e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home ఎడిట్‌ పేజీ జ్వర సర్వే

జ్వర సర్వే

జ్వర సర్వే

కొవిడ్‌ మహమ్మారి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇంకా జాగ్రత్తలు అవసరం అయినందు వల్ల లాక్‌డౌన్‌ను పొడిగించక తప్ప లేదు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూనే, ప్రజలకు వెసులుబాటు కల్పించడానికి సడలింపు సమయాన్ని పెంచింది. దీనివల్ల దిగువ మధ్యతరగతి, రెక్కాడితే కానీ డొక్కాడని అట్టడుగు వర్గాలకు ఊరట కలుగుతుంది. ఆర్థిక, సామాజిక కార్యకలాపాలు సజావుగా సాగుతూనే, వీలైనంతగా కొవిడ్‌ను నిలువరించే వాస్తవిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది. లాక్‌డౌన్‌ ద్వారానే కరోనాను కట్టడి చేయలేము. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పరివిధాల చర్యలు తీసుకుంటున్నది. ఈ చర్యలలో ఇటీవల చేపట్టిన జ్వర సర్వే ప్రధానమైనదిగా మారింది. ప్రధాని మోదీ కూడా జ్వర సర్వేను చేపట్టమని ఇతర రాష్ర్టాలకు సూచించడం గమనార్హం. ఇతర రంగాల మాదిరిగానే కరోనా కట్టడి చర్యలలోనూ తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా మారిందనడానికి ఇది తాజా ఉదాహరణ.

విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే క్రమంలో మనం కొన్ని ఉత్తమ విధానాలను రూపొందించుకోగలుగుతాం. జ్వర సర్వే కూడా అటువంటిదే. దేశవ్యాప్త సగటుతో పోలిస్తే తెలంగాణలో కొవిడ్‌ పరీక్షల సంఖ్య ఎక్కువగానే ఉన్నది. కానీ మహమ్మారి తీవ్రత నేపథ్యంలో ఎంతమందికి సోకిందనేది పరీక్షించడానికి మనకున్న హంగులు సరిపోవు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి జ్వర సర్వేను చేపట్టింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వాటికి మందుల కిట్‌ ఇస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల బృందాలు పర్యటిస్తూ జ్వర సర్వే సాగించడం అసాధారణ ప్రక్రియ. పేదలు, గిరిజన కుటుంబాల వద్దకు వెళ్లి కరోనా ఉన్నా లేకున్నా వ్యాధులకు మందులు ఇచ్చి జాగ్రత్తలు చెప్పడం గొప్ప విషయం.

కొందరు వంకర బుద్ధి కలవారికి ఏది చూసినా తప్పుగానే కనబడుతుంది. దేశ చరిత్రలోనే అత్యంత విస్తృతమైన రీతిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేపడుతున్న బృహత్‌కార్యక్రమాన్ని ప్రశంసించవలసింది పోయి, రంధ్రాన్వేషణ చేయడం అల్పబుద్ధికి నిదర్శనం. కరోనా పాజిటివ్‌ కేసుల లెక్కకు, జ్వర సర్వే ఫలితాలకు పొంతన లేదని వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరంగా ఉన్నది. కొవిడ్‌ వ్యాప్తిని కారణంగా తీసుకొని ప్రజలందరికి సాధారణ వ్యాధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చికిత్స అందించే ఏర్పాటు చేస్తున్నది. వైద్య వసతులను భారీగా విస్తరించింది. కరోనా అడుగు పెట్టడానికి చాలా కాలం ముందే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ట పరచడం ప్రారంభించారు. సర్కారు దవాఖానలపై నమ్మకం పెరిగి ప్రజలు రావడం మొదలైంది. లేకపోతే కరోనాను ఎదుర్కొనడం చాలా కష్టంగా ఉండేది. కరోనాతో నిమిత్తం లేకుండానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించే దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నది. ఆ క్రమంలోనే జ్వర సర్వేను విజయవంతంగా చేపట్టగలిగింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జ్వర సర్వే

ట్రెండింగ్‌

Advertisement