సాహిత్య రథ సారథి
ప్రజా ఉద్యమ వారధి.. అతడే
దాశరథి కృష్ణమాచార్యులు
తెలంగాణ దాస్య విముక్తికి
కలం పోరు సాగించిన వీరుడు
నిజాం నిరంకుశ పాలనపై
అక్షర గళం విప్పిన విప్లవుడు
రజాకారుల గుండెల్లో
కవన ఖడ్గం దింపిన ధీరుడు
రాజరికపు అరాచకాలపై
పద్య ఫిరంగి పేల్చిన శూరుడు
జమీందారుల దాష్టీకాలపై
అగ్నిధార కురిపించిన రౌద్రుడు
దొరతనపు ఆధిపత్యంపై
రుద్రవీణ మోగించిన విక్రముడు
గాలీబు గజళ్లు, షాయరీలతో
హృదులు గెలిచిన సాహితీ రేడు
తెలంగాణ కోటి రతనాల వీణంటూ
ఎలుగెత్తి చాటిన మహా యోధుడు
తరాల బూజు నిజాం రాజంటూ
నిక్కచ్చిగ నినదించిన కవి ధీరుడు
అభ్యుదయ కవితా జలధి
కరుణాపయోనిధి దాశరథి
తెలంగాణ తల్లి నుదుట
వీర తిలకమై ప్రకాశిస్తాడు
తూరుపు కనుమల్లో…
కవన సూరీడై ప్రజ్వలిస్తాడు
(నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి)
–కోడిగూటి తిరుపతి
95739 29493