e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home ఎడిట్‌ పేజీ భాషా నైపుణ్యాలపైనే దృష్టి

భాషా నైపుణ్యాలపైనే దృష్టి

భాషా నైపుణ్యాలపైనే దృష్టి

ఈ మధ్య ఒక వీడియో వైరలయింది. అందులో ఆరేండ్ల వయస్సు పాప తన వయస్సు వారికి, ఇతర పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు ఒకటి తరువాత ఒకటి సబ్జెక్టులు గుప్పిస్తుంటే ఎంత కష్టంగా ఉందో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చక్కగా వివరించింది. నిజానికి ఆమె ముద్దు మాటల్లో మన విద్యావ్యవస్థలో ఉన్న లోపాలు, చేయవలసిన మార్పులు తెలుస్తున్నాయి.

భాష నేర్చుకోవటం, సాంకేతిక అంశాలు నేర్చుకోవటం కంటే భిన్నంగా ఉంటుంది. దానికి హృదయ స్పందన అవసరమవుతుంది. ఇది పాఠశాల స్థాయిలోనే ఎదుగుతున్న వయస్సు వారికి అబ్బుతుంది. 14 సంవత్సరాల తర్వాత భాషలు నేర్చుకోవటం కష్టమవుతుందని పరిశోధనలు నిరూపించాయి.

- Advertisement -

మన దేశం ఒకే భాషా సంస్కృతుల వ్యవస్థ కాదు. శతాబ్దాల తరబడి వివిధ రాజ్యాలుగా ఉండి, వివిధ భాషలు, సంస్కృతులు, విదేశీ దండయాత్రల ఫలితంగా వివిధ మతాలు ఏర్పడిన వైవిధ్యభరిత ఉపఖండం. ఇంగ్లీషు ద్వారా బోధన మొదలైన తరువాత 1947 దాకా రాజకీయ కారణాలతో ప్రాంతీయ భాషలను కొంతవరకు నిర్లక్ష్యం చేయటం జరిగింది. అయితే విద్య అందరికీ అందించటంలో విఫలమైన (స్వాతంత్య్రానంతరం కూడా) ప్రభుత్వాల వల్ల ఈ భాషలకు మేలు జరిగి, ఇంకా వాడుక భాషలుగానే ఉన్నాయి. కానీ ఈ వైవిధ్యాన్ని అర్థం చేసుకోని విద్యావేత్తల వల్ల సమాజంలో చాలా ప్రతికూలతలు, వైరుధ్యాలు పెరిగాయి. భాషల ఔన్నత్యంపై అవగాహన ఉన్న విద్యావేత్తలు ఈ డబ్బు ఏండ్లుగా మొత్తుకుంటున్నా భాషా బోధన మెరుగుపడలేదు, భాషా విధానాన్ని సరిగా రూపొందించలేదు. ఈ వైఫల్యం వ్యాసం మొదట్లో చెప్పిన పాప వీడియోలో తేటతెల్లమైంది. నిజానికి కొవిడ్‌ మహమ్మారి చాలా విషయాల్లో మన కళ్ళు తెరిపించింది. ఈ ఏడాది కాలం ఆన్‌లైన్‌ టీచింగ్‌తో మనం పాఠశాల విద్యార్థులను ఎలా తీర్చిదిద్దగలిగి ఉండవచ్చో విశ్లేషిద్దాం!

మన దేశంలో ప్రతి విద్యార్థి ఎదుర్కొనే సమస్య భాషా నైపుణ్యాలు. ప్రపంచ భాష అయిన ఇంగ్లీషు తప్పనిసరిగా నేర్చుకోవలసినదే. దానికి తోడు దేశ భాష నేర్చుకోవాలి. అయితే దేశంలో చాలామందికి ఎందుకూ పనికిరాని హిందీని రాష్ట్ర భాషగా నిర్ణయించటం వల్ల విద్యావ్యవస్థ మీదే కాక చిన్నపిల్లల వ్యక్తిత్వ వికాసం మీద కూడా దెబ్బ పడింది. దాని బదులు సంస్కృతం, ఉర్దూ భాషలను రాష్ట్ర భాషలుగా గుర్తించి వాటిలో ఒకటి, ఇంగ్లిషు, మాతృభాషలను త్రిభాషా సూత్రంలో చేర్చి ఉంటే ఇంత గందరగోళ పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే ఉర్దూ మాతృభాష అయినవారు మూడో భాషను ఎన్నుకోవచ్చు. అది పర్షియన్‌ గానీ, అరెబిక్‌ గానీ అవ్వచ్చు. ఇతర భారతీయ భాషలన్నీ సంస్కృతం నుంచి పుట్టినవే గనుక వారికీ సులభమయ్యేది. పైగా పాఠశాల స్థాయిలో సంస్కృతం నేర్చుకోవడం వల్ల ముఖ్యమైన లాభాలు రెండున్నాయి. ఒకటి సంస్కృత భాష నేర్పినప్పుడు కూడా పిల్లల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అంశాలే ఉంటాయి.

ఉదాహరణకు పంచతంత్ర కథలలో నీతి, నిజాయితీ, త్యాగం, మంచితనం, ధైర్యం, సమాజ స్పృహ ఉంటాయి. మోసం, అసత్య ప్రవర్తన, చెడు మొదలైన వాటిని ఎట్లా రూపుమాపాలి వంటి అంశాలు ఉంటాయి. వీటిని చదువడం వల్ల పిల్లల వ్యక్తిత్వం అలవోకగా ఎదుగుతుంది. మంచీ-చెడూ, ధర్మం-అధర్మం, నీతి-అవినీతి మధ్యనున్న వ్యత్యాసం అర్థం చేసుకోవటమే కాక మంచి వ్యక్తులుగా వారిని రూపుదిద్దుకునేట్టు చేస్తాయి ఈ కథలు. ఇంకా సుభాషితాలు ఒక్కో పద్యం ఒక్కో రత్నం. అయితే వీటిని పాఠశాల స్థాయిలో చెప్పాలంటే భాషా నైపుణ్యాల బోధన మీద కూడా దృష్టి ఉండాలి. ఇది జరిగితే పిల్లలు తమ సంస్కృతిని అవగాహన చేసుకుంటారు. ఇంగ్లీష్‌ మీడియంలోనే చదువుకున్న తమిళ, మలయాళ విద్యార్థులకు, తెలుగు విద్యార్థులకు ఉండే వ్యత్యాసం చూస్తే ఈ విష యం అర్థమవుతుంది. సంస్కృత భాష పలికినప్పుడు బ్రెయిన్‌లోని కణా లు ఉత్తేజితమవుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇలా సంస్కృతం, మాతృభాష ఇంకా ఇంగ్లీషు నేర్పిస్తే వారికి ఏ భాషలో ఏ అంశాన్ని చదువుకోవటానికీ కష్టం ఉండదు. పైగా మాతృభాషపై పట్టు ఉన్నవారికి భావ ప్రకటనా నైపుణ్యాలు పుష్కలంగా పెరుగుతాయి. సాహిత్యాన్ని ఆస్వాదించగలుగుతారు.

ఆన్‌లైన్‌ టీచింగ్‌కు, భాషా బోధనకు ఉన్న సంబంధం చూద్దాం. కరోనా వలన నిజంగా నష్టపోయింది బాల్యావస్థలో ఉన్నవారే! ఎదిగే వయసులో సరైన వాతావరణం ఉండటం వ్యక్తిత్వ వికాసానికి అతి ముఖ్యమైన అంశం. అమెరికాలో పదివేల మంది నేరస్థుల మీద పరిశోధనలు చేశారు. వారిలో 95 శాతం మంది- తల్లిదండ్రుల పోట్లాటలు, విడాకులు, వివాహేతర సంబంధాలు కలిగి ఉండటం వంటి నేపథ్యంలో పెరిగినవారు. అంటే పెరుగుతున్న వాతావరణం చిన్న వయస్సులో ఎంత ముఖ్య మో ఈ ఉదాహరణ నిరూపిస్తుంది. అలా ప్రస్తుతం విద్యార్థులు కూడా చాలామంది ఇంటి వాతావరణంలో ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో భాషలు కూడా సరిగా రానివారికి అన్ని సబ్జెక్టులు ఆన్‌లైన్‌లో బోధించటం అవసరమా? అంతకంటే మూడు భాషలు – వారు చదవవలసినవి ఒక్కొక్కటి గంటన్నర చొప్పున పాటలు, పద్యా లు, కథల ద్వారా బోధించి వారికి ఉత్సాహం కలిగించి ఆ భాషల నైపుణ్యాలు పెరిగేటట్టు చేస్తే తర్వాత సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌ వంటివి వారే చదువుకుంటారు కదా! కథ లు చెప్పి వీడియోలు వేస్తే చూడని పిల్లలుంటారా? ఇంత సాంకేతికత పెరిగి, ఇన్ని మెటీరియల్స్‌ ఉన్నా మనం వాటి ని ఎందుకు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. నార్వే వంటి దేశాలలో లాగా బోధన చేయలేమా?

ఇంకొక విచిత్రమైన విషయం. కంప్యూటరు ఒక సబ్జెక్టుగా అన్ని సాంకేతిక పదాలతో ప్రైమరీ, సెకండరీ స్థాయిలలో విద్యార్థులకు బోధించటం అవసరమా? దానిబదులు కంప్యూటర్‌ ఎలా ఉపయోగించాలో చెప్పటం తేలిక? రెండేండ్ల పసివాళ్ళు సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీయగలిగే ఈ కాలంలో కంప్యూటర్‌ ఎలా ఉపయోగించాలో చెప్పాలి కానీ, వాటి గురించిన సిద్ధాంతాలు, చరిత్ర ఎందుకు బోధించాలి? ఈ విషయాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి, ఈ ఏడాది భాషా బోధన మీద దృష్టి మళ్లిస్తే పాఠశాల విద్యార్థులు నైపుణ్యాలు సంతరించుకొని భవిష్యత్తు చదువుకు సిద్ధమవుతారు. ప్రస్తుత కాలాన్ని సంతోషంగా గడుపుతారు. వ్యక్తిత్వ వికాసం జరిగే అంశాన్ని భాషా సాహిత్యాల ద్వారా మాత్రమే బోధించగలం కాబట్టి ఈ అంశాల మీద దృష్టిపెట్టాలి.

కనకదుర్గ దంటు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భాషా నైపుణ్యాలపైనే దృష్టి
భాషా నైపుణ్యాలపైనే దృష్టి
భాషా నైపుణ్యాలపైనే దృష్టి

ట్రెండింగ్‌

Advertisement