e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home ఎడిట్‌ పేజీ సంక్షోభంలో చిన్న పరిశ్రమలు

సంక్షోభంలో చిన్న పరిశ్రమలు

సంక్షోభంలో చిన్న పరిశ్రమలు

దేశ ఆర్థికాభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) కరోనా ధాటికి విలవిల్లాడిపోయాయి. కొవిడ్‌ రెండో దశ అనంతరం ఇప్పుడిప్పుడే కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ఈ తరుణంలో ఆకాశాన్నంటుతున్న ముడిసరుకు, ఇంధన ధరలు, నిర్వహణ మూలధనం కొరత ఎంఎస్‌ఎంఈలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అసలే గిరాకీ లేమితో సతమతమవుతున్న ఆ పరిశ్రమలకు ఈ పరిణామాలు మరింత సంకటంగా తయారయ్యాయి.

పరిమిత పెట్టుబడితోనే అధిక ఉత్పత్తి చేస్తూ, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఎంఎస్‌ఎంఈలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. 6.33 కోట్ల ఎంఎస్‌ఎంఈలు వ్యవసాయరంగం తర్వాత 11 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తూ దేశ జీడీపీలో 30 శాతం, పారిశ్రామిక ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతుల్లో 48 శాతం వాటాను కలిగి దాదాపు ఎనిమిది వేల రకాల వస్తువులను తయారు చేస్తున్నాయి. ఈ పరిశ్రమలు 51 శాతం వరకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. ఇటీవల ‘లోకల్‌ సర్కిల్స్‌’ అనే సంస్థ దేశంలోని 171 జిల్లాల్లోని 6 వేల స్టార్టప్స్‌, ఎంఎస్‌ఎంఈలపై కరోనా సెకండ్‌వేవ్‌ చూపిన ప్రభావంపై సర్వే నిర్వహించింది. రానున్న ఆరు నెలల్లో స్టార్టప్స్‌, ఎంఎస్‌ఎంఈల వ్యాపార పరిస్థితి గురించి వాకబు చేయగా.. 37 శాతం సంస్థలు వ్యాపార కార్యకలాపాలను తగ్గించుకుంటాయని వెల్లడైంది. 14 శాతం సంస్థలను మూసివేయొచ్చని, 8 శాతం సంస్థలను విక్రయించే పరిస్థితి ఉందని తెలిసింది. 22 శాతం సంస్థలు మాత్రమే రానున్న రోజుల్లో వ్యాపారవృద్ధిని చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాయి. అదేవిధంగా 41 శాతం స్టార్టప్స్‌, ఎంఎస్‌ఎంఈల వద్ద ఒక నెలకు సరిపడా నగదు నిల్వలు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రభావం వ్యాపార, ఉపాధి అవకాశాలతో పాటు ఆయా కంపెనీల లాభార్జన పై తీవ్ర ప్రభావం చూపింది. ఇటీవల కన్సార్టియం ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌ (సీఐఏ) దేశంలోని 81వేల స్వయం ఉపాధి సంస్థలు, ఎంఎస్‌ఎంఈలపై సర్వే చేపట్టింది. ఆశ్చర్యకరంగా గత ఆర్థిక సంవత్సరంలో 78 శాతం సంస్థలు అసలు లాభాలనే చవిచూడలేదని వెల్లడించింది. మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 12.94 శాతానికి ఎగబాకడం, రిటైల్‌ ద్రవ్యోల్బణం సైతం ఆరు నెలల గరిష్ఠమైన 6.3 శాతానికి పెరగడమే దీనికి నిదర్శనం.

- Advertisement -

ప్రస్తుత సంక్షోభం నుంచి ఉపశమనం కల్పించడానికి జీఎస్టీ టర్నోవర్‌ పరిమితి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ఆర్థికమంత్రికి లేఖ రాస్తూ రాష్ట్రంలో 80 శాతం ఎంఎస్‌ఎంఈలు లాక్‌డౌన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. 25 శాతం చిన్న పరిశ్రమలు పూర్తిగా రాబడిని కోల్పోయాయని తెలిపారు. ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ పథకం మార్గదర్శకాలను విడుదల చేయాలని కోరారు. ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీంను ఎంఎస్‌ఎంఈలకు వర్తింప చేయాలని కీలక సూచనలు చేశారు.

170 ఎంఎస్‌ఎంఈలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలిండియా కౌన్సిల్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎంఎస్‌ఎంఈస్‌ (ఏఐసీఏ) ఎంఎస్‌ఎంఈ దినోత్సవాన్ని (27 జూన్‌) పురస్కరించుకొని ప్రధానికి రాసిన లేఖలో పలు సమస్యలను పేర్కొన్నారు. గత ఏడాది డిమాండ్‌ లేకపోయినప్పటికీ ముడిపదార్థాల ధరలు మాత్రం విపరీతంగా పెరిగాయని తెలిపింది. దీంతో చాలా ఎంఎస్‌ఎంఈలు తమ సరుకులను నష్టాలకు విక్రయించుకునే పరిస్థితి రావడంతో పరిశ్రమలను మూసివేస్తున్నారని పేర్కొనడం గమనార్హం. నిర్వహణ, మూలధన అవసరాలు రెండింతలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం 60 నుండి 65 శాతం పెరిగిందని వాపోయారు. దీనితో పరిశ్రమలు వ్యయాన్ని తగ్గించుకోవడానికి కార్మికుల సంఖ్యను కుదించుకుంటున్నాయి. ముడిపదార్థాల ధరలను పరిశీలిస్తే గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు మైల్డ్‌ స్టీల్‌ ప్లేట్ల ధరలు 82 శాతం, అల్యూమినియం 94 శాతం, కాపర్‌ 120 శాతం, పిగ్‌ ఐరన్‌ 50 శాతం వరకు పెరిగాయి. పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కాగా వస్తువుల తయారీకి ముందస్తుగా ఆర్డర్లు తీసుకున్నందున, ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం తయారు చేసి పాత ధరలకు సరఫరా చేయడం పరిశ్రమలకు పెను సవాలుగా మారింది. పెరిగిన ధరల్లో పది శాతం వరకు భరించడానికి కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నా, అది ఉత్పత్తి వ్యయంలో చాలా స్వల్పం. దీంతో పరిశ్రమలు నష్టపోవాల్సి వస్తుంది.

ఇప్పుడిప్పుడే కార్యకలాపాలను ప్రారంభిస్తున్న పరిశ్రమలను తక్షణమే ఆర్థికంగా ఆదుకొని వాటిని పూర్వవైభవం దిశగా నడిపించాలని పరిశ్రమ వర్గాలు ప్రధానికి రాసిన లేఖలో పునరుద్ఘాటించాయి. స్టీల్‌ ధరలను ప్రభుత్వరంగ సంస్థలు త్రైమాసికానికి ప్రకటిస్తూ, ధరల స్థిరీకరణను కొనసాగించాలని కేంద్రానికి విన్నవించారు. స్టీలు కంపెనీలు ఉత్పత్తిలో 40 శాతం వరకు ‘స్టీల్‌ బ్యాంక్‌’ను ఏర్పాటు చేసి ఎంఎస్‌ఎంఈల కోసం రిజర్వ్‌గా ఉంచే విధంగా కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా సరఫరా చేయలేక ఆర్డర్లు రద్దు చేసుకొనే పరిశ్రమలను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టకుండా, జరిమానా విధించకుండా కేంద్రం ఆదేశాలు జారీ చేయాలన్నారు. తక్షణమే సుంకాలను తగ్గించాలని కోరారు. తమ సర్వే నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈలను గాడిన పెట్టడానికి కన్సార్టియం ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌ (సీఐఏ) పలు సిఫారసులు చేసింది. వీటిలో ముఖ్యమైనవి శాసనాత్మక చెల్లింపుల నుండి మినహాయించడం, అత్యధిక వడ్డీ భారం నుండి రక్షించడం, సులభతర రుణాల ద్వారా చేయూతనివ్వడం. నష్టపోయిన ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, దీనికోసం స్టేట్‌ ఫెసిలిటేషన్‌ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది.

కేంద్ర ఆర్థికమంత్రి రూ.6.29 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో భాగంగా రూ.1.5లక్షల కోట్ల ఈసీఎల్‌ జీఎస్‌ రుణాలు, 25 లక్షల మందికి రూ.1.25 లక్షల చొప్పున అందించే రుణాలు కొంత వరకు ఊరట కలిగించే అంశాలు. వివిధ పరిశ్రమల వర్గాలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని ఇటు ముడి పదార్థాలు, ఇంధన ధరల కట్టడికి, అటు ఎంఎస్‌ఎంఈలను తిరిగి గాడిన పెట్టడానికి అవసరమైన చర్యలను ప్రకటించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి బంగారు బాతు లాంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తక్షణమే ఆదుకోవడం సముచితం! (వ్యాసకర్త: కామర్స్‌ సహాయ ఆచార్యులు)

డా. ఎం. మల్లారెడ్డి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సంక్షోభంలో చిన్న పరిశ్రమలు
సంక్షోభంలో చిన్న పరిశ్రమలు
సంక్షోభంలో చిన్న పరిశ్రమలు

ట్రెండింగ్‌

Advertisement