e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home Top Slides నటన ఎవరిది..నడిపేది ఎవరు?

నటన ఎవరిది..నడిపేది ఎవరు?

నటన ఎవరిది..నడిపేది ఎవరు?

తీరంలో నౌక. నిండుగా ప్రయాణికులు. అందరిలోనూ గమ్యం చేరాలనే ఆశ. తెర చాపపై ఒక పక్షి వచ్చి వాలింది. రెక్కలు అల్లార్చింది. సరంగు అప్పుడే నౌకను కదిలించాడు. ‘నేను రెక్కలాడించగానే నౌక కదిలింది.ఎంత గొప్పదాన్నో కదా’ అనుకుంది పక్షి. సరంగు తన పని తాను చేసుకుపోతున్నాడు. నౌక ముందుకు సాగుతూ ఉంది. కాసేపటికి ఆ పక్షి ఎగిరిపోయింది. మరో పక్షి వచ్చి వాలింది. అదీ అలాగే అనుకుంది. ఆ తర్వాత ఇంకో పక్షి. అనంతరం వేరే పక్షి… పక్షులు వస్తూనే ఉన్నాయి. వాలుతూనే ఉన్నాయి. తామే నౌకను నడిపిస్తున్నామని భ్రమిస్తూ, ఇంకేవో ఆశలను ఆకాంక్షిస్తూ ,ఎగిరిపోతున్నాయి.కానీ సరంగు అక్కడే ఉన్నాడు. గండాలు, సుడి గుండాలు, సవ్వడులూ రువ్వడుల నుంచి నౌకను క్షేమంగా దాటిస్తూ, సురక్షితంగా గమ్యం దిశగా సాగుతున్నాడు. ఎగిరిపోయే పక్షులు ఎవరికి కావాలి. అందరి దృష్టీ చేరాల్సిన గమ్యం పైనే.. చేర్చే సరంగుపైనే!

ప్రతి మనిషికీ ఒక లక్ష్యం ఉంటుంది. దాని కోసమే స్కీం వేసుకుంటాడు. ‘బలంగా కనిపించేదానిలో చేరడం, మన పని చేసుకోవడం’ అన్నది మోస్ట్‌ పాపులర్‌ స్కీం. అది పీడీఎస్‌యూలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, టీఆర్‌ఎస్‌లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చివరికి కులమైనా కావచ్చు! స్కీం ప్రకారం పని జరిగినంత సేపూ ఏ లొల్లీ లేదు. స్కీం అమలుకు సిద్ధాంతాన్ని వాడినప్పుడే సమస్యంతా! ఎందుకంటే సిద్ధాంతం చెప్పినప్పుడు… సిద్ధాంత నిబద్ధతనో, పార్టీ అనుబంధమో, ప్రాంతాభిమానమో, నాయకత్వ బంధమో, భావజాల బంధుత్వమో, ఏదో ఒకటి ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా బంధం ‘భూ’ భ్రమణం చేస్తున్నప్పుడు, ఆత్మ ఆస్తుల చుట్టూ పరిభ్రమిస్తున్నప్పుడు, చూపు పైస మీద మాత్రమే ఆనుతుంది; అనుబంధాలపై కాదు. పైస తీరు ఇంతే. ఆశ రీతి అంతే!

ఇతరులను అహంభావులు అంటూ ముద్ర వేసే ముందు మన అహంకారం మాటేమిటి? తను బంధం నుంచి తప్పించుకోవడానికి ఎదుటివారిలో తప్పులెన్నితే ఎట్లా? రంధ్రాన్వేషణ అనే దుర్గుణం అలవాటైతే జీవితాంతం కలసి బతికిన వ్యక్తిలో కూడా రోజూ తప్పులే కనిపిస్తాయి. ‘కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ’ అన్లేదా శతకకారుడు! జరుగుతున్నది అదే. నిన్నటిదాకా దేవుడన్న వ్యక్తి దయ్యమయ్యాడు. నిన్నటిదాకా తెగిడిన పార్టీ పొగడ చెట్టు నీడయ్యింది. తేడా ఎక్కడ వచ్చింది? జీవితమంతా నటించడం సాధ్యం కాదు. జీవితాన్నే నటనగా మార్చుకున్నవారు, ఎప్పుడో ఒకసారి ముసుగు జారిపోయి, అసలు రంగు బయటపడి, రంగస్థలంపై అభాసుపాలు కాక తప్పదు. ‘యవ్వనం, ధన సంపత్తి, అధికారమవివేకతా.. ఏకైకమప్యనర్థాయ కిముయత్ర చతుష్టయం?’ ఆస్తులపై ప్రేమకు తోడు అధికార దాహమనే ఆలోచన పుట్టాక ఎవరెన్ని చెబితే మాత్రం ఏం ఉపయోగం? మెత్తటి మాట, కత్తుల ఆట ఎంతోకాలం కలిసి సాగవు.

‘భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వు,
దాన హీను జూచి ధనము నవ్వు,
కదన భీతు చూసి కాలుడు నవ్వురా’

అన్నాడు వేమన. మన మార్గం సజావుగా లేనప్పుడు, మనసు మాట మనం విననప్పుడు, మనం ఏది మన బలం అనుకుంటామో, అదే మన బలహీనత అవుతుంది. ఇది కాలం నిరూపించిన సత్యం. ఏ కులం బలమనుకుంటామో, ఎకరాల కొద్దీ భూమి బలమనుకుంటామో, ఏ మాటకారితనం మన బలమనుకుంటామో… నిజాయతీ లోపించినప్పుడు అవే బలహీనతలై మనల్ని వెక్కిరిస్తాయి. 16 ఏళ్లు వేలుపట్టుకుని నడిపించిన తర్వాత కూడా ఒంటరి యుద్ధానికి భయపడే వ్యక్తి, ఉద్యమమంతా నేనే నడిపించిన అంటే ఎట్లా నమ్మేది? ఆస్తుల ఆశలో చిక్కినప్పుడు, అనుబంధాలు, విధేయతలు, భావజాలాలు ఏవీ గుర్తుండవు. ‘నాలో ఉన్నది కమ్యూనిస్టు డీఎన్‌ఏనే, డబ్బు ఖర్చవుతుందనే పార్టీ పెట్టలేద’నే వారు, కాషాయం కప్పుకొంటానంటే, కప్పేవారికైనా ఉండాలి. కప్పించుకునేవారికైనా ఉండాలి. ప్రజలు అమాయకులని అతిగా నమ్మేవారు మాత్రమే ఇలాంటి పని చేయగలరు. అందుకే అంటారు.. ఆశకు వంతన లేదు, పైసకు పొంతన లేదు అని! ప్రవచిస్తున్నది ఏ విలువలు? ప్రయాణించేది ఏ మార్గం? తామెక్కించుకుంటున్న పడవకు వేసిన రంగు ఎవరి రక్త తర్పణం?
తను ఆచరిస్తూ, ఇతరులను కూడా తన సిద్ధాంతానికి దృష్టాంతాలుగా మార్చేవాడు మహా నాయకుడవుతాడు. ఆ స్థాయి, శక్తి లేదనుకుంటే, తానన్న దానికైనా తాను నిలబడాలె. నిలువుటద్దంలా కనబడాలె! ఇన్నేళ్లు పదవుల్లో ఉన్నప్పుడు, అవకాశం లభించినప్పుడు, ఆసరా దొరికినప్పుడు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి. ఒక భావ ధారను వ్యాప్తి చేయాలి. భావజాలాన్ని సృష్టించాలి. కానీ అభివృద్ధి చెందినవి అవి కావే! మరేవి? కళ్లముందు కనిపించడం లేదా? కారణం మనసు వ్యాపారం మీద ఉంది; ప్రాంతం మీద, ప్రజల మీద కాదు. అది తప్పేం కాదు; ఎవరిష్టం వారిది. ఎవరి లెక్క వారిది. చెబుతున్నది స్కీం గురించి మాత్రమే. పరమార్థం స్వలాభమే!

అందుకే చేసిన తప్పులోంచి పుట్టే న్యూనతే తత్తరపాటై పట్టిస్తుంది. నడిచే బాట సరికాదని, కళ తప్పిన మొహమే సాక్షమై చెబుతుంది! ఆస్తులనే అలంకారాలుగా భావించినప్పుడు ఆత్మగౌరవాల ప్రసక్తి ఎక్కడిది? ‘మానావమానంబులు దేహంబునకేగాని ఆత్మ కుంజెందనేరవు’ అన్నారు మా గురువుగారు. కృష్ణభగవానుడు గీతలో అన్నట్టు ‘నిప్పులో కాలని, నీటిలో తడవని’ ఆత్మకు ఈ గౌరవాల గోల ఏల? పాత్ర రాజకీయం నుంచి వ్యాపారంలోకి మారినపుడు కనిపించేవి లాభనష్టాలు మాత్రమే! ‘పరిభాష’లో చెప్పాలంటే… లాభాలిచ్చే, లేదా నష్టాల నుంచి రక్షించే ‘షెల్టర్‌జోనే’ ఏకైక గమ్యం అప్పుడు!

తెలంగాణలో ‘తెలంగాణను’ తేనిది ఎవరు? మూడున్నర కోట్ల ప్రజలూ అందులో సమభాగస్వాములే! కానీ ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు మేమే తెచ్చాం తెలంగాణ అని అంటుంటే.. మరి జనం… స్టేక్‌హోల్డర్స్‌.. ఒకరినే ఎందుకు నమ్మారు? ఎందుకాయన వెనకే నిలిచారు? తెలంగాణ కోసం కట్టుబడి ఉంట అన్నడు. ఉన్నడు. విజయాలు ఎదురేగినా, అపజయాలు అపహసించినా, నిరోధాలతో నీరసించినా, అవరోధాలు అడ్డమొచ్చినా అదే మార్గంలో సాగిపోతున్నడు. ఎందుకంటే ఆయన ప్రజలను నమ్ముకున్నారు. ప్రజలు ఆయన్ను నమ్ముకున్నారు.

తెలంగాణలో ‘తెలంగాణను’ తేనిది ఎవరు? మూడున్నర కోట్ల ప్రజలూ అందులో సమభాగస్వాములే! కానీ ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు మేమే తెచ్చాం తెలంగాణ అని అంటుంటే.. మరి జనం… స్టేక్‌హోల్డర్స్‌.. ఒకరినే ఎందుకు నమ్మారు? ఎందుకాయన వెనకే నిలిచారు? ఎందుకంటే తెలంగాణ కోసం కట్టుబడి ఉంట అన్నడు. ఉన్నడు. విజయాలు ఎదురేగినా, అపజయాలు అపహసించినా, నిరోధాలతో నీరసించినా, అవరోధాలు అడ్డమొచ్చినా అదే మార్గంలో సాగిపోతున్నడు. అందుకే ప్రజలు ఆయన్ను నమ్ముకున్నారు..ఆయన ప్రజలను నమ్ముకున్నారు.

ఆ ఒక్కడు ఎందరినో తొక్కేశాడని కదా విమర్శ. బ్యాలెన్సింగ్‌ బలంగా ఉండే ప్రజాస్వామ్య యుగంలో ఎవరిని ఎవరు తొక్కగలరు? ఆయన వద్దనుకున్నంత మాత్రాన వాళ్లెందుకు అనామకులైపోయారు? వారి గొప్పతనాన్ని గుర్తించి ప్రజలెందుకు అందలమెక్కించ లేదు? పోనీ ఆయన్ను వద్దనుకున్న వాైళ్లెనా ప్రజల ఆదరం పొందవచ్చు కదా! ఎందుకు జరగలేదు? సోకాల్డ్‌ మేధావుల ఆక్షేపణ ఏమిటంటే… వారిని కూడా ‘కోదండం’ వేయించేటంత గొప్పవాళ్లా తెలంగాణ ప్రజలు అని! అదే మేధావులకు, నాయకులకు ఉండే తేడా. ప్రజలు చెప్పినట్టు నడుచుకుని నాయకుడు వారిని మెప్పిస్తాడు, లేదా తను చెప్పినట్టు వారు నడిచేలా ఒప్పిస్తాడు. మేధావులు తాము చెప్పినట్టు మాత్రమే ప్రజలు చేయాలనుకుంటారు. అందుకే మేధావులు ఎప్పుడూ నాయకులు కాలేరు

తెలంగాణను ఎవరు చేజిక్కించుకోవాలన్నా, తెలంగాణలో ఎవరు తమ ఎజెండా అమలు చేయాలన్నా ఉన్నది ఒకే ఒక్క మార్గం…ఆ ఒక్కడి అడ్డు తొలగించుకోవడం. వారికి- తెలంగాణకు మధ్య ఉన్న ఒకే ఒక్క అవరోధం ఒక బక్కోడు. పరాయి శక్తులకైనా, తెలంగాణలోని వారి తాబేదార్లకైనా అడ్డు అతడొక్కడే! అతడు లక్ష్యంగా 20 ఏళ్ల నుంచి ఎన్ని కుట్రలు! పక్కనుండే పావుల్ని కదిలిస్తే, రాజుకు చెక్‌ పెట్టవచ్చన్నది వారి అహేతుక వ్యూహం. ఆయన్ని వ్యతిరేకించే వాళ్లను, వ్యతిరేకించేట్టు చేసిన వాళ్లను చేర్చుకోవడమే సిద్ధాంతం. ఆ వలలో అనేకమంది పడ్డరు. ఇప్పుడు పడింది తాజా పావు. కానీ ఇది పదహారు పావుల చదరంగం కాదు. మూడున్నర కోట్ల ప్రజల రాజకీయ రణరంగం.

రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఫస్ట్‌ క్వాలిటీ. ప్రజల వద్ద అయినా; అధినాయకుడి వైద్దెనా! ప్రజల వద్ద విశ్వసనీయత కాపాడుకున్నాడు కనుకే తెలంగాణ సాధించగలిగాడు. తొలిసారి గెలువగలిగాడు. పరిపాలించి మెప్పించగలిగాడు. ఆ విశ్వసనీయత లేదు కనుకే మిగతావారు కనుమరుగైపోయారు. అయినా చంకనెక్కించుకుంటే.. నీకంటే పెద్దయ్యానని నెత్తిమీద మొత్తితే ఎట్లా? ఎత్తుకున్న పెద్ద ఎవరో, ఎగబాకే చిన్నోడెవరో తెలిసే కదా ప్రజలు పదేపదే గుణపాఠం నేర్పుతున్నది? అది తెలుసుకోకుండా, అసాధ్యమనుకున్న తెలంగాణను తెచ్చుకున్న ప్రజల వివేకాన్నా తప్పుబట్టేది? తెలంగాణను ఎవరు చేజిక్కించుకోవాలన్నా, తెలంగాణలో ఎవరు తమ ఎజెండా అమలు చేయాలన్నా ఉన్నది ఒకే ఒక్క మార్గం… ఆ ఒక్కడి అడ్డు తొలగించుకోవడం. వారికి- తెలంగాణకు మధ్య ఉన్న ఒకే ఒక్క అవరోధం ఒక బక్కోడు. పరాయి శక్తులకైనా, తెలంగాణలోని వారి తాబేదార్లకైనా అడ్డు అతడొక్కడే! అతడే లక్ష్యంగా 20 ఏళ్ల నుంచి ఎన్ని కుట్రలు! పక్కనుండే పావుల్ని కదిలిస్తే, రాజుకు చెక్‌ పెట్టవచ్చన్నది వారి అహేతుక వ్యూహం. ఆయన్ని వ్యతిరేకించే వాళ్లను, వ్యతిరేకించేట్టు చేసిన వాళ్లను చేర్చుకోవడమే సిద్ధాంతం. ఆ వలలో అనేకమంది పడ్డరు. ఇప్పుడు పడింది తాజా పావు. కానీ ఇది పదహారు పావుల చదరంగం కాదు. మూడున్నర కోట్ల ప్రజల రాజకీయ రణరంగం. సోకాల్డ్‌ మేధావులు ఆ సోయి తెచ్చుకోవాలి.

జీవితంలో ఒక క్షణం వస్తుంది. అటా? ఇటా? మనం ఎటు? అని తేల్చుకోవాల్సిన క్షణం. ఆ క్షణంలో మనం తీసుకునే నిర్ణయమే మనం ఎక్కడ ఉంటామో, ఎట్లా ఉంటామో నిర్ణయిస్తుంది. ఆ క్షణంలో నిజాయతీగా నిర్ణయం తీసుకున్న వాళ్లనే జనం నమ్ముకున్నరు. వాళ్లూ జనాన్ని నమ్ముకున్నరు. నాయకుడెప్పుడూ కుట్రలకు కుంగిపోరు. కుట్రదారులకు లొంగిపోరు. నమ్ముకున్న ప్రజల సేవలో నిమగ్నమై, పోరాటంలోనే విజయాన్ని వెతుక్కుంటడు తప్ప వెన్ను చూపి పారిపోయి షెల్టర్‌జోన్లో దాక్కోరు. పగలు ప్రతీకారాలు ఎలా ఉంటాయో, పక్కరాష్ర్టాన్నో, పైనున్న వారినో చూస్తే తెలియడం లేదా? ఇక్కడేం జరుగుతున్నదో తెలియదా? పనికిమాలిన కుట్రల విషయమై సమయాన్ని వృథా చేయకుండా తను నమ్మిన మార్గంలో, తనను నమ్ముకున్న వారి కోసం నాయకుడు ప్రయాణిస్తూనే ఉంటాడు.

మొహం లేనివాడు మొఖాయబిళ్లకు పొయినాడని సామెత. ప్రవచించేవి విలువలు కావు, ఆచరించేవి మాత్రమే విలువలు. కమ్యూనిస్టులుగా చలామణి అయ్యేవాళ్లు, చెప్పేదొకటి చేసేదొకటి అన్న నా ప్రగాఢ నమ్మకం మరోమారు రుజువైంది. ఎంతైనా ఎడమ చేయి ఎడం చేయే! సోకాల్డ్‌ మేధావులు ఎంత మేకప్‌ చేసినా నాయకులను తయారు చేయలేరు. ఎన్ని బద్దలు కట్టినా నేతలుగా నిలబెట్టలేరు. ఈ ప్రపంచంలో మేధావులెన్నడూ చరిత్రను సృష్టించలేదు. చరిత్రను సృష్టించింది ప్రజలే! ప్రజలే చరిత్ర నిర్మాతలని కదా నినాదం. కుట్ర శిబిరాల్లో చరిత్ర లేఖనం జరగదు. క్లాసులు తీసుకుంటే నాయకులు తయారు కారు. అర్ధరాత్రి రహస్య మంతనాల మధ్య సిద్ధాంత రచన సాధ్యం కాదు. సోకాల్డ్‌ మేధావుల్లారా… తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదనే మీ బాధ ఇప్పట్లో తీరేది కాదు. మీకు, మీరు నమ్ముకున్న వారికి, మిమ్మల్ని నమ్ముకున్నవారికి అందరికీ ఆశాభంగం తప్పదు. బాహర్‌ వాలా అందర్‌ అవుతున్నప్పుడు నినాదాలేవీ మోగవు.. వినిపించేవి మీ ఆర్తనాదాలే!

నటన ఎవరిది..నడిపేది ఎవరు?

తిగుళ్ల కృష్ణమూర్తి
[email protected]

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నటన ఎవరిది..నడిపేది ఎవరు?

ట్రెండింగ్‌

Advertisement