e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home ఎడిట్‌ పేజీ ఈ సిద్ధాంత అస్తిత్వం ఏమిటి?

ఈ సిద్ధాంత అస్తిత్వం ఏమిటి?

భూకబ్జా వంటి పలు అక్రమాల ఫలితంగా పదవీచ్యుతుడైన ఈటల త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీఆర్‌ఎస్‌లో ఆయనకు ఎంతప్రాధాన్యం ఇచ్చినా, న్యాయం చేసినా అసంతృప్తుడై వివేక్‌ మహాశయుని ఉద్యాన గృహంలో ఈటలతో కిషన్‌ రెడ్డితో సంధానం జరిపించి పార్టీ తీర్థం ఇవ్వడానికి అవసరమైన రాజకీయ క్రతువును ఆయన హోతగా జరిపించినట్లు వార్తలు వచ్చాయి.

ఈ సిద్ధాంత అస్తిత్వం ఏమిటి?

ఈ సందర్భంగా అసలు బీజేపీకి తెలంగాణలో ఉన్న సిద్ధాంత భూమిక ఏమిటి? ఈటలను పార్టీలో చేర్చుకొని ప్రజలకు ఏమి చెప్పదలచుకున్నారు? ఈటల భూ కబ్జాలను ఎన్నో సాక్ష్యాలతో ప్రభుత్వం బయట పెట్టి తగు చర్యతీసుకున్నది. ఈ వివాదం కోర్టులో ఉండగానే అధికారపార్టీనుంచి నిష్కాసితుడైన మాజీ మంత్రిని బీజేపీ తన పార్టీలోనికి చేర్చుకొని ఆపార్టీకి ఏ విధమైన సిద్ధాంత అస్తిత్వం లేదని, భూమిక లేదని చెప్పదలచుకున్నట్లు స్పష్టంగా అది ప్రజలకు సందేశం ఇస్తున్నది.

జాతీయ స్థాయిలో బీజేపీకి ఒక సిద్ధాంత నేపథ్యం ఉంది. అది సంఘపరివారంలో ఉన్న వేరు వేరు విధాల సంఘాలలో ఒకటి. దాని సిద్ధాంత భూమికను అందించే మాతృ సంస్థ ఆరెస్సెస్‌. దానికొక జాతీయ సిద్ధాంతం ఉంది. అది ఏనాటికైనా అఖండ భారతాన్ని సాధించి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా హిందూ సామ్రాజ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. జాతీయ స్థాయిలో ఆపార్టీ ఈ వ్యూహంతోనే అధికారంలోకి రాగలిగింది. ఆకారణంగానే జాతీయ స్థాయిలో అది అమలు పరచిన ప్రజావ్యతిరేక పథకాలతో ఉత్తర భారతంలో కూడా నేడు ఎదురుగాలి ఎదుర్కొంటూ ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతంలో తన సిద్ధాంతాలకు భిన్నమైన పొత్తులు పెట్టుకోవడం కానీ, అక్కడినాయకులను కలుపుకోవడంకానీ చేసింది.

ఇటీవలి ఐదురాష్ర్టాల ఎన్నికల్లో దాని కలలు కాస్త నీరుగారి పోయాయి. పంజాబ్‌, బెంగాల్‌, కేరళ రాష్ర్టాలలో తన సిద్ధాంతాలకు భిన్నంగా ఏ విధమైన పొత్తులకైనా సిద్ధపడింది. తమిళనాడులో బీజేపీ దాని జాతీయ సిద్ధాంతాలకు ఏ మాత్రం పొసగని ద్రావిడ సిద్ధాంత నేపథ్యం ఉన్న అన్నాడిఎమ్‌కే తో పొత్తులు పెట్టుకొని ఏ విధంగా నైనా అధికారంలోనికి రావాలని తలపెట్టి అక్కడా శృంగభంగాన్ని పొందింది.

ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక ఎంపీ సీటు విజయానికే పొంగిపోయి, వేరు వేరు విషయాల ప్రాధాన్యంపై ఆధారపడి ఉండే నగరఎన్నికల్లో కొన్ని సీట్లు సంపాదించినంత మాత్రానే ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మిడిసిపడ్డారు. ఎన్నోప్రగల్భాలు పలికారు. ఎంత దాకా పోయారంటే.. రాష్ట్రంలో ప్రభుత్వం పడి పోతుందని, చాలామంది టీఆర్‌ఎస్‌ నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని, అధినేత అరెస్టు అవుతారని చెప్పేదాకా జ్వరప్రేలాపనలు సాగాయి. కానీ అవి కేవలం విదూషకుని ప్రేలాపనల వంటివని నాగార్జున సాగర్‌ ఎన్నికలలోను, మునిసిపల్‌ ఎన్నికలలోనూ రుజువైంది.

తెలంగాణలో బీజేపీకి ఉన్న అస్తిత్వ సిద్ధాంతం ఏమిటి అని ఇక్కడి ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ప్రాంతీయ పార్టీ నాయకులను చేర్చుకోగానే వారు తమ జాతీయ సిద్ధాంతబద్ధులైపోతారా! తెలంగాణ రాష్ట్రం ఇక ఏర్పడుతుంది అని నమ్మకం కలగగానే టీడీపీలోని చాలామంది నాయకులు ఇక రాజకీయ నిరుద్యోగితను ఎదుర్కోవలసి వస్తుంది అనుకున్న వారు బీజేపీలో చేరారు. రెండుకళ్ళ సిద్ధాంతంతో టీడీపీలో ఉంటే రాష్ట్రం సాధించే మన లక్ష్యానికి ఇది పనికి రాదనుకున్న నాయకులు టీఆర్‌ఎస్‌లో ఆనాడే చేరారు. రాష్ట్రసాధనకు వారు కృషి చేశారు. మరికొందరు రెండు పడవలపైన కాళ్ళుపెట్టినవారున్నారు.

ఇటీవలి పరిణామాలలో ఈటల తన రాజకీయ చరిత్రకే తల్లిలాంటి పార్టీకే కీడు తలపెట్టే పనులు చేపట్టాడు. అంతే కాదు రకరకాల అక్రమాలకు సూత్రధారిగా, ప్రజలనుంచి ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరడంతో ప్రభుత్వ విచారణలో దోషిగా కళంకితుడుగా కబ్జాదారుగా తేలిన ఈ నాయకుని ఈరోజు బీజేపీ తన తీర్థాన్నిచ్చి పార్టీలో కలుపుకోవడానికి తయారైంది. దీంతో బీజేపీ తెలంగాణలో తనదైన సిద్ధాంత అస్తిత్వం ఏమీలేదని రాష్ట్రం పట్ల దానికి ఉన్న సిద్ధాంతం ఏదీ లేదని చెప్పకనే అది చెబుతూ ఉంది. నిన్నటి దాకా బీజేపీ సిద్ధాంతాలపైన రాష్ట్రం పట్ల బీజేపీ అనుసరించే కార్యక్రమాలను ఆలోచనలను విమర్శించిన ఈనాయకుడు ఇప్పటిదాకా మాట్లాడిన దానికి భిన్నమైన ఆలోచనలు ఉండే పార్టీలో ఏవిధంగా చేరగలడు? ఆపార్టీ ఇలాంటి నాయకున్ని చేర్చుకొని ప్రజలముందుకు ఏ సిద్ధాంతాన్ని చెబుతుంది. ఆయన అనుసరించిన ఆస్తివృద్ధిపథకాలను భూఆక్రమణల క్రతువులను సమర్థిస్తుందా? లేదా తానుకూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేపట్టాలని భావిస్తుందా!

  • వ్యాఘ్రనేత్రుడు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈ సిద్ధాంత అస్తిత్వం ఏమిటి?

ట్రెండింగ్‌

Advertisement