e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home ఎడిట్‌ పేజీ వైఎస్‌ కూడా తెలంగాణవాదేనా?

వైఎస్‌ కూడా తెలంగాణవాదేనా?

నిజాలేవో, అబద్ధాలేవో ముఖ్యంగా అవి ప్రజలందరికీ సంబంధించినవి అయినప్పుడు స్పష్టంగా తేల్చిచెప్పడం, అబద్ధాలను అటకెక్కించి అంతం చేయడం చాలా అవసరం. ‘హరిలేడు గిరిలేడు’ అంటూ అబద్ధాలాడిన అసురాధీశులు అంతంకాక తప్పలేదు. నిన్నగాక మొన్న కేవలం అబద్ధాల ప్రచారంతో ఈ ప్రపంచంపై ఆధిపత్యం జరుపాలనుకున్న హిట్లర్‌ తన ప్రభుత్వంలో తన అబద్ధాలశాఖ మంత్రిగా గోబెల్స్‌ను నియమించాడు.

హిట్లర్‌ ఆదేశాలతో జాతీయంగా, అంతర్జాతీయంగా అవసరమైన అబద్ధాలను తయారు చేయడం, ప్రచారం చేయడం గోబెల్స్‌ పని. గోబెల్స్‌ అబద్ధాలు ప్రపంచ ప్రచారం, ప్రసిద్ధి పొందాయి. నాడు భారత స్వాతంత్య్ర ఉద్యమ మహా నాయకుడు గాంధీజీ నిజాల కంటే గోబెల్స్‌ అబద్ధాలు ఎక్కువ ప్రచారం పొందాయి. గాంధీజీ నిజాలు శాశ్వతంగా, ఆచంద్రతారార్కం నిలిచి ఉండి మానవాళిపై ప్రభావం కలిగిస్తాయి, కలిగిస్తున్నాయి. గోబెల్స్‌ అబద్ధాలు నాడే నశించాయి.

- Advertisement -

మొన్న ఓ రోజు, ఓ అమ్మాయి అంటున్న మాటలివి, ప్రాధాన్యం లేని ఈ మాటలకు బాగా ప్రచారం లభించాయి. ఎందువల్ల? కారణాలెన్నో. ఇంతకు ఆ అమ్మాయి మాటలివి ‘మా నాన్న ప్రత్యేక తెలంగాణ వాది. ప్రతిక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం ఆరాటపడేవాడు.’ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వివిధ దశల్లో సంబంధం గలవారికి ఆ అమ్మాయి మాటలు అమితాశ్చర్యం కలిగించాయనడంలో సందేహం లేదు.

Thank God. ఆ అమ్మాయి ‘మా నాన్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించాడు. నిర్బంధాలకు, ఆంక్షలకు గురైనాడు’ అని కూడా అననందుకు సంతోషించాలె. నాడు 1948, సెప్టెంబర్‌లో పోలీస్‌ చర్యకు పూర్వం ఎర్రటి రూమీ టోపీలు పెట్టుకొని, మతోన్మాదులతో కలిసి ఎగబడ్డవారు పోలీస్‌ చర్య అనంతరం తెల్ల టోపీలు పెట్టుకొని కొత్త నాయకులుగా చెలామణి అయిన సంగతి జ్ఞాపకం వస్తుంది. ఆంధ్ర ముఖ్యమంత్రులందరూ ప్రాబల్యం వహించి, పెత్తనం చేసి తెలంగాణ రాష్ట్ర డిమాండును, ఉద్యమాలను తీవ్రంగా వ్యతిరేకించారు. నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి ప్రయత్నించారు. అంతేకాదు, తెలంగాణ ప్రజల నీళ్లు, నిధులు, నియామకాలు వంటి న్యాయమైన ఆకాంక్షలను అడుగడుగునా అవహేళన చేశారు. ఇవి ప్రామాణిక గ్రంథరూపం ధరించవలసిన చారిత్రక సత్యాలు. ‘సోనియాగాంధీ మహారాణి కాదు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి’ అని ప్రకటించి తన అనుమతి లేకుండా ప్రత్యేక రాష్ట్రం లభించదని ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ అన్నారు.

తెలంగాణ పట్ల చంద్రబాబు ద్వేషం సంగతి చెప్పవలసిన అవసరం లేదు. చివరి ఆంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఆయన హయాంలో, రాష్ట్ర శాసనసభలో తెలంగాణ పట్ల ఆంధ్ర పాలకవర్గ ద్వేషం విపరీతంగా ప్రదర్శితమమైంది. ‘నేను భీ హైదరాబాదీనే అని’ ఆయన తెలుగు ప్లస్‌ ఉర్దూలో అన్నారు. ‘నేను హైదరాబాద్‌లోనే పుట్టాను’ అని అనడానికి ఆయన సాహసించలేదు. అయితే, ‘తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేస్కోండి’ అని అసెంబ్లీలో అనడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి నైరాశ్యంతో (తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న నైరాశ్యం, నిస్పృహ!) తెగించాడు. మొదటి ఆంధ్ర ముఖ్యమంత్రి.. తెలంగాణ ఉన్నతాధికారులు జిల్లాల్లో ఉండకుండా, విధులను విస్మరించి, హైదరాబాద్‌ వచ్చి పడుకుంటారని విపరీత వ్యాఖ్యలతో అవమానిస్తే బూర్గుల రామకృష్ణారావు (హైదరాబాద్‌ రాష్ట్రం మొదటి, చివరి ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటానికి తన పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు) తెలంగాణ అధికారులు విధులను సక్రమంగా నిర్వహించే సమర్థులని గట్టిగా జవాబిచ్చారు. రెండవ ఆంధ్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఆకాంక్షలను శాశ్వతంగా అణచివేయడానికి మతోన్మాదులకు పదవులిచ్చి, పైసలిచ్చి ప్రోత్సహించారు. గోబెల్స్‌ జర్మనీలో మరణించి ఇండియాలో పుట్టి పెరుగుతున్నాడనిపిస్తున్నది.

ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో, రాష్ట్రంలోని వనరులను ప్రజా ప్రయోజనాల కోసం గరిష్ఠస్థాయిలో ఉపయోగించడం తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమవుతుందని గడిచిన ఏడేండ్లలో స్పష్టంగా నిరూపితమైంది. తెలంగాణ ప్రజల మీద ఎవరికెంత ప్రేమ ఉందో, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరు కంకణధారణ చేశారో ఏడేండ్లలో స్పష్టమైంది. దేశంలోనే రాష్ర్టాన్ని ఆదర్శంగా రూపొందించడానికి ఎంతటి కృషి జరుగుతున్నదో కూడా స్పష్టమవుతున్నది.

దేవులపల్లి ప్రభాకరరావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana