e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home ఎడిట్‌ పేజీ నాయినా.. మల్ల నాగలి వట్టిన్నె!

నాయినా.. మల్ల నాగలి వట్టిన్నె!

నాయినా.. మల్ల నాగలి వట్టిన్నె!

1985 అనుకుంటా.. ‘ఓరి బాషుగా..’ అమ్మ ఒక్కటేమొకాన కేకలేస్తున్నది. మా ఇంటి పక్కకున్న సోపతి శాబ్‌ మామ గానింట్ల సదువుకుంటున్నం. అప్పుడు మేం మూడో తరగతిల ఉన్నం గావొచ్చు. ‘ఏందే అవ్వా.. ఏమో బాగొర్రుతున్నవ్‌, ఆడ సదువుకుంటున్నా అంటే మనసున వట్టకుంటే ఒక్కటే ఒర్రుడా? ఊకే..’, ‘నీ సదువు సందుగుల వెట్ట గని,పోరగాండ్లు పొద్దుగాళ్లనంగ వోయిర్రా.. కొంచెం ఈ సద్ది వాళ్లకిచ్చిరార, పోరగాండ్లు ఆకలికి సత్తర్రా.., అసలే ఆడి పోరగాండ్లు’.. అని సద్దిగిన్నె చేతిల వెట్టింది వెంకటలచ్చవ్వ.

మాఇంటి కాన్నుంచి మా పొలం కిలోమీటర్‌ దూరముంటది. సద్ది క్యారల్‌కు కట్టి, సైకిలందుకొని పొలం కాడికి రయ్యిన వొయిన. పొలం కాడ మావోళ్లను సూసేసరికి నా పంచపానాలు గాలిల కలిసినయి. పేరుకే ఏడెకరాల బూమి. దాంట్ల ఎన్నడు నాలుగిత్తుల వడ్లు పండింది లేదు. యాసంగి ఎట్లాగూ పంట రాదు. వానకాలం ఒక డల్లు కొట్టంగనే మా నాయిన పెద్దోల్ల రామయ్య ఇద్దరక్కలను తీసుకొని పొద్దుగాల ఆరు గొట్టంగనే పొలం కాడికచ్చిండు. ఎండకు ఎండిపోయి ఉన్న భూతల్లి నీటిసుక్క కోసం గోసగోసోలె సూసినట్టుంది. ఇట్లా వాన పడ్డదో లేదో గుటుక్కున మింగింది. కుడి దిక్కు భారతక్క, ఎడమ దిక్కు చంద్రక్క .. వాళ్ల భుజాల మీద కాని. వాళ్లెనుక నాగలి పట్టుకొని నాయిన. నాగలి బల్మీట్టికి సాగుతున్నది. పొద్దున ఆరింటికి నాగలి వడితే మడి ఇంకా ఒక్క సాలు కూడా గాలె. ఇద్దరక్కల మొకాలు వాడిపోయినై. బట్టలు చెమటల తడిసి ఉన్నయి. నన్ను చూసి ఒడ్డుకు చేరిన ఆ ముగ్గురు మొసగొడ్తున్నరు. దబ్బదబ్బ వొయి వాళ్లందర్ని కూసోవెట్టి సద్దిప్పిన. ఆ సద్దిలున్నది మక్క గట్క, మాడికాయ తొక్కు.

- Advertisement -

నేను నలుగురి తర్వాత పుట్టిన మగపోరన్ని. అందుకేనేమో అవ్వానాయినకు నేనంటే బమ. కోపెన బియ్యం ఎన్నస్తుండనో ఏమో గని నాకు మాత్రం అవ్వ రోజుకో పూట తెల్లబువ్వ అండిపెట్టేది. అక్కలు చేసే కట్టం సూసినంక నేనారోజు నుంచి తెల్ల బువ్వ బంజేసిన. మక్కలేసేటందుకు మస్తు కట్టపడే అక్కలను వదిలిపెట్టి నేను తెల్లబువ్వ తినుడేందనిపించింది. తెల్లబువ్వ కొద్దిగంతైనా మంచిదే గనీ అందరికి సమానంగా పంచాల్సిందేనని పట్టువట్టిన. నా కన్నా ముందు నలుగురక్కలు. నా ఎనుక చెల్లె, ఆఖరికి తమ్ముడు. ఇంట్ల మొత్తం తొమ్మండుగురం. నా పేరు ఆకుల భాస్కర్‌, మాది సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బం జరుపల్లె. అవ్వానాయినలు తన కట్టంతోనే ఐదుగురు అక్కాచెల్లెండ్ల పెండ్లిల్లు చేసిర్రు.

2010.. అవ్వ, నాయిన, నేను, తమ్ముడు నలుగురం మక్కశేన్ల మక్కది జూడు దీత్తున్నం. నాయినో కాడున్నడు, మేం ముగ్గరమో కాడున్నం. ఒక్కటేమొకాన మక్కశేన్లకు దొంగెడ్లు సొచ్చినట్టే ఆ మూలకు ఏదో సప్పుడినిపించింది. ఉన్న ముగ్గురం ఉరికిసూత్తె మక్క సొప్పకొరిగున్నడు నాయిన. ‘నాయినా.. ఓ నాయినా..’ పిలిసి సూత్తె ఊ.. లేదు, ఆ.. లేదు. నేను, తమ్ముడు చెరో భుజం మీదేస్కొని ఆటో కోసం ఉర్కినం. ఎదురుంగొచ్చిన ఆటోల ఏస్కొని సిద్దిపేటకు వొయ్యేసరికి జీవునం పోనే పోయింది…వానకాలం ఒక్క పంటైనా తీసేటోళ్లం, నాయిన పోవడంతోటి అది కూడా బందైంది. మా భూమిల తుమ్మలు మొలిసినై. ఉన్నొక్క బాయిల నీళ్ల జాడ లేదు.

ఎవుసం జేత్తె బట్టపొట్టకు ఎల్లుడే కట్టమైపాయె. అందుకని బొంబాయికి పోయిన. అక్కడ నన్ను బిగారి భాస్కరనేది. మేస్త్రీ కింద సిమెంటు, కంకర, ఇసుక అందిచ్చేటోళ్లను బిగారి అంటరు. ఆడ కొన్నొద్దులే ఉన్న. మల్ల సిద్దిపేటకు చేరిన. డ్రైవర్‌ పన్జేసిన, కూలీనాలీ చేసిన. సిద్దిపేటల నేను చేయని పన్లేదు. ఓ రోజు ‘భాస్కరన్నా నీకేందుకే ఈ కూలీ పని, సక్కగా నీకున్న భూమిల నువ్వు ఎవుసం జేసుకున్నా రాజు లెక్క బతుకుతవ్‌’ అన్నరొగలు. ఆయినకేమెర్క నా బాద.. నీళ్లేని ఎవుసం ఎట్ల జేస్తం. నా కట్టం నేను వడ్డ. పెండ్లాం, పిల్లలున్నరు గదా!

తెలంగాణొచ్చింది.. ‘రైతుబంధు’ పతకం కింద పైసలేసుడు షురూ అయింది. మా ఏడెకరాల భూమి ముగ్గురి పేరు మీద నపరింత ఉంటది. మా ముగ్గురి అకౌంట్ల పైసలు వడ్డయి. పడావు భూమి అసలిగ పనికే రాదనుకున్న. అసొంటి భూమి పేరు మీద సర్కారు పైసలేసింది. సిద్దిపేటల ఉన్న నేను ఎంబడే బంజరుపల్లెకు మకాం మార్సిన. ఆ ఏడెకరాల భూమిని ట్రాక్టర్లతోని లెవల్‌ కొట్టిచ్చిన. నాయినోల్ల నాయిన అంటే మా తాత నర్సయ్య కాలంల తవ్విన బాయి… మా నాయిన కాలంల ఎండిపోయింది. ఇప్పుడదే బాయిల మల్ల ఊట వడ్డది. రంగనాయకసాగర్‌ మా బంజరుపల్లె నుం చి పదిహేను కిలోమీటర్లుంటది. అందుకనేమో మా బాయిల కూడా ఊట వడ్డది.

మా పొలంలున్న నాయిన రామయ్య గోరిని రోజు సూత్తుంటె.. ఎంత గోసపడ్డవే నాయినా అనిపిస్తది.. నా కండ్లల్ల నీల్లూరుతయి.. ఆయన దీవెనార్థులు రోజు తీస్కుంటున్న. నాయిన నేర్పిచ్చిన ఎవుసమే ఇప్పుడు మాకు జీవనాదారమైంది. అయినా మాకు రైతుబంధు పైసలు వడకుంటే, మా ఊళ్లెకు రంగనాయక్‌సాగర్‌ నీళ్లు రాకుంటే నేను మల్ల ఎవుసం జేత్తుంటినా..?
నా చేత నాగలి వట్టించిన కేసీఆర్‌, పార వట్టించిన హరీశ్‌రావు సార్ల రుణం ఎట్లా తీర్చుకునేది!

-గడ్డం సతీష్‌, 99590 59041

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాయినా.. మల్ల నాగలి వట్టిన్నె!
నాయినా.. మల్ల నాగలి వట్టిన్నె!
నాయినా.. మల్ల నాగలి వట్టిన్నె!

ట్రెండింగ్‌

Advertisement