e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home ఎడిట్‌ పేజీ బోధి వృక్షం కింద విమర్శకులు

బోధి వృక్షం కింద విమర్శకులు

టీఆర్‌ఎస్‌ పాలనను నిన్నటివరకు విమర్శించిన మేధావులు, రచయితలలో క్రమంగా ఒక్కొక్కరు వాస్తవాలను గుర్తిస్తుండటం ఒక కొత్త పరిణామం. ఇది ఇటీవల వారి మాటలు, రచనలలో కనిపిస్తున్నది. వారికి అటువంటి గుర్తింపు కలగటానికి నాలుగు కారణాలున్నాయి. ఒకటి: కొట్టివేయటానికి వీలుకాకుండా జరుగుతున్న అభివృద్ధి. రెండు: రాష్ట్రంలో, జాతీయంగా వస్తున్న గుర్తింపు.

మూడు: ప్రతిపక్షాల పట్ల వేగంగా సడలిపోతున్న ఆశలు. నాలుగు: ఉద్యమాలు కాగలవనుకునేవి ఏవీ బలపడలేక పోవటం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ పరిపాలన మొదలైన తర్వాత చిరకాలం పాటు విమర్శకుల జాబితాలో ఉన్న మేధావులు, రచయితలలో పలువురు ఇటీవలి కాలంలో ప్రశంసకులుగా మారుతుండటం చూసి మొదట ఆశ్చర్యం కలిగింది. కాని అందుకు కారణం ఏమై ఉంటుందని ఆలోచించినాకొద్దీ, వారి మాటలను, రచనలను గమనించినా కొద్దీ అటువంటి ఆశ్చర్యం తేలిపోవటం మొదలైంది. వాస్తవానికి వారిలో ఆ మార్పు ఎప్పుడో రావలసింది. ఇప్పటికైనా వస్తుండటం సంతోషించదగ్గది. అందువల్ల, వాస్తవాలను గుర్తించటం లేదంటూ తమపై గల అపప్రథ తొలగిపోవటంతో పాటు, రాష్ర్టానికి కూడా మేలు జరుగుతుంది.

- Advertisement -

ప్రభుత్వ విధానాలు, కార్యాచరణ ఎంత మంచిగానైనా ఉండవచ్చు గాక. వాటి వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంత మేలైనా జరుగుతుండవచ్చుగాక. కానీ వాటిని వెంటవెంటనే గుర్తించి ప్రశంసించటం లేదని మేధావులు, రచయితలను నిందించలేము. ఎందుకంటే.. ఈ వర్గాల స్వభావం అటువంటిది. తెలంగాణలో అని కాదు, ఇప్పడని కాదు, ఎక్కడైనా, ఎప్పుడైనా అంతే. వీరు ఆలోచనాపరులు. ఆదర్శాల వారు. తమకు అనేక అధ్యయనాలు, అనుభవాలు ఉంటాయి. వాటిని బట్టి అనుమానాలు కలుగుతుంటాయి. అది సహజమైనది, న్యాయమైనది, వారి స్వభావానికి తగినటువంటిది. గమనించవలసిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. మేధావులు, రచయితలలో అత్యధికులకు ఏవో సిద్ధాంతాలుంటాయి. లేదా ఉదారవాదులు, గట్టి ప్రజాస్వామిక వాదులు అయి ఉంటారు. కొద్దిపాటి తేడాలతో వీరందరి ధోరణులు ఒకే విధంగా ఉంటాయి. విద్యార్థి దశలోనో, తర్వాతనో ఉద్యమాలలో పాల్గొనటం వల్ల ఈ ధోరణుల స్థాయి కొంత హెచ్చుగానే ఉంటుంది. తెలంగాణ వంటి చోటనైతే ఇక చెప్పనక్కరలేదు. అది కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక ఆశలతో, ఆదర్శాలతో త్యాగాలతో సుదీర్ఘ ఉద్యమాన్ని సాగించిన తర్వాత. అందువల్ల, రాష్ట్రంలో తొలిదశనుంచే మంచి జరగటమంటూ ఆరంభమైందని, ఆ మంచిని వారు అప్పటినుంచే గుర్తించవలసిందని, అందుకు బదులు అయిదారేండ్లు గడిచే వరకు కూడా విమర్శిస్తూనే ఉండిపోయారని అభ్యంతర పెట్టటం లేదిక్కడ. నిజానికి ఆ మంచిని వారు అప్పటినుంచే గుర్తించవలసింది. దాని అర్థం అంతటినీ మెచ్చుకుంటూనే ఉండవలసిందని కాదు. విచక్షణ లేకుండా ప్రతిదానిని మెచ్చటం కూడా వాంఛనీయం కాదు. అది హాని చేస్తుంది. కాని తెలంగాణలోని పలువురు మేధావులు, రచయితలు మంచిని మంచి, చెడును చెడు అనే విచక్షణాయుత, ప్రజాస్వామిక వైఖరిని మొదటినుంచే కాకున్నా కనీసం ఒకటి రెండేండ్ల పరిస్థితినైనా పరిశీలించి తీసుకొని ఉంటే బాగుండేది. తమ అభిప్రాయాలు తమకు ఉన్నా, క్షేత్రస్థాయి క్రమానుగత మార్పులను, ప్రజల జీవితాలను గీటురాళ్లుగా చేసుకునే మేధోపరమైన నిజాయితీని ప్రదర్శించ వలసింది. అందుకు బదులు వారిలో చాలా మంది తమ గత కాలపు ఆలోచనలకు బందీలై ఉండిపోయారు. వాస్తవాలను గుర్తించటం వల్ల తమకు వ్రతభంగం అవుతుందని భయపడి భావించినట్లున్నారు. దానితో వాటిని బుద్ధిపూర్వకంగా విస్మరించటం, వక్రీకరించటం కన్పించింది.

కాని వాస్తవాలు బలీయమైనవి. అవి ఒక అనివార్యత వంటివి. చివరకు అదే జరుగుతున్నది. కనుక మేధావులు, రచయితలలో పైన ప్రస్తావించినటువంటి మార్పు ఇటీవల కన్పిస్తున్నది. ‘కొట్టి వేయటానికి వీలులేకుండా జరుగుతున్న అభివృద్ధి’ ఏమిటో పెద్ద జాబితానే ఉన్నది. ఇంకా జరగవలసినవి అనేకం ఉన్నా, జరిగినవీ జరుగుతున్నవీ తక్కువ కాదు. ఆ పని ఇంటా, బయటా అందరినీ మెప్పించేంత వేగంగానూ జరుగుతున్నది. ఆ జాబితా ఇక్కడ రాయనక్కరలేదు. విమర్శకులు కాదనలేని జాబితా అది. ఇంతే ముఖ్యంగా మరొక రెండు జరుగుతున్నాయి. వాటిలో మొదటిది ప్రతిపక్షాల పరిస్థితి. బహుశా మేధావులు, రచయితలకు మన ప్రతిపక్షాల పట్ల గౌరవం ఏమీ ఉండకపోవచ్చు. కాని వాటిని ఒక ఆయుధంగా ఉపయోగించి అధికార పక్షాన్ని, కేసీఆర్‌ను దెబ్బతీసి సంతృప్తి పడవచ్చుననే ఆశలు ఏవైనా ఉంటే, అది నెరవేరగల సూచనలు ఎంతమాత్రం లేవని ఇటీవలి కాలంలో ఇంకా స్పష్టమై ఉండాలి. ఈ వర్గాలకు చిట్టచివరి ఆశలు రకరకాల ఉద్యమాలపై ఉంటాయి. కొన్ని తరగతులకు కొన్ని అసంతృప్తులు ఉన్నా, కొందరికి సిద్ధాంతాలూ ఆదర్శాలు ఉన్నా, కొందరు స్వప్రయోజనాల కోసం ఉద్యమ నటనలు కొన్ని చేస్తున్నా, కొందరు ఏవో ఆశాభంగాలతో పలవరింపులు వినిపిస్తున్నా, కొందరు అసహాయ ఆక్రందనలు చేస్తున్నా, మొత్తంమీద ఈ నిజమైన ఉద్యమాల తరగతికి గాని, సో కాల్డ్‌ వారికి గాని పరిస్థితులు ఎంత మాత్రం అనుకూలంగా లేవు. వారి ఆలోచనలలో వాస్తవాలతో నిమిత్తం లేనివి కొన్నయితే, స్వీయ వైఫల్యాలతో కూడుకున్నవి కొన్ని. వీటన్నింటి మధ్య విమర్శకులు నెమ్మదిగా బోధివృక్షం కిందకు చేరుతున్నారు.

టంకశాల అశోక్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement