e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home ఎడిట్‌ పేజీ ఆది నుంచీ అనూహ్య విజయాలే

ఆది నుంచీ అనూహ్య విజయాలే

ఆరు దశాబ్దాల అవిశ్రాంత పోరాటం తర్వాత 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. వారసత్వంగా లభించిన సమస్యలను బట్టి ఈ రాష్ట్రం భవిష్యత్తులో అభివృద్ధి ఏమైనా సాధించగలదా? అని అప్పట్లో ఎవరికైనా సందేహం కలిగి ఉండవచ్చు. 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడిన ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలు ఆకలి కేకలు వేస్తున్నాయని ప్రణాళికా సంఘం 12వ ప్రణాళికా పత్రంలో పేర్కొన్నది.

రైతుల ఆత్మహత్యలు, విద్యుత్తు కోతలు సర్వసాధారణం. అనేక జిల్లాలు వెనుకబడి ఉండటంతో ఆదా య సామర్థ్యమనేది అనుమానాస్పద విషయంగానే ఉండినది. ఆ నిరాశామయ పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టిన సీఎం కె. చంద్రశేఖర్‌రావు రాష్ట్ర శక్తియుక్తులను, వనరులను గరిష్ఠస్థాయిలో వినియోగించుకొని చరిత్ర తిరగరాశారు. నిరంతర కృషి, అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని విజయపథంలో నిలబెట్టారు.

- Advertisement -

కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన సమాచారమే ఇందుకు అద్దం పడుతున్నది. రాష్ట్ర ఏర్పాటుకు రెండేండ్ల ముందు స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ) భారతదేశ సగటు కన్నా 1.3 శాతం తక్కువగా 12.1 శాతంగా ఉండేది. రాష్ట్రం ఏర్పడిన ఏడాది లోపు దేశ సగటు కన్నా 1 శాతం ఆధిక్యత సాధించడం శుభారంభం. 2014-15 తర్వాత తెలంగాణ వరుసగా 3.7 శాతం అధిక వృద్ధిరేటు సాధిస్తూ వస్తున్నది. కరోనా కల్లోలం చుట్టుముట్టిన 2021లోనూ దేశం మైనస్‌ 3 శాతం సంక్షోభంలో కూరుకుపోతే, తెలంగాణ 2.4 శాతం వృద్ధిరేటు సాధించింది. అంతేకాకుండా సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో సమరూపత, భౌగోళిక సామీప్యత కలిగిన తన పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, కేరళ, తమిళనాడును సగటు జీఎస్‌డీపీ వృద్ధిలో మించిపోయింది. 2015-16 నుంచి 2020-21 మధ్యకాలంలో 11.7 శాతం వార్షిక సగటు జీఎస్‌డీపీ వృద్ధిరేటు సాధించడమే కాకుండా దక్షిణాది రాష్ర్టాల్లో అగ్రభాగాన నిలిచింది. ఇక ప్రజల జీవన ప్రమాణాలకు అద్దం పట్టే తలసరి ఆదాయ సూచికలో కూడా తెలంగాణ అభివృద్ధి అసాధారణ స్థాయిలో ఉన్నది. 2014-15లో జాతీయ తలసరి ఆదాయం కన్నా 1.43 రెట్లు అధికంగా రూ.1,24,104గా ఉన్న తలసరి ఆదాయం, 2020-21 నాటికి 1.84 రెట్లు అధికంగా రూ.2,37,632కు చేరుకున్నది. 2014-15 తర్వాత తలసరి ఆదాయం ఏటా భారతీయ సగటు కన్నా 4.6 శాతం పెరుగుతూ రావటం గమనార్హం. కరోనా సంక్షోభ కాలమైన 2021లో జాతీయ సగటు – 4 శాతానికి పడిపోతే తెలంగాణ 1.8 శాతం పెరుగుదల సాధించి అజేయంగా నిలిచింది. ఆర్థిక వృద్ధిలో స్థూల విలువ దిగుబడిలో అంగలు వేస్తూ ముందుకుసాగుతున్నది. వ్యవసా యం, అనుబంధ సంబంధిత, ఇతర రంగాల్లో అద్వితీయమైన వృద్ధి సాధించింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవలు, అమలుచేస్తున్న పథకాలు, చేపడుతున్న ప్రాజెక్టుల ఫలితంగా సాధ్యమైనవే.

ఈ సందర్భంగా రైతుబంధు, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయ, రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్తు, విత్తన సబ్సిడీలు, గొర్రెలు- చేపల పంపిణీ, రైతుబీమా, పాడిరైతులకు సబ్సిడీల వంటివాటి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలోని 55 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నవి వ్యవసాయ, అనుబంధ రంగాలే. ఇక పారిశ్రామికరంగంలో రాష్ట్ర అభివృద్ధి రికార్డులు సాధిస్తున్నది. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించి తొలి రోజుల్లో అనుమతులు పొందాం. వాటిని సాధించుకున్న సందర్భంలో తిరిగి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నది. ఈ స్థితిని ఎదుర్కోబోతున్నాం. ‘దళితబంధు’ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాటి ఉద్యమకాలం 2002 ఆగస్టు 11న గ్రీన్‌ పార్క్‌ హోటల్లో దళిత మేధావులతో కలిసి ‘దళిత పాలసీ’ రూపకల్పన చేశారు. దళితబంధు ఆలోచన నేటిది కాదు. ఉద్యమ కాలంలోనే పురుడు పోసుకున్నది.

టీఎస్‌- ఐపాస్‌ ఓ మైలురాయి. ప్రాజెక్టులకు ‘అనుమతి హక్కు’ ప్రసాదించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. ఇప్పటివరకు ఈ విధానం ద్వారా 15,852 కంపెనీలకు అనుమతి ఇచ్చారు. వీటి పెట్టుబడి విలువ రూ.2,14,951 కోట్లు. వీటి ఉపాధి సామర్థ్యం 15.6 లక్షల ఉద్యోగాలు. ఇందులో రూ.98,120 కోట్ల పెట్టుబడులతో 12,198 యూనిట్లు ప్రారంభమయ్యాయి. 7.72 లక్షల మందికి ఉపాధి కల్పించాయి. వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లతో కూడిన సేవల రంగంలో 2014-15 నుంచి 2020-21 మధ్యకాలంలో రెండింతల వృద్ధి నమోదైంది. ఈ అభివృద్ధికి దేశవిదేశీ సంస్థల నుంచి ర్యాంకులు, అవార్డులు, కితాబులు కూడా వచ్చాయి. సీఎం కేసీఆర్‌ దార్శనికతకు ఇవి అద్దం పడుతున్నాయి. రాష్ట్రం కేవలం ఆర్థికంగానే కాకుండా పర్యావరణ అనుకూలంగా, సకలజన హితంగా అభివృద్ధి చెందుతున్నది. ఆశలు, ఆకాంక్షల నుంచి విజయాల వరకు మనం పయనించాం. అనతికాలంలోనే ఇతర రాష్ర్టాలను అధిగమించి ముందుకు సాగి శభాష్‌లు అందుకున్నాం.
(వ్యాసకర్త: ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రణాళికాసంఘం)

బోయినపల్లి వినోద్‌కుమార్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement