e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home ఎడిట్‌ పేజీ సమరం నుంచి సంక్షేమం దాకా..

సమరం నుంచి సంక్షేమం దాకా..

(నేటితో టీజేఎఫ్‌కు ఇరువై ఏండ్లు)
ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ జర్నలిస్టులతో కిటకిటలాడుతున్నది. అంతటా ఒక సంబురం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న సకల జనుల, సబ్బండవర్ణాల రెక్కల్ల బొక్కల్ల మెసిలిన జర్నలిస్టులు. ‘తెలంగాణ పక్షమే మా పక్షం’ అని నినదించిన జర్నలిస్టులు. ఇప్పటివరకు పదివేల మంది జర్నలిస్టులతో ఒక సమావేశం జరిగిన చరిత్ర లేదు. తెలంగాణ సాధన పోరాటంలో నాయకత్వం వహించిన కేసీఆర్‌ రానే వచ్చారు. ‘తెలంగాణ జర్నలిస్టు ఫోరం’ నుంచి తెలంగాణ సాధన అనంతరం ‘తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం’గా రూపుదిద్దుకున్న ‘టీయూడబ్ల్యూజే’ లోగోను, తెరదీసి ఆవిష్కరించారు.

‘పుట్టినరోజు శుభదినం కదా! మరణించిన కుటుంబాలు అంటే అశుభం’ అని కొందరు అభ్యంతరం చెప్తే ఆయన అన్న మాటలు ఇవి. ‘పుట్టినరోజు నాడు జర్నలిస్టు కుటుంబాలకు సేవ చేయడం కన్నా పుణ్యం ఏముంటుంది’ అని. కేసీఆర్‌ ప్రతిపాదించి కేటాయించిన ‘జర్నలిస్టు నిధి’ నుంచి నాడు వందమంది జర్నలిస్టు కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ జరిగింది.

ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయితే అందే సంక్షేమం ఇవ్వాళ తెలంగాణ జర్నలిస్టులు అనుభవిస్తున్నారు. కానీ జర్నలిస్టుల సమస్యలు అనంతం, వాటి పరిష్కారం అవశ్యం. అది నిరంతర ప్రక్రియ. సంప్రదింపుల ద్వారా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడమే మార్గం.

సమరం నుంచి సంక్షేమం దాకా..

కేసీఆర్‌కు టీజేఎఫ్‌కు తొలినాళ్ల సంబంధం పెద్దగా లేదు. తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్‌ ఏ రాజకీయ పార్టీతో కానీ, సంస్థలతో కానీ, చివరికి జేఏసీలతో కానీ కలవలేదు. ‘అందరికి కావాల్సిన వాళ్లుగా’ ఉండాలనీ అలాంటి విలువను పాటించింది ఫోరమే. కేసీఆర్‌ నిరాహార దీక్షకు నిర్ణయం తీసుకున్నప్పుడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యాం. కేసీఆర్‌ సుదీర్ఘంగా మాట్లాడారు. మాకు అప్పటిదాకా ఉన్న దురభిప్రాయాలు పటాపంచలయ్యాయి. మాతో ఆయన భోజనం చేశారు. అక్కడినుంచి తెలంగాణ తల్లి విగ్రహం దాకా సాగనంపాం. మీ వెంట మేమున్నాం అని చెప్పివచ్చాం. అది మొదలు అనేక సభల్లో కేసీఆర్‌తో తెలంగాణ జర్నలిస్టు ఫోరం వేదికలు పంచుకున్నది. క్లిష్ట సమయాల్లో కేసీఆర్‌ మేధో మథనాలకు టీజేఎఫ్‌ కూడా హాజరైంది. తెలంగాణ సాధన అనంతరం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ సభ కోసం మళ్లీ కలిశాం. మళ్లీ సుదీర్ఘ చర్చ. వేదిక కర్తవ్యం పూర్తయింది. తెలంగాణ వచ్చింది. ఇక తెలంగాణ జర్నలిస్టులకు జరగాల్సిన మేలు, సంక్షేమం ఇతరాల గురించి ‘సంఘం’గా మారుస్తాం’ అన్నాం. తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్‌ ఉద్యమ ప్రతీక ‘ఆ పేరే బాగుంటుంది కదా’ అన్నారాయన. సరే చర్చ అనంతరం ఆయన అంగీకరించి సభ బ్రహ్మాండంగా జరగాలని అప్పటికప్పుడు అయిదు లక్షల రూపాయల చెక్కు రాసి ఇచ్చారు. ‘ఇది పార్లమెంట్‌లో నా వేతనం చెక్కు.. మీకు ఇస్తున్నా’ అన్నారాయన. మొత్తం 14 ఏండ్ల పోరాటంలో అయిదు లక్షల చెక్కు అతి గొప్ప నిధి అందుకున్నది ఆయనవే.

కేసీఆర్‌ ‘ఒక పద్ధతి ప్రకారం సమస్యలు పరిష్కరించుకుంటూ పోదాం’. అని ఆనాడే హామీ ఇచ్చారు. అందుకే పది వేల మంది సమక్షంలో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించి, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చే బాటలో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. అదీ తెలంగాణ పోరాటంలో పాల్గొన్న జర్నలిస్టు ఫోరమ్‌ సభలో ఇచ్చిన వాగ్దానాల నేపథ్యం. అందుకే ఈ కొనసాగింపు కథ. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ‘నమస్తే తెలంగాణ’ సంపాదకునిగా ఉన్నప్పటి నుంచీ అడపాదడపా జర్నలిస్టుల ప్రస్తావన ఆయన తెస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఉనికిలో ఉన్నది. జర్నలిస్టుల సమస్యలను మనసులో ఉంచుకున్న కేసీఆర్‌ తెలంగాణకు అకాడమీ ఏర్పర్చి దానికి ‘నమస్తే తెలంగాణ’ సంపాదకునిగా, జర్నలిస్టు ఫోరమ్‌ కన్వీనర్‌గా, అధ్యక్షునిగా ఉన్న నన్ను చైర్మన్‌గా నియమించారు. తెలంగాణలో ఇదే మొదటి నియామకం.

2014.. నాంపల్లి ప్రెస్‌ అకాడమీ.. వంద మంది జర్నలిస్టు ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ సుమారు రెండు దశాబ్దాలు పనిచేసింది. ముఖ్యమంత్రులు మారారు. కానీ ఒక్కరు కూడా ప్రెస్‌ అకాడమీ వేపు తొంగి కూడా చూడలేదు. కేసీఆర్‌ మాత్రం నాంపల్లి అకాడమీకి వచ్చారు. సమస్యల గురించి చర్చించారు. ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ పోదామని చెప్పారు.

2017, ఫిబ్రవరి 2 కేసీఆర్‌ పుట్టినరోజు. ప్రగతిభవన్‌. ప్రజాహితలో హాల్‌ నిండుగా జర్నలిస్టు కుటుంబాలు, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు. పాత క్యాంపు ఆఫీసులో అందరూ భోజనాలు చేశారు. ఆనాడు పుట్టినరోజు కనుక ప్రగతిభవన్‌ అంతా జనమే జనం. ప్రజాహిత ఆనాడే ప్రారంభం. అయినా కేసీఆర్‌ జర్నలిస్టు కుటుంబాలకు కడుపునిండా అన్నం పెట్టించి వారితో గడపడానికే సభకు వచ్చారు. ‘పుట్టినరోజు శుభదినం కదా! మరణించిన కుటుంబాలు అంటే అశుభం’ అని కొందరు అభ్యంతరం చెప్తే ఆయన అన్న మాటలు ఇవి. ‘పుట్టినరోజు నాడు జర్నలిస్టు కుటుంబాలకు సేవ చేయడం కన్నా పుణ్యం ఏముంటుంది’ అని. కేసీఆర్‌ ప్రతిపాదించి కేటాయించిన ‘జర్నలిస్టు నిధి’ నుంచి నాడు వందమంది జర్నలిస్టు కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ జరిగింది.

ఏ మాట మీదా కేసీఆర్‌ ఇప్పటివరకు వెనక్కి వెళ్లలేదు. అందరికీ అక్రెడిటేషన్లు అన్నారు, ఇచ్చారు. తెలంగాణ ఒక్క రాష్ట్రంలో 20,000 మంది అక్రెడిడేటెడ్‌ జర్నలిస్టులున్నారు. తెలుగు రాష్ర్టాల్లో జర్నలిస్టుల సంఖ్య ఎక్కువ. తెలుగు భాషలో పత్రికలన్నింటికీ టాబ్లాయిడ్స్‌ ఉండటం అందువల్ల ఆంధ్ర, తెలంగాణలలో ప్రతి పత్రికకూ, ఛానల్‌కు మండలానికో రిపోర్టర్‌ ఉండటం అనేది ప్రత్యేక పరిస్థితి. ఇది మిగతా రాష్ర్టాల్లో లేదు. తమిళనాడు, కర్ణాటక, ముంబయితో కూడిన మహారాష్ట్రలలో అక్రెడిటేషన్‌ జర్నలిస్టుల సంఖ్య 5వేలకు మించదు. కానీ మన వద్ద 20,000 అక్రెడిటేషన్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. హెల్త్‌కార్డు ఒక్క పైసా చెల్లించకుండా ఉద్యోగులతో సమానంగా ఇచ్చారు. ఇప్పుడు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావడం లేదని విమర్శిస్తున్నారు కానీ ఈ హెల్త్‌కార్డుల పైనే ఇప్పటివరకు 25 కోట్ల రూపాయల వైద్యాన్ని జర్నలిస్టులు పొందగలిగారు. కొన్ని సమస్యల కారణంగా హెల్త్‌కార్డులు పనిచేయడం లేదు. కార్పొరేట్‌ ఆస్పత్రులు అంగీకరించడం లేదు. నిజమే కానీ త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుంది. హెల్త్‌కార్డులు మళ్లీ అమల్లోకి వస్తాయి.

ఇళ్ళ సమస్యలసై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనీసం మూడు సమావేశాలు నిర్వహించారు. జర్నలిస్టు ప్రముఖులు, అన్ని యూనియన్ల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఒక సందర్భంలో సుప్రీంకోర్టులో ఉన్న ఇండ్ల స్థలాల సమస్యల గురించి ఢిల్లీకి కూడా కేసీఆర్‌ మాట్లాడారు. సుప్రీంకోర్టులో ఒకసారి వెసులుబాటు వచ్చినాక నిజాంపేటలో 32 ఎకరాలను జేఎన్‌ సొసైటీకి స్వాధీనం చేసి చుట్టూ కంచె వేయించారు. పేట్‌ బషీరాబాద్‌లో భూమి స్వాధీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం వల్లనే, ఆ కారణం గానే ఇళ్లస్థలాల సమస్య పరిష్కారం కాలేదు. కానీ ప్రభుత్వం కేసీఆర్‌, కేటీఆర్‌ కూడా ఈ అంశంపై దృష్టిపెట్టారు, పెడతారు. ఈ లోపున మధ్యేమార్గంగా మండల, నియోజకవర్గస్థాయి జర్నలిస్టులకు ‘డబుల్‌ బెడ్‌రూం’ ఇల్లు కట్టివ్వడం లాంటివి జరుగుతున్నాయి. బహుశా ఈ సంవత్సరం ఇళ్ల సమస్య కొలిక్కివస్తుందని నమ్మకం.
హెల్త్‌కార్డుల ప్రయోజనం 25 కోట్లు, మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 7 కోట్ల పైబడి, కరోనా బారినపడిన జర్నలిస్టులకు 4 కోట్ల పైబడి, మీడియా అకాడమీ సిఫారసుతో జర్నలిస్టులకు అందిన 4 కోట్లు వెరసి దరిదాపు 40 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాలను తెలంగాణ జర్నలిస్టులు పొందారు. ఇదంతా 2017 నుంచి మూడేళ్ల లెక్క.. ఇది ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ఒక్క పద్ధతి ప్రకారం సమస్యలు పరిష్కరించే దూరదృష్టి ఉన్న కేసీఆర్‌ జర్నలిస్టుల సంక్షేమానికి తీసుకున్న చర్యలు అక్రెడిటేషన్‌, హెల్త్‌కార్డులు (ఇప్పుడు లోపాలు ఉన్నప్పటికీ), ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరిస్తున్న పద్ధతి. ఇదొక క్రమం.

సోషల్‌మీడియాలో అడ్డగోలు రాతలు వస్తుంటాయి. జాతీయస్థాయి నాయకులే ముఖ్యమంత్రిపై అనకూడని భాషలో, విద్వేష భాషలో మాట్లాడతారు. ఒక జాతీయ నాయకుడు ప్రెస్‌ కౌన్సిల్‌కు తప్పుడు ఫిర్యాదులు చేశాడు. ఒక సంఘం ఇక్కడ కాదని, తెలంగాణలో జర్నలిస్టులు చచ్చిపోతున్నరు, దిక్కులేదని జంతర్‌మంతర్‌ పలుకులు పలుకుతది. ప్రెస్‌ కౌన్సిల్‌కు నల్లగొండలో జర్నలిస్టులు 25 మంది చనిపోయారని ఒక్కరికీ సహాయం అందలేదని ఒక ఫిర్యాదు చేశారు. అప్పటికే నల్లగొండలో ఆ కుటుంబాలకు సాయమందింది. పింఛన్‌ అందుతున్నది. ప్రెస్‌ కౌన్సిల్‌ ఈ ఫిర్యాదుపై స్పందిస్తూ తెలంగాణ మీడియా అకాడమీని, ప్రభుత్వాన్ని ప్రశంసించింది. అయినా ఈ ప్రచారాలు ఆగవు.

ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయితే అందే సంక్షేమం ఇవ్వాళ తెలంగాణ జర్నలిస్టులు అనుభవిస్తున్నారు. కానీ జర్నలిస్టుల సమస్యలు అనంతం, వాటి పరిష్కారం అవశ్యం. అది నిరంతర ప్రక్రియ. సంప్రదింపుల ద్వారా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడమే మార్గం. జై తెలంగాణ.. జై తెలంగాణ జర్నలిస్టులు.
(వ్యాసకర్త: చైర్మన్‌,తెలంగాణ మీడియా అకాడమీ)

అల్లం నారాయణ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సమరం నుంచి సంక్షేమం దాకా..

ట్రెండింగ్‌

Advertisement