e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home Top Slides Telangana History | మన మట్టి పొరల్లో మహా నగరాలు

Telangana History | మన మట్టి పొరల్లో మహా నగరాలు

కోటలింగాలలో మొదలైన శాతవాహన సామ్రాజ్యం తెలంగాణలో గోదావరి నుండి కృష్ణ వరకు విస్తరించింది. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా మహా సముద్రం, ఉత్తరాన వింధ్య దాటి మధ్యప్రదేశ్‌ వరకు విశాలమైన భూభాగం ఈ సామ్రాజ్యం కింద ఉండేది. నేటి భౌగోళిక పరిభాషలో చెప్పాలంటే దక్కను కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటకలకు శాతవాహనుల పాలన విస్తరించింది. సామ్రాజ్యంగా మారుతున్న క్రమంలో వింధ్యకు పైన మధ్యభారతం వరకు, పశ్చిమాన గుజరాత్‌లోని భరుచ్‌ వరకు రాజ్యసీమ విస్తరించింది.

శాతవాహనుల విస్తరణ ఉత్తర తెలంగాణలోని గోదావరీ తీరం నుండి మొదలై దక్షిణ తెలంగాణలోని కృష్ణాపరీవాహక ప్రాంతానికి చేరుకున్న క్రమాన్ని పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన అంశం ఏమంటే తెలంగాణలో శాతవాహనుల చరిత్ర, బౌద్ధ విస్తరణ జరిగిన క్రమం ఒకే దిశలో సాగింది. అందుకే తవ్వకాల్లో శాతవాహన ఆధారాలు, బౌద్ధ నిర్మాణాలు, ఆనవాళ్లు- రెండూ కలిసే దొరుకుతున్నాయి. ఉత్తర తెలంగాణలో శాతవాహన కాలం నాటి ఆధారాలు ఉన్న గ్రామాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో ధూళికట్ట, పెద్ద బంకూరు నాటి పట్టణాలు. ఇవి రెండూ నేటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయి.

- Advertisement -

పెద్దపల్లి జిల్లాలోని ధూళికట్టలో ఉన్న పొలాల్లో ఎక్కడ తవ్వినా పాతకుండలు, పెద్దపెద్ద ఇటుకలు, కుండ పెంకులు, పూసలు, నాణేలు దొరుకుతాయి. 30 ఏండ్ల కింద చూసిన వాళ్లకి చుట్టూ ఎత్తైన మట్టిగోడ, మధ్యలో ఉన్న పొలాలు కనిపించేవి.ఆ ఎత్తైన మట్టికోట రెండువేల ఏండ్ల కంటే ముందు గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీసు ప్రస్తావించిన 30 శాతవాహన కోటల్లో ఒకటి. ఆ ఊరిపేరు ధూళికట్ట. మట్టితో కట్టిన కోట అంటే ధూళికోట.. వాడుకలో ధూళికట్టగా మారిందేమో.

ధూళికట ్టగ్రామంలో ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్న భూముల్లో దాదాపు 34 ఎకరాల భూమి శాతవాహన కాలం నాటి కోటమీదే ఉంది. హుస్సేన్‌మియా వాగుకు ఒకవైపు ఈ కోట ఉండగా, కిలోమీటర్‌ దూరంలో పెద్ద బౌద్ధస్తూపం ఉంది. ధూళికట్ట పట్టణం, కోటలింగాల కాలంలోనే మొదలై ఆ తర్వాత ప్రాధాన్యత సంతరించుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి.

1974-75లో రాష్ట్ర పురావస్తుశాఖ చేపట్టిన తవ్వకాల్లో మట్టికోట, రాజగృహ సముదాయం వంటి కట్టడాలు, ధాన్యాగారం, బావులు, మురికి నీటిపారుదల వ్యవస్థ వంటి నిర్మాణాల ఆధారాలు దొరికినయి. కోటకు నలువైపులా ప్రవేశ ద్వారాలు, కోట చుట్టూ కందకం తవ్విన ఆనవాళ్లు.. మెగస్తనీస్‌ వర్ణించిన శాతవాహనుల పటిష్ఠమైన కోటకు ఉదాహరణ.

కోటకు దక్షిణ దిశలో చేపట్టిన తవ్వకాల్లో 6.3×3 మీటర్ల కొలత ఉన్న కాపలా భటుల గదుల వంటి నిర్మాణం బయటపడింది. ఈ కోట ప్రాంతం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో మొదలై ఆరుదశల్లో సాగింది. గదులలో నేలపై ఇటుకల్ని పరిచారు. శాతవాహన కాలం నాటి ఇటుకలు ఇప్పటిలా చిన్నవి కావు. ఒక్కో ఇటుక సుమారు 56x27x7 సెంటీమీటర్ల (దాదాపు రెండు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు) కొలతతో ఉంటుంది.

చాలా పరిమిత స్థాయిలో జరిగిన తవ్వకాలే అలనాటి కో టను వెలికి తీస్తే, పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపితే ఇం కెలా ఉండేదో ఊహించుకోవచ్చు. ధూళికట్ట కోట ఎంత ముఖ్యమో ఇక్కడి స్తూపం కూడా అంతే విశిష్టమైనది. ఒక కిలోమీటరు దూరంలో ధూళికట్ట, వడ్కాపూర్‌ గ్రామం మ ధ్య ఉందీ బౌద్ధస్తూపం. ఒక రకంగా చెప్పుకోవాలంటే తెలంగాణలో ఇప్పటివరకున్న హీనయాన కాలంనాటి స్తూపాల్లో మొదటిదీ, కనీస స్థాయిలో సంరక్షించిన స్తూపం కూడా ఇదే. అద్భుతమైన నాగ ముచిలింద శిల్పం కూడా ధూళికట్ట స్తూపం వద్దే దొరికింది. ఈ సంగతులన్నీ తెలంగాణలో బౌ ద్ధం గురించిన వ్యాసాల్లో ఇంకా విపులంగా చెప్పుకొందాం.

పెద్దబంకూరు చుట్టూ కోట వంటి కట్టడం లేకుండా చాలా నివాసాలు, కట్టడాలు, నిర్మాణాలు, ఆర్థిక వ్యవస్థకు ఆధారాలు దొరికిన స్థలం పెద్దబంకూరు. మొత్తం తెలంగాణలో ఎక్కువసార్లు పురావస్తు తవ్వకాలు జరిగిన స్థలం కూడా ఇదే. పెద్దపల్లి పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో హుస్సేన్‌మియా వాగు ఒడ్డున శాతవాహన కాలంలో విలసిల్లిన పట్టణం పెద్దబంకూరు. 1967 నుండి 2017లోపు ఏడుసార్లు జరిపిన తవ్వకాలు ఎన్నో విశేషాల్ని వెలికి తెచ్చినయి. క్రీస్తుపూర్వం 4 లేక 3వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 3వ శతాబ్దం వరకున్న మానవ ఆవాసాల ఆధారాలు ఇక్కడ ఉన్నాయి.

30 ఎకరాల స్థలంలో విస్తరించిన ఈ పట్టణంలో సుమారు మూడు ఎకరాల్లో జరిపిన తవ్వకాల్లో దొరికిన నిర్మాణాలు ఈ పట్టణం ఒక వాణిజ్య కేంద్రంగా, లేక మంచి ఆర్థిక పునాది ఉన్న ఆవాసంలాగా తోస్తుంది. ఇక్కడ దొరికిన మూడు పెద్ద సమావేశ మందిరాల వంటి నిర్మాణాల అవశేషాలు, వేల సంఖ్యలో దొరికిన నాణేలు ఈ విషయాన్ని ధ్రువపరుస్తాయి. 30×40 మీటర్ల కొలతలతో ఉన్న విశాలమైన రెండు సమావేశ మందిరాలు, భవంతుల లాంటి నిర్మాణాలు, బావులు, నీటి తొట్లు.. ఇలా ఒక పట్టణానికి ఉండే హంగులన్నీ పెద్దబంకూరులో కనిపిస్తాయి. చతురస్రాకారంలో ఇటుకలతో కట్టిన ఒక మతపరమైన నిర్మాణం వంటిది బయట పడింది కానీ అది అమ్మదేవతల మందిరమా, జైనమా లేక తొలినాటి వైదిక నిర్మాణమా స్పష్టంగా తేలలేదు. 2017లో జరిపిన తవ్వకాల్లో ముత్యాలు, బంగారంతో చేసిన సన్నటి పూసలు మట్టిపాత్రల్లో దొరికినాయి.

కర్ణమామిడి
కోటలింగాలకు ఆవలి ఒడ్డున మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలంలో ఉన్న కర్ణమామిడి కూడా కోటలింగాల లాగానే శాతవాహన కాలపు ఆధారాల్ని గర్భంలో దాచుకుని ఉన్న గ్రామం. 1980లలో ఈ గ్రామంలోని పాటిగడ్డ దగ్గర చేసిన సర్వేలో తొలి చారిత్రక కాలం నాటి కుండ పెంకులు, ఇటుకలు దొరికినయి. 2017లో ఒక 10 రోజుల పాటు పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో 3 అడుగుల వెడల్పు, 4 అడుగుల పొడవు ఉన్న గోడ బయట పడింది. కేవలం పదిరోజులు మాత్రమే జరిగిన ఈ అసంపూర్తి తవ్వకాలు మళ్ళీ మొదలై పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపితే ఇంకో శాతవాహన నగరం ఇక్కడ బయటపడే అవకాశం ఉంది. ఎల్లంపల్లి-శ్రీపాదసాగర్‌ బ్యాక్‌వాటర్స్‌లో సంవత్సరంలో 8 నెలలు నీట మునిగి ఉండే ఈ పురాతత్వ స్థలాన్ని ఇప్పటికైనా పట్టించుకోకపోతే జలగర్భంలో శాశ్వతంగా మునిగిపోతుంది.

నాణేల గని పెద్దబంకూరు
ధూళికట్టలో గౌతమీపుత్ర శాతకర్ణి, ఆ తర్వాత వచ్చిన రాజులవి, శాతవాహన రాజైన శివ సిరి నాణెం, రోమ్‌ చక్రవర్తి అగస్టస్‌ నాణెం కూడా దొరికింది. రాజు బొమ్మ ముద్రించిన ప్రతి శాతవాహన వెండి నాణెం బొరుసు వైపు నది (గోదావరి) ముద్రించి ఉండటాన్ని డాక్టర్‌ రాజారెడ్డి.. ధూళికట్టలో దొరికిన శివసిరి పుదుమావి నాణెం సహాయంతో విశ్లేషించారు. ఏనుగు దంతంతో చేసిన చిన్నముద్ర కూడా ఇక్కడే దొరికింది. దానిమీద బ్రహ్మీలిపిలో ‘అజనిసిరియ గమెకుమరియ’ అనే అక్షరాలున్నాయి.

పెద్దబంకూరులో దొరికిన నాణేలు తెలంగాణ చరిత్ర రచనకు ముఖ్య ఆధారాలు. ఇక్కడి తవ్వకాల్లో 30 వేల రాగి నాణేలు దొరికినాయని డాక్టర్‌ కృష్ణశాస్త్రి రిపోర్టు చేసినరు. ధూళికట్ట, పెద్దబంకూరుల్లో శాతవాహన రాజుల నాణేలు మాత్రమే కాకుండా వారి సామంతులు, అధికారులైన మహా తలవర, మహా సేనాపతి వంటి వారు జారీ చేసిన నాణేలు కూడా దొరికినాయి. ఒక టెర్రకోట ముద్రపై ‘మహాతలవరస వజసమికససేవ సభ’ వంటి లఘుశాసనాలు నాటి అధికారులైన మహాతలవరల గురించి చెబుతుంది.

తెలంగాణలో అస్సక మహా జనపదం మొదలైన నాటి నుండి పట్టణాలు విలసిల్లినాయి. ఉత్తర భారతంలోని ఎన్నో నగరాలకు దీటుగా ఇక్కడి నాగరికత అభివృద్ధి చెందింది. దానికి ఉదాహరణే ధూళికట్ట, పెద్దబంకూరు. ధూళికట్టలో కోట ఇప్పుడు వ్యవసాయభూమి కింది పొరల్లో ఉంది. తవ్వకాలు జరిపి, మెగస్తనీస్‌ వర్ణించిన శాతవాహన కోటను మనం బయటికి తీయకపొతే చరిత్ర పొరలు పొరలుగా చెదిరిపోతుంది. ధూళికట్ట స్తూపం దగ్గర పాక్షికంగానే తవ్వకాలు జరిగినాయి. అక్కడ బౌద్ధ విహారానికి సంబంధించిన గదులు, ఇతర నిర్మాణాలు ఇంకా భూమిలోనే ఉండిపోయినాయి. ధూళికట్ట స్తూపానికి పోయే దారి కూడా సరిగా లేక పోవడంతో పర్యాటకులు వెళ్లే పరిస్థితి లేదు. పెద్దబంకూరులో జరిపిన తవ్వకాల్ని బయట ప్రపంచానికి చెప్పాలంటే శాస్త్రీయంగా దానిని సంరక్షించాలి. గ్రౌండ్‌ పెనిట్రేటింగ్‌ రాడార్‌ వంటి ఆధునిక సాంకేతికత సహాయంతో తవ్వకాల్ని పూర్తి చేసి శాతవాహన పట్టణాన్ని ఒక సందర్శనీయ స్థలంగా చేయాలి.

అమ్మతల్లులకు తొలి రూపాలు
ధూళికట్టలో దొరికిన ఇంకో పురావస్తు విశేషం కంచుతో చేసిన తల్లీ బిడ్డల బొమ్మ. ఈ బొమ్మలోని తల్లి హారీతి (బౌద్ధుల అమ్మ దేవత) అని, ఆమె ఒడిలో ఉన్న బాలుడు పింగళ అని, ఈ రకంగా ఉన్న బొమ్మను అంకధాత్రి అని వర్ణిస్తారు. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దానికి చెందిన ఈ బొమ్మ తెలంగాణలోని బౌద్ధ పురాతత్వస్థలాల్లో దొరికిన మొదటి కంచుశిల్పం. ఇక్కడే టెర్రకోటతో చేసిన ఇంకో బొమ్మ దొరికింది. అమ్మదేవతగా భావించే స్త్రీ తన స్తనాల్ని తానే ఒడిసి పట్టుకున్నట్టున్న ఈ బొమ్మ కూడాప్రత్యుత్పత్తికి, సంతాన ఆరోగ్యానికి సంబంధించినదే. పెద్దబంకూరులో కాళ్ళు వెడల్పు చేసి, జననాంగం కనిపించే రీతిలో ఉన్న టెర్రకోట బొమ్మ దొరికింది. ఈ రోజు మనం కొలుస్తున్న అమ్మతల్లులకు తొలిరూపాలైన ఈ మూర్తులు మనకు శాతవాహన కాలం నుండి రూపాంతరం చెందుతూ కనిపిస్తూనే ఉంటారు.

ఉత్తర తెలంగాణలో శాతవాహన కాలం నాటి ఊర్లు

కాశిపేట (మంచిర్యాల జిల్లా):
ఈ గ్రామంలో శాతవాహన కాలపు కుండలు, కుండ పెంకులు, గాజులు, ఇటుకలు దొరికినయి.

గుంజపడుగు (పెద్దపల్లి జిల్లా):
ఇక్కడ ఒక శాతవాహన రాగి నాణెం, నీటి పారుదల శాఖ తవ్వకాల్లో ఇటుకల అవశేషాలు దొరికాయి.

రాయపట్నం (జగిత్యాల జిల్లా):
గోదావరి ఒడ్డున స్థానికులు ‘70 రూపాయల చెలక’గా పిలుచుకునే మట్టి దిబ్బ మీద 1983-83లో శాతవాహన ఆధారాలు దొరికినయి.

ఇవే కాకుండా పెద్దపల్లి జిల్లా చిన్నబొంకూరు, రెబ్బదేవరపల్లి, తేలుకుంట, కట్టకిందిపాలెం, కాచాపూర్‌, జగిత్యాల జిల్లా భరతుని పెంటపాడు, మహబూబాబాద్‌ జిల్లా కుమ్మరికుంట, సిద్దిపేట జిల్లా బూడిగపల్లి వంటి ఎన్నో గ్రామాలలో శాతవాహన కాలపు చరిత్ర నిక్షిప్తమై ఉంది. బౌద్ధ ఆనవాళ్లు దొరికిన పాశిగాం, స్తంభాలపల్లి కూడా శాతవాహన కాలం నాటివే.

డా. ఎం.ఏ. శ్రీనివాసన్‌
81069 35000

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement