నేనేసిన గింజ తిని
ఓ ఆకతాయి పావురాయి
గుడి.. మసీదు.. చర్చి.. పైన
తిరిగి తిరిగి గింజ అరిగి
చెట్టుకింద కూర్చున్న నాపైనే రెట్ట వేసింది
బహుశా.. కండువా మార్చిన
కపట కపోతమేమో?!
ఐదేండ్లకు ఒకసారే వస్తుందాపావురాయి
ఆకలేసి బిక్కమొహం వేస్తుంది
తెల్లని రెక్కలు చూపి, గింజలన్ని ఏరుకొనీ
మరోమారు కనుమరుగైపోతుంది ఆ పావురాయి!
ఆకులకూ కొమ్మలతో.., కొమ్మలకూ కాయలతో
తగవుబెట్టి.. విడగొట్టి
పచ్చని చెట్టును కాస్తా స్వార్థంతో తగలబెట్టి
చలి మంటల కాపు రుచిని
మరిగిందాపావురాయి.!
అదిగో.. జీ హుజూర్ అనుకుంటూ మరోసారి వస్తోంది
పొరుగు రాజ్య కపోతాల్ని వెంట తీసుకొస్తోంది
గింజల కోసం నిన్నూ, నన్నూ విడదీస్తోంది
ఆకుపచ్చ వనంలోన చిచ్చు రేప చూస్తోంది!
నిద్ర మత్తును వదులుకొని చూడు
పావురం కాదది, ముదిరిన తొండ
మసకబారిన కళ్ళను నులుముకొని చూడు
అది చేపల చెరువుకు కాపలా కాస్తున్న కొంగ!!
జాబేర్ పాషా
00968 78531638
(మస్కట్ (ఒమన్)నుంచి..)