కొన్ని రివాజులెన్నటికీ మారవు
కొన్ని నడకలెన్నటికీ
వంకర గీతలు నడవవు
ఓటమి అంచున గెలుపును
చూడగలిగిన కళ్లు
అలుపెరుగని పోరాటంలో
గాయాలకు బెదరవు
ప్రాణాలను తృణప్రాయమనుకునే బతుకు
చిరునవ్వులనెన్నడు త్యాగం చేయదు
వలస సంకెళ్లను తెంచగలిగిన పట్టుదల
ఇరుకు గోడల నడుమ ఉక్కిరిబిక్కిరవ్వదు
గొప్ప సంకల్పం పోగులు పోగులుగా
తెగిపడి విడిపోకముందే
తనకుతాను తాడై అల్లుకుపోగల ధైర్యాన్ని
ఈ మట్టికి ధారపోస్తుంది
నిలువ నీడ కరువై
జీవితాలు బరువైన ప్రజా కోటికి
ఎండను మింగి
వెన్నెలను కురిపించే అభయాన్ని
కానుకగా ఇస్తుంది
వేలు చూపితే చాలు
కొండనెగబాకగల ప్రజ్ఞను
చీకటి దిగంత రేఖలకు
వెలుతురువు కమ్మని ఆజ్ఞాపిస్తుంది
పులి కడుపున పులే పుడుతుంది
ఫిరంగి కడుపున అగ్గిపిడుగే పుడుతుంది
తలలు తెగిపడినా.. తరాలు పాతబడినా
ఎవడేమనుకున్నా.. మట్టి పొత్తిళ్ల నుంచి
జనం గుండెల్లోంచి
పుట్టుకొచ్చిన నాయకత్వం
చిరునవ్వుకు పదునుపెడుతూ
అడుగులో అడుగేసుకుంటూ
పెద్దపులిలా జనం మధ్యకొచ్చి నిలబడుతుంది
తన భుజాన్నడ్డుపెట్టి
కాడిని నేలకొరగకుండా నిలబెడుతుంది.
–డాక్టర్ బి.బాలకృష్ణ,
99489 97983