e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home ఎడిట్‌ పేజీ కేంద్రం చేతిలోకి సహకారం

కేంద్రం చేతిలోకి సహకారం

కేంద్రం చేతిలోకి సహకారం

సహకార వ్యవస్థతో ప్రపంచాన్నే సంభ్రమాశ్చర్యపరిచే ఎంతటి ఘనవిజయాలను సాధించవచ్చో నిరూపించిన ‘అమూల్‌’ బ్రాండ్‌ సృష్టికర్త, మన దేశ క్షీరవిప్లవ పితామహుడు వర్ఘీస్‌ కురియన్‌ శత జయంతి సంవత్సరం ఇది. సరిగ్గా ఇదే ఏడాది కేంద్రంలోని మోదీ సర్కార్‌.. సహకార మంత్రిత్వశాఖ అంటూ ఒక కొత్త మంత్రిత్వశాఖను ఇటీవల ఏర్పాటు చేసింది. ఆ శాఖ ను హోంమంత్రి అమిత్‌ షాకు అప్పగించింది. నోట్లరద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాల్లాగే మోదీ తీసుకున్న ఈ నిర్ణయం కూడా వివాదాస్పదమవుతోంది.

దేశంలో సమాఖ్య విధానానికి నిలువెత్తు నిదర్శనంగా రాష్ర్టాల పరిధిలో ఉన్న సహకార రంగాన్ని తన చెప్పుచేతుల్లో ఉంచుకోవటానికి కేంద్రం ప్రారంభించిన కసరత్తే ఈ కొత్త శాఖ ఏర్పాటు అన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ పూర్తిగా బలహీనపడిన ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీల ద్వారా తనకు ఎదురవుతున్న సవాళ్లను నిర్వీర్యం చేయటానికి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం మోదీ-షా ద్వయం వేసిన రాజకీయ ఎత్తుగడే ఇదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కేంద్రం మాత్రం.. క్షేత్రస్థాయి నుంచి సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి వీలుగా విధాన, న్యాయ, పరిపాలనా పరమైన సంస్కరణలు తీసుకురావటం కోసమే కొత్త మంత్రిత్వశాఖ అంటూ చెప్పుకొన్నది. అయితే, కేంద్రం మాటలను అటు రాష్ర్టాలుగానీ, వివిధ పార్టీల నాయకులుగానీ, ఇటు సహకార సంఘాలుగానీ విశ్వసించే పరిస్థితి ఉందా అన్న ప్రశ్న ఎదురవుతున్నది. ఎందుకంటే, మాటల కంటే ఆచరణే వాస్తవాలను మన కళ్ల ముందు ఉంచుతుంది కాబట్టి. సహకారవ్యవస్థతో మోదీ-అమిత్‌షా చేసిన ‘ప్రయోగాలు’ ఏమిటి? తమ స్వరాష్ట్రం గుజరాత్‌లో ఆ రంగాన్ని వీరిద్దరూ నిర్వీర్యం చేశారా? బలోపేతం చేశారా? అన్న చర్చ ఇప్పుడు ముందుకొచ్చి.. పాత విషయాలు కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి.

- Advertisement -

గుజరాత్‌ను కాంగ్రెస్‌ దశాబ్దాలపాటు పాలించింది. ఆ పార్టీ పునాది అంతా సహకార సంఘాల్లోనే ఉండేది. మోదీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్‌ను బలహీనపర్చటం కోసం సహకారసంఘాలను తీవ్రంగా దెబ్బతీశారన్న ఆరోపణలున్నాయి. వీటిలో సత్యాసత్యాలెలా ఉన్నా.. ఆ రాష్ట్రంలో అటు కాంగ్రెస్‌తోపాటు, ఇటు అమూల్‌ వంటి అతిపెద్ద సహకార వ్యవస్థ దెబ్బతినటం ఒక వాస్తవం. గుజరాత్‌లో కొన్ని లక్షల మంది పాడిరైతుల ఇళ్లలో వెలుగులు నింపి, దేశంలో క్షీరవిప్లవానికి నాంది పలికి, భారతదేశ సహకారోద్యమానికే తలమానికంలా మెరిసిన అమూల్‌ నేడు నష్టాల్లో దిక్కుతోచని స్థితి లో ఉండటం ఒక వాస్త వం. దీనికి బాధ్యత వహించేది ఎవరు? దేశప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌ షా తమ సొంత రాష్ట్రంలోని ఒక మహత్తరవ్యవస్థను ఎందుకు సంరక్షించలేకపోయా రు? అది చేయలేని వాళ్లు దేశంలోని యావత్‌ సహకార సంఘాలను ఎలా గాడినపెట్టగలరు?

మరి, కొత్త మంత్రిత్వశాఖ ఏర్పాటు వెనుక మోదీ-షా లక్ష్యం ఏమైఉంటుంది? దీనిపై పలు విశ్లేషణలు, విమర్శలు, ఆరోపణలు వెలువడుతున్నాయి. వాటిలో ఒకటి.. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను దెబ్బతీయటం. 2024లో మోదీని గద్దె దించటం కోసం విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు పవార్‌ పెద్దదిక్కుగా ఉన్నందున.. ఆయనకు మహారాష్ట్రలో పునాదిగా ఉన్న సహకార చక్కెర మిల్లులను బలహీనపర్చటం కోసమే కేంద్రం ఈ కసరత్తు మొదలుపెట్టిందనేది ఒక వాదన.

రెండు.. కర్ణాటక తప్ప ఇప్పటికీ కొరకరాని కొయ్యగా ఉన్న దక్షిణాదిన బీజేపీ పాగా వేయటానికి ఇదొక వ్యూహం అనేది మరో వాదన. ఇటీవల కేరళ, తమిళనాడు ఎన్నికల్లో ఎన్ని తంటాలు పడినా బీజేపీ కి నిరాశే దక్కింది. కాబట్టి, ఆ రాష్ర్టాల్లో బలంగా ఉన్న సహకార రంగాన్ని గుప్పిట పెట్టుకుంటే దక్షిణాదిన కాషాయజెండా ఎగురవేయవచ్చని భావించి మోదీ సర్కార్‌ ఈ కసరత్తు చేస్తుందన్నది ఒక అభిప్రాయం.

సహకారసంఘాలు చూడటానికి చిన్నవే అయినా వాటి సంఖ్య, వాటి వద్ద ఉన్న నిధులు తక్కువేమీ కాదు. నాబార్డ్‌ 2019-20 వార్షిక నివేదిక ప్రకారం.. దేశంలో 95,238 ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘాలు, 363 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, 33 రాష్ట్ర సహకార బ్యాంకులున్నాయి. రాష్ట్ర సహకార బ్యాంకుల వద్ద ఉన్న పెట్టుబడి రూ.6,104 కోట్లుకాగా, డిపాజిట్లు రూ.1,35,393 కోట్లు. డీసీసీబీల వద్ద పెట్టుబడి రూ.21,447 కోట్లు, డిపాజిట్లు రూ.3,78,248 కోట్లున్నాయి. ఒక్క వ్యవసాయ రంగంలోని సహకారసంఘాలే ఈ స్థాయిలో ఉంటే.. ఇక చక్కెర, జౌళి, పాలు, బ్యాంకింగ్‌, చేనేత తదితర రంగాల్లోని సహకార వ్యవస్థను కూడా లెక్కిస్తే కళ్లు తిరిగే స్థాయిలో నిధులు ఉంటాయి. ఇంతటి భారీస్థాయి నిధులను కలిగి ఉన్న వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకుంటే అటు డబ్బులకు డబ్బులు, ఇటు దేశవ్యాప్త యంత్రాంగం తమ చేతుల్లోకి వస్తుందని కేంద్రం భావించటం ఒక కారణం.
ప్రస్తుతం దేశంలో బీజేపీకి రాజకీయంగా గట్టి సవాళ్లు విసురుతున్నవి దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయపార్టీలే. అటు పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఇటు ఒడిశాలో బీజేడీ వరకూ ప్రాంతీయపార్టీల నుంచే బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీన్ని నివారించి ప్రాంతీయ పార్టీలను బలహీన పర్చాలంటే.. రాష్ర్టాల పరిధిలో ఉన్న సహకారసంఘాలను గుప్పిట పెట్టుకోవటం ఒక మార్గం. దీనివల్లే కొత్తమంతిత్వశాఖ ఏర్పాటన్నది ఒక వాదన.

ఈ అనుమానాల్లో, విశ్లేషణల్లో నిజం ఎంత? కేంద్రం నిజంగానే రాష్ర్టాల పరిధిలోని సహకార వ్యవస్థను గుప్పిట పెట్టుకోవటం సాధ్యమయ్యే పనేనా? ప్రాంతీయ పార్టీలు, ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు.. అన్నింటికీ మించి లక్షలాది సహకార సంఘాలు ఆ ప్రయత్నాన్ని చూస్తూ ఊరుకుంటాయా? అసలే కరోనా నియంత్రణ విషయంలో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వం.. ఇంతటి వివాదాస్పద నిర్ణయాన్ని అమలు చేయగలదా?.. ఇలా అనేక ప్రశ్నలున్నాయి. వీటికి కొంతకాలం ఆగితేగానీ సమాధానం దొరకదు.

కె.వి.రవికుమార్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కేంద్రం చేతిలోకి సహకారం
కేంద్రం చేతిలోకి సహకారం
కేంద్రం చేతిలోకి సహకారం

ట్రెండింగ్‌

Advertisement