీళ్లు మాత్రమే కావు.. వాటితో ప్రజల భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. వివాదాలు చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి వివిధ ప్రాజెక్టుల ద్వారా నీటి పంపిణీ అన్నది జరగాలంటే త్వరితగతిన రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోగలగాలి. కానీ, కొద్దికాలంపాటు బోర్డు చైర్మన్‌గా వ్యవహరించే ఓ ‘బయటివ్యక్తి’కి ఈ పని కత్తిమీదసాము వంటిది. అందుకనే బోర్డు చైర్మన్‌గా, సభ్యులుగా నియామకాలు జరపటానికి కేంద్రజలవనరుల శాఖ.. సాంకేతికంగా, నిర్వహణపరంగా మంచి అనుభవం ఉన్న అదనపు కార్యదర్శి స్థాయి అధికారులను తన వద్ద ఉం చుకోవాలి. ఆయా పదవుల్లో నియమితులయ్యే అధికారులు శీఘ్రంగా నిర్ణయాలు తీసుకోవటమే కాదు.. తమ నిర్ణయాలు ఇరు రాష్ర్టాల రాజకీయ నాయకత్వానికి ఆమోదయోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.

ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?

ఒక్కోరాష్ర్టానికి లభించాల్సిన నీటి వాటాను వీలైనంత త్వరగా ఒక ఫార్ములా రూపంలో నిర్ణయించటం అన్నది మొట్టమొదట చేపట్టాల్సిన అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశం. ఆ తర్వాత చేపట్టాల్సిన రెండో అంశం.. ఒక నదికి సంబంధించిన అన్ని రాష్ర్టాలను కలుపుకొని అంతర్రాష్ట్ర నది బోర్డును ఏర్పాటుచేయటం.

  • జలవనరులు అనేవి రాష్ర్టాల పరిధిలోని అంశం. వివిధ రాష్ర్టాల మధ్య ప్రవహించే నదుల విషయంలో తలెత్తే వివాదాలను పరిష్కరించే బాధ్యతను మాత్రమే కేంద్రానికి రాజ్యాంగం ఇచ్చింది. ఈ మేరకు రాజ్యాంగ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి, ఒక చట్టంలోని నిబంధనలకన్నా రాజ్యాంగంలోని ఈ నిబంధనలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
  • డిపెండబుల్‌/మిగులు జలాల ఆధారంగా తమ భూభాగంలో ప్రాజెక్టులను నిర్మించుకునే అధికారం రాష్ర్టాలకు ఉంది. కానీ, కేంద్రం చర్యతో ప్రస్తుతం ఇది మారుతోంది.
  • తమకు కావల్సినన్ని నీళ్లను, కావల్సిన సమయంలో, కావల్సిన ప్రాంతంలో ఇవ్వమంటూ పరస్పరం పోటీ పడుతూ రాష్ర్టాలు చేసే డిమాండ్లను తాను నియమించిన అధికారుల ద్వారా తీర్చటం కేంద్రప్రభుత్వానికి కష్టంగా మారుతుంది. అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల మీద మూడో పక్షం నిర్వహణ వల్ల పక్షపాతం, వివక్ష వంటి ఆరోపణలు తలెత్తే అవకాశం ఉంటుం ది. తద్వారా మరింత న్యాయబద్ధంగా ఉండాల్సిన బాధ్యత చైర్మన్‌పై పెరుగుతుంది.
  • ఇరు రాష్ర్టాలపై ప్రభావం చూపే, నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయటానికి అవసరమైన ఖర్చును ఎవరు భరిస్తారు?
  • నీటి కేటాయింపులపై అసంతృప్తితో ఉన్న రాష్ట్రం న్యాయపోరాటానికి దిగి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే.. ప్రాజెక్టు నియంత్రణసంస్థ (బోర్డు) ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణను చేపడుతుంది అన్నది అత్యంత కీలకమైన అంశం. ప్రాజెక్టుల సిబ్బందిని బోర్డుల నియంత్రణ కిందికి తీసుకురావటం, ఆ సిబ్బంది వేతనాలను మాత్రం రాష్ట్రప్రభుత్వాలు చెల్లించాలనటం, ఒక్కో బోర్డుకు ఇరు రాష్ర్టాలు రూ.200 కోట్ల చొప్పున చెల్లించాలని చెప్పటం వంటి అంశాలు కూడా సున్నితమైనవి.
  • (వ్యాసకర్త: రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana