e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home ఎడిట్‌ పేజీ చెరువు మట్టే చేనుకు చేవ

చెరువు మట్టే చేనుకు చేవ

వచ్చే ఖరీఫ్‌ పంట కాలానికి యూరియా మినహా ఇతర రసాయనిక ఎరువుల ధరలను ఇఫ్కో గణనీయంగా పెంచింది. 50 కిలోల డీఏపీ ఎరువుల సంచి ధర రూ.1200 నుంచి 1900లకు పెరిగింది. పెరుగుదల 58 శాతం. నత్రజని- ఫాస్ఫరస్‌- పొటాషియం-
సల్ఫర్‌ (ఎన్‌పీకేఎస్‌) మిశ్రమ ఎరువు సంచి ధర రూ.1200 నుంచి రూ.1800లకు పెరిగింది. పెరుగుదల 50 శాతం.

చెరువు మట్టే చేనుకు చేవ

పూడిక మట్టిని చల్లుకున్న రైతులకు మంచి ప్రయోజనాలు దక్కినాయి. వారి పొలాల్లో పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. నేలలో తేమను నిలుపుకునే సామర్థ్యం పెరిగింది. ఆ కారణంగా నీటి తడుల సంఖ్య తగ్గి ఎక్కువ ఆయకట్టుకు నీరందిచగలిగినారని నాబార్డ్‌ వారుపేర్కొన్నారు.
ప్రధానపంటల దిగుబడిలో పెరుగుదల ఈ విధంగా నమోదైంది. వరి దిగుబడి ఎకరానికి 2-5 క్వింటాళ్లు, పత్తి దిగుబడి ఎకరానికి 2- 4 క్వింటాళ్లు, కందుల దిగుబడి ఎకరానికి 0.5- 1.5 క్వింటాళ్లు, మక్క దిగుబడి ఎకరానికి 4- క్వింటాళ్లు.ర

సాయనాల ధరల పెరుగుదల ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే కేంద్ర ఎరువుల మంత్రి ఈ పెరుగుదల రైతులకు వర్తించదని ప్రకటించినప్పటికీ రైతులకు ఎరువులు సరఫరా చేసే ఇఫ్కో నుంచి ఎటువంటి ప్రకటన రాలే దు. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇఫ్కో ఎరువుల కంపెనీల నుంచి పెరిగిన ధరలకు ఎరువులను ఇప్పటికే కొనుగోలు చేసింది కాబట్టి రైతులకు వారు పెరిగిన ధరలకే అమ్ముతారు. ఐదు రాష్ర్టాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రి ఆ కంటి తుడుపు ప్రకటన చేసినారనుకోవచ్చు.

రైతులు పెరిగిన ఎరువుల ధరల భారం నుంచి ఉపశమనం పొందడానికి సంప్రదాయ ఎరువుల వాడకం వైపు దృష్టి మళ్లించాల్సిన అవసరం ఉన్నది. ఇవేమీ రైతులకు కొత్త కాదు. మన రైతాంగం శతాబ్దాలుగా అమలుచేస్తూ వచ్చిన ప్రాచీన విజ్ఞానం. అవే పశువుల పెంట కొట్టుకోవడం, చెరువు పూడిక మట్టిని కొట్టుకోవడం. నదులు, వాగులు మోసుకొచ్చే ఒండ్రు మట్టిలో అనేక పోషక విలువలున్నాయి. తేమను ఎక్కువ కాలం నిలుపుకొనే గుణం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో పూడిక మట్టిని తరలించుకుపోయే విషయంలో విశేషమైన కృషిచేసింది. రైతులు కూడా అద్భుతంగా స్పం దించి రాష్ట్రవ్యాప్తంగా మిషన్‌ కాకతీయ నాలుగు దశలలో ముప్ఫై వేల చెరువుల నుంచి మొత్తం 23.85 కోట్ల క్యూబిక్‌ మీటర్లు అంటే దాదాపు 10 కోట్ల ట్రాక్టర్‌ ట్రిప్పుల పూడిక మట్టిని తవ్వుకపోయి తమ పొలాల్లో, చెలకల్లో చల్లుకున్నారు. ప్రభుత్వం ఏటా ఎండకాలంలో చెరువుల నుంచి పూడిక మట్టిని తరలించుకుపోవచ్చునని, రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు కలిగించరాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా కలె క్టర్లను ఆదేశించారు. సాగునీటి శాఖాధికారులు వారికి సహకరించాలని ఆదేశించడం జరిగింది.

పూడిక మట్టిలో పోషకాలు: పూడిక మట్టి వల్ల ప్రయోజనాలను మిషన్‌ కాకతీయ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. చెరువు పూడికమట్టిని రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చునని, పూడికమట్టిలో తగినంత పాళ్లలో నత్రజని, ఫాస్ఫరస్‌, జింక్‌, బోరాన్‌, సేంద్రియ కార్బన్‌ పదార్థాలు, మొక్కల పెరుగుదలకు దోహ దం చేసే బాక్టీరియా అన్నీ ఒకేచోట లభ్యమవుతాయని పటాన్‌చెరువులో ఉన్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఇక్రిశాట్‌ వారు తమ పరిశోధనల్లో తేల్చారు.


పూడిక మట్టిలో పోషకాలు (కిలోకు): నత్రజని- 720 మి.గ్రా., ఫాస్ఫరస్‌- 320 మి.గ్రా., పొటాషియం- 310 మి.గ్రా., సేంద్రియ కార్బన్లు- 9.1 గ్రాములు, మైక్రోబియల్‌ బయోమాస్‌ కార్బన్లు- 308 మి.గ్రా. (3.8 శాతం). పూడికమట్టి చేనుకు పుష్టి అన్న సంగతి రైతులకు యుగయుగాలుగా తెలుసు. రసాయనిక ఎరువులు లేని కాలంలో రైతులు పశువుల పెం టను, చెరువు మట్టిని తమ పొలాల్లోకి తరలించుకపోయిన సంగతిని గుర్తుచేసుకోవాలి. ఇప్పుడు మళ్లీ మన తాత, తండ్రుల అనుభవ జ్ఞానాన్ని అమలుచేయవలసిన పరిస్థితి వచ్చింది. మిషన్‌ కాకతీయ రెండు దశలు అమలైన తర్వాత నాబార్డ్‌ వారు కూడా పూడికమట్టి చల్లుకున్నందువల్ల వచ్చిన ఫలితాలను అధ్యయనం చేశారు. వారి అధ్యయనం ప్రకారం ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

పూడిక మట్టి వినియోగం ప్రభావాలు: మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో పూడికమట్టి చల్లుకున్నందున రైతులకు ప్రధానంగా రసాయనిక ఎరువుల కొనుగోలులో ఖర్చు తగ్గింది. పంట దిగుబడి ద్వారా ఆదాయం పెరిగింది. పూడిక మట్టిని చల్లుకున్న రైతు కుటుంబాలకు రసాయనిక ఎరువుల వాడకం 35- 50 శాతం తగ్గింది. రైతుకు రసాయనిక ఎరువుల కొనుగోళ్లపై 27.6 శాతం ఆర్థికభారం తగ్గింది. ఎకరానికి రూ.1500- 3000 వరకు పంట రకాన్ని బట్టి ఖర్చు తగ్గిందని నాబార్డ్‌ వారి అధ్యయనంలో తేలింది.

కాబట్టి ఎరువుల ధరలు గణనీయంగా పెరిగిన నేటి పరిస్థితుల్లో రైతాంగం సంప్రదాయిక పద్ధతులకు మళ్లవలసిన అవసరం ఉన్నది. రసాయనిక ఎరువులపై తొలినాళ్లలో ప్రభుత్వాలు ఇచ్చిన సబ్సిడీలను ఇక ఎంత మాత్రం అమలుచేసే అవకాశం లేదు. ఎరువుల ధరల భారం నుంచి ఉపశమనం పొందడానికి పశువుల పెంటను, పూడిక మట్టిని, వర్మీ కాంపోస్ట్‌ తదితర ప్రత్యామ్నాయ ఎరువుల వాడకానికి సిద్ధం కావాలి. మిషన్‌ కాకతీయ ఫలితాలు మన అనుభవంలో తాజాగానే ఉన్నాయి. ఈ అంశంలో వ్యవసాయ శాఖ అధికారులు, సాగునీటి శాఖ అధికారులు మండలస్థాయిలో సమన్వయంతో పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం ఉన్నది.

శ్రీధర్‌రావు దేశ్‌పాండే

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చెరువు మట్టే చేనుకు చేవ

ట్రెండింగ్‌

Advertisement