e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home ఎడిట్‌ పేజీ ‘చీకటి గెజిట్‌'తో చిక్కులే!

‘చీకటి గెజిట్‌’తో చిక్కులే!

‘చీకటి గెజిట్‌'తో చిక్కులే!

సమైక్య రాష్ట్రంలోనేగాక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కూడా కృష్ణా నదీ జలాల పంపిణీపై వివాదాలు కొనసాగుతున్నాయనేది తెలిసిందే. ఈ వివాదాలకు ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం గోదావరీ జలాల అనుసంధానమేనని నిర్ణయానికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ను ప్రగతి భవన్‌కు ఆహ్వానించి రెండుసార్లు సుదీర్ఘంగా చర్చించి అందుకవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా రెండు రాష్ర్టాల ఇంజినీర్లను కోరారు.

గోదావరి నదీజలాలను వివిధ ప్రాంతాల నుంచి నాగార్జునసాగర్‌కు మళ్లించడానికి ఇంజినీర్లు ఐదు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో నాలుగు ప్రతిపాదనలు తెలంగాణ భూభాగం మీదుగా నీటిని తరలించేవి కాగా ఒక్క ప్రతిపాదన మాత్రం కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ స్టోరేజీ నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా పులిచింతల, టేల్‌పాండ్‌, నాగార్జునసాగర్‌కు గోదావరి జలాలను తరలించేది. ఇప్పటికే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి గోదావరి నీటిని తరలిస్తున్నారు. ఈ ఐదు ప్రతిపాదనలపై తదుపరి చర్చలు ఏ కారణం చేతనో నిలిచిపోయాయి. ఈ లోపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌ ద్వారా మరో ప్రతిపాదనను సిద్ధం చేయించింది. రిజర్వాయర్‌కు తరలించేలా, తెలంగాణ భూభాగాన్ని ముట్టకుండా ఈ ప్రతిపాదనను రూపొందించింది వ్యాప్కోస్‌.

- Advertisement -

పై ఆరు ప్రతిపాదనల్లో ఏ ఒక్కదానికి ఆంధ్రప్రదేశ్‌ సిద్ధపడినా ఇరు రాష్ర్టాల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న కృష్ణాజలాల వివాదాలకు శాశ్వతంగా తెరపడుతుంది. కానీ గత పాలకుల్లాగానే వై.ఎస్‌.జగన్‌ కూడా పరిష్కారం వైపు ఆలోచించకుండా జల వివాదాలను మరింతగా పెంచేలా చర్యలు మొదలుపెట్టారు. అకస్మాత్తుగా రాయలసీమ ఎత్తిపోతల పథకం తెరపైకి తెచ్చారు. ఈ పథకం పూర్తిచేసి రోజుకు మూడున్నర టీఎంసీల కృష్ణా నీటిని +797 అడుగుల లెవెల్‌ (డెడ్‌ స్టోరేజీకి దిగువ) నుంచి సీమ ప్రాజెక్టులకు తరలించాలనేది ఆయన ఆలోచన. కల్వకుర్తి, పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు, శ్రీశైలం ఎడమకాల్వకు నీరు దక్కకుండా చేసే కుట్ర ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఈ పథకం పనులు ఆపాలని కేంద్ర జలసంఘం, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పలుమార్లు ఆదేశించినా ఆంధ్రప్రదేశ్‌ సీఎం ఆ ఆదేశాలను ఖాతరు చేయడం లేదు. దీంతో మరో ప్రత్యామ్నాయం లేదని భావించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృష్ణానదిపై తుంగభద్రానది సంగమస్థలానికి కొంచెం ఎగువన జోగులాంబ బ్యారేజీ నిర్మిస్తామని ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జూన్‌ నెలలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులలో జల విద్యుదుత్పత్తి ప్రారంభించారు. దీనితో ఇరు రాష్ర్టాల నేతల మధ్య వాగ్వాదాలు మొదలయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు లేదా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాలు ఏర్పాటుచేయకుండా ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం జూలై 15 అర్ధరాత్రి ఒక చీకటి గెజిట్‌ను జారీచేసింది. ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న జల వివాదాలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యతను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యం కింద ఉన్న భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులను, సిబ్బందిని, ఆఫీసులను, వాహనాలను, ఫైల్స్‌ను కృష్ణా, గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుల పరిధిలోకి తెస్తూ గెజిట్‌ నోఫికేషన్‌ విడుదల చేసింది. ఈ బోర్డులు స్వతంత్ర సంస్థలని కేంద్రం చెప్తున్నా వీటికి చైర్మన్లను కేంద్ర జలసంఘమే నియమిస్తుంది. బోర్డుల నిర్ణయాలతో ఏ రాష్ట్రం విభేదించినా కేంద్ర ప్రభుత్వానిదే ఈ విషయంలో తుది నిర్ణయం. అపెక్స్‌ కౌన్సిల్‌లో కూడా నిర్ణయాత్మక పాత్ర కేంద్ర జలశక్తి మంత్రిదే. జూలై 15 నాటి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 14 నుంచి అమల్లోకి వస్తుంది. ఆ రోజు నుంచి రెండు రాష్ర్టాల ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్లపై రాష్ట్ర ప్రభుత్వాల అధికారం కనీస స్థాయికి కుదించబడుతుంది. కృష్ణా నదిపై తెలంగాణ రాష్ట్రంలోని 36 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, గోదావరి నదిపైగల 71 ప్రాజెక్టులు, వాటి కాల్వలపై కంట్రోల్‌ బోర్డులకే ఉంటుంది. ‘సొమ్మొకడిది-సోకొకడిది’ అన్నట్లు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సిబ్బంది జీతాలు, పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, బోర్డు నిర్వహణకు రూ.200 కోట్లిచ్చేదీ రాష్ట్రమే. ఈ నదులపై రాజ్యాంగ హక్కు కూడా రాష్ర్టానిదే. తెలంగాణలోని 107 ప్రాజెక్టుల నిర్మాణానికి, ఆధునికీకరణకు, నిర్వహణకు స్వాతంత్య్రానంతరం ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రాష్ర్టానికి ఒక్క జాతీయ ప్రాజెక్టూ ఇవ్వలేదు. రాష్ర్టాల మధ్య జల వివాదాన్ని సాకుగా చూపి చీకటి గెజిట్‌ ద్వారా రెండు రాష్ర్టాల్లోని ప్రాజెక్టులను, సిబ్బందిని తమ కంట్రోల్‌ కిందికి తెచ్చుకోవడం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆశించిన ఫెడరల్‌ స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా?

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014లో కూడా ఎక్కడా రెండు రాష్ర్టాల్లోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవాలని పేర్కొనలేదు. బోర్డు పరిధిని నిర్ణయించే అధికారాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి చట్టం ఇచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకొని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండు రాష్ర్టాల ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి తేవడం ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం- 2014 స్ఫూర్తికి విరుద్ధం. ఈ చీకటి గెజిట్‌ కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి సజీవసాక్ష్యం. ‘ఒకే దేశం- ఒకే విధానం’ పేరుతో రాష్ర్టాల హక్కులను కేం ద్రం కాలరాచి వేస్తోందనడానికి ఈ గెజిట్‌ ఒక ఉదాహరణ. ఈ గెజిట్‌ను అడ్డం పెట్టుకొని నరేంద్ర మోదీ సర్కారు గోదావరి మిగులు జలాలను నదుల అనుసంధానం పేరుతో ఇతర రాష్ర్టాలకు తరలించే ప్రయత్నం చేస్తుంది. రాష్ర్టాల నీటి అవసరాలను ఆసరాగా తీసుకొని బీజేపీయేతర ప్రభుత్వాలను తమ అదుపులో పెట్టుకోవాలని చూస్తున్నది.

ఈ చీకటి గెజిట్‌ అమల్లోకి వస్తే.. తెలంగాణ పరిస్థితి సమైక్య రాష్ట్రం నాటితో పోల్చితే ‘పెనం పై నుంచి పొయ్యి’లో పడిన చందంగా మారుతుంది. కేసీఆర్‌ స్వప్నమైన ‘కోటి ఎకరాల మాగాణం’ అందని ద్రాక్షపండే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అపెక్స్‌ కౌన్సిల్‌లో కేంద్రాన్ని కోరినట్లు కృష్ణా జలాల పునః పంపిణీ జరిగేదాకా ఈ చీకటి గెజిట్‌ను అమలు చేయరాదు. ఏ సమస్యా ఉత్పన్నం కాని గోదావరి ప్రాజెక్టులను గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధి నుంచి వెంటనే మినహాయించాలి. కృష్ణా- గోదావరి జలాల హక్కుల పరిరక్షణ కోసం మరోమారు ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. న్యాయ పోరాటానికి తెలంగాణ సిద్ధం కావాలి.

(వ్యాసకర్త: చైర్మన్‌, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ )

వి.ప్రకాశ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘చీకటి గెజిట్‌'తో చిక్కులే!
‘చీకటి గెజిట్‌'తో చిక్కులే!
‘చీకటి గెజిట్‌'తో చిక్కులే!

ట్రెండింగ్‌

Advertisement