e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home Top Slides మన మహా జనపదం 'అస్సక'.. మన తొలి రాజధాని బోధన్‌

మన మహా జనపదం ‘అస్సక’.. మన తొలి రాజధాని బోధన్‌

ప్రపంచ చరిత్రలో, మానవులు వ్యవసాయం నేర్చి స్థిర నివాసాలు ఏర్పరచుకున్న క్రమంలో తొలుత గణతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటిని మన ప్రజాస్వామ్య రాజ్యాలకు తొలి రూపమని చెప్పుకోవచ్చు. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో భారత ఉపఖండంలో అటువంటి మహా జనపదాలు పదహారు ఉండేవి. వీటిలో వాయవ్యాన గాంధారం నుంచి తూర్పున అంగ వరకు పదిహేను ఉన్నాయి. వింధ్యకు దక్షిణాన ఒకే ఒక్క మహాజనపదం ఉన్నది. ఆ ఒక్కటి అస్సక (అశ్మక) మహా జనపదం- మన తెలంగాణలో నేటి నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌ కేంద్రంగా వెలిసింది. మానవ నాగరికత పొద్దు పొడుపులో తొలి గణంతంత్ర ప్రయోగానికి వేదిక కావడం తెలంగాణ ఘనత.

గోదావరీ లోయలో కొత్త రాతి యుగంలో ఆవిష్కరింపబడిన ఇనుము వ్యవసాయ విస్తరణకు, చేతిపనుల అభివృద్ధికి దోహదం చేసింది. అప్పుడే పెరుగుతున్న గ్రామీణ సముదాయాలు, జనపదాలై, కొన్ని జనపదాల సమూహం ఒక కొత్త రాజకీయ అస్తిత్వానికి జన్మనిచ్చింది. అదే అస్సక మహా జనపదం. దీనినే అశ్మక, అస్మక, అశ్వక అని పలురకాలుగా పిలిచినట్లుగా సాహిత్యంలో దృష్టాంతాలున్నాయి. తెలంగాణ తొలి రాజకీయ అస్తిత్వం అస్సక మహా జనపదం.

- Advertisement -

భారత ఉపఖండంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి ఏర్పడిన సోలస (పదహారు) మహా జనపదాలు అంగ, మగధ, కాశి, కోసల, వజ్జి, మల్ల, ఛేది, కురు, పాంచాల, మత్స్య, శూరసేన, వత్స, అవంతి, గాంధార, కాంభోజ, అస్సక. వీటి ప్రస్తావన మనకు సాహిత్య ఆధారాల రూపంలోనే కాకుండా, నాణేల రూపంలో కూడా దొరుకుతుంది.

అస్సక ఎక్కడుంది?
అస్సక మహా జనపదం గురించిన తొలి వివరాలు మనకు ఇచ్చింది బౌద్ధ, జైన సాహిత్యాలు. వైదిక సాహిత్యంలో పురాణాలు అస్సకనే కాదు మగధ నేలిన నంద, మౌర్య వంటి వంశాల గురించి చెప్పినప్పటికీ వాటిలో కొంత సమస్య ఉంది. ఎందుకంటే పురాణాల్ని క్రోడీకరించింది గుప్తుల కాలం నుండి ఇంకో నాలుగైదు వందల ఏండ్లపాటు కాబట్టి. బౌద్ధ సాహిత్యంలో సుత్తనిపాత లోని పారాయణ వగ్గ ‘సో అస్సకస్స విషయే ముళకస్స సమాసనే వాసి గోదావరికులే’… అంటూ అస్సక మహా జనపదం అడ్రస్‌ స్పష్టంగా చెప్పింది. ముళక రాజ్యం పక్కన ఉన్న అస్సకలోని గోదావరీ తీరంలో అంటూ అస్సక అంటే తెలంగాణలోని గోదావరీ పరీవాహక ప్రాంతం అని చెప్పింది. ముళక కూడా గోదావరీ తీరమే కానీ ఎగువ గోదావరి అనీ, ప్రతిష్టానం అంటే ఇప్పటి పైఠన్‌ ముళక జనపదంలో ఉందని చెప్పింది.

జైన గ్రంథం ఆది పురాణం అస్సక రాజధాని పోదన, పోతలి లేక పోతన అని చెప్పింది. ఈ పేరే బోధన్‌గా మారింది. చారిత్రకయుగం మొదట్లోనే భారత ఉపఖండంలో విస్తరిస్తున్న జైన, బౌద్ధాలు తెలంగాణ జీవనంలో భాగమైనాయి.

బాహుబలి మన వాడా?
అవుననే చెపుతుంది జైనుల ఆది పురాణం. మొదటి తీర్థంకరుడైన ఆదినాథుడి (రుషభనాథుడు) ఇద్దరు కొడుకుల్లో ఒకడైన బాహుబలి అస్సక పాలకుడు. సోదరుడైన భరతుడితో రాజ్యంకోసం చేసిన యుద్ధంలో జరిగిన హింస వల్ల వైరాగ్యం వచ్చి కఠోర సాధన చేసి సిద్ధుడై కైవల్యం సాధిస్తాడు. ఆది పురాణాన్ని 10వ శతాబ్దంలో రాసినప్పటికీ బౌద్ధం కంటే కొంచెం ముందే జైనం మగధలో, ఆ తర్వాత అస్సకలో వ్యాపించింది అనేందుకు చారిత్రక పరిస్థితులు, భౌతిక ఆధారాలు ఉన్నాయి. రుషభనాథుడు మొదటి తీర్థంకరుడు కాబట్టి ఈ కథ 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడి కన్న ముందే అంటే క్రీస్తు పూర్వం 6 శతాబ్దానికి ముందే జరిగి ఉంటుంది.

బాహుబలి బోధన్‌ వాడే అనడానికి రెండో ఆధారం ప్రముఖ జైన చరిత్రకారుడు జవహర్‌లాల్‌ చెప్పినట్టుగా కర్ణాటక లోని శ్రావణబెళగొళ వద్దనున్న ఒక శాసనం. పౌడనపురం (పోదన లేక బోధన్‌) వద్ద అతి పెద్ద బాహుబలి విగ్రహాన్ని భరతుడు చెక్కించాడనీ, ఆ ప్రేరణతో పశ్చిమ గాంగుల మంత్రి చాముండరాయ, పదో శతాబ్దంలో శ్రావణబెళగొళ దగ్గర బాహుబలి అంటే గోమటేశ్వరుడి విగ్రహాన్ని చెక్కించాడని చెప్పడానికి శాసనాధారం శ్రావణ బెళగొళ మందిరానికి ఎడమవైపున్న శాసనం. ఇలా శ్రావణబెళగొళ గోమటేశ్వరుడికి మూలం తెలంగాణే అయింది. అందుకేనేమో తీర్థంకరుల విగ్రహాలు దేశంలో ఎన్నో చోట్ల దొరికినా బాహుబలి విగ్రహాలు ఎక్కువగా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులలోనే ఉన్నాయి.

బోధన్‌ బాహుబలి ఆధారాలు ఇప్పటికీ దొరకలేదు కానీ కల్యాణి చాళుక్య కాలం నాటి ఆరడుగుల బాహుబలి విగ్రహం ఒకటి పటంచెరువులో దొరికింది. ఇప్పుడది రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియంలో ఉంది. రెండోది జగిత్యాల జిల్లా పొలాస దగ్గర లక్ష్మీపురం గ్రామ శివారులో ఒక గుండు మీది ఆరడుగుల బాహుబలి విగ్రహం. ఇక్కడి బాహుబలిని పూజించేది జైనులు కాదు ఈ ఊరి రెడ్లు. ప్రతి దసరాకు బాహుబలికి పూజ చేసి కానీ సంబరాలు మొదలుపెట్టరు. ‘నమస్తే తెలంగాణ’ జగిత్యాల జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌, చరిత్ర పరిశోధన సంస్థ ప్రిహా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు కొత్తూరి మహేష్‌ కుమార్‌ చొరవతో ఇక్కడ బాహుబలి విగ్రహం బయటకు తెలిసింది.

ఉత్తర దక్షిణాల వారధి అస్సక
ఉత్తర భారతం నుండి దక్షిణానికి వచ్చే మూడు రహదారుల్లో రెండు దక్కన్‌ నుండే పోతాయి. వీటి ద్వారా దక్కన్‌లోని గోదావరి, వైన్‌గంగా వంటి నదులనూ, అరణ్యాలనూ దాటుతూ గ్రామీణ, ఆటవిక సముదాయాలతో సాన్నిహిత్యం, సంపర్కం జరిగి సంస్కృతీ, నాగరికతల్లో ఇచ్చి పుచ్చుకోవడం జరిగింది. అందుకే తెలంగాణతో సహా భారతదేశంలో క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం నుండి ఒక 500 ఏండ్లు నల్లటి నునుపైన ఉత్తర సంస్కృతికి చెందిన పాత్రలు కనిపిస్తాయి. భాష, మతం, ఆహార్యం, అలవాట్లు అన్నిటిలో తెలంగాణ సంస్కృతికి పునాదులు పడ్డాయి.

అస్సక జనపద నాణెం
అస్సక మహా జనపదం నుండి శాతవాహన రాజ్యం మధ్య కాలంలో మనకు దొరికిన నాణేల్ని అస్సక జనపద నాణేలు, మగధ నుండి పాలించిన నంద, మౌర్య కాలపు నాణేలు, స్థానిక పాలకుల నాణేలు, కోటిలింగాలలో దొరికిన శాతవాహన-పూర్వ రాజుల నాణేలుగా పణ శాస్త్ర (నాణేల శాస్త్రం) అధ్యయనం తేల్చింది.

అస్సక మహా జనపదానికి ఉన్న మొదటి భౌతిక ఆధారం నాందేడ్‌ దగ్గర టేక్రీలో దొరికిన రెండు గుండ్రటి నొక్కుడు వెండి నాణేలే. వీటిని అర్ధపణ అంటారు. ఒక నాణెం బొమ్మ భాగంలో ఏనుగు, చెట్టు ఇతర గుర్తులున్నాయి. రెండో నాణెం బొమ్మ భాగంలో ఏనుగు, దాని పైభాగంలో చుక్క, కింద చెట్టు ఇతర గుర్తులు ఉన్నాయి. రెండు నాణేలకు బొరుసు వైపు ఖాళీగా ఉంది. సాహిత్య ఆధారాలు చెపుతున్నట్టుగా గోదావరీ ప్రాంతంలో ఈ నాణేలు దొరికినందున వీటిని అస్సక నాణేలుగా గుర్తించారు.

తొలి గణరాజ్యం.. తెలంగాణ ఘన చరితం
కొత్త రాతి యుగంలో మొదలైన వ్యవసాయం నాగరికతకు నడకలు నేర్పింది. గంగా, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, కావేరి, మహానది – ఇలా అన్ని నదీ తీరాల్లో వ్యవసాయిక ఆధార సమూహాలు స్థిర ఆవాసాలు ఏర్పరచుకున్నాయి. వాటిని గ్రామాలు అన్నారు. కొన్ని గ్రామాల సమూహం జనపదమైంది. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం నాటికి ఇలాంటి కొన్ని వందల జనపదాలు భారత ఉపఖండంలో ఏర్పడ్డాయి. వీటిలో కొన్ని నాటి మానవ సమూహాల భౌగోళిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక లక్షణాలు, అవసరాల ఆధారంగా ఒకే రూపంతో మహా జనపదాలుగా మారిన క్రమం భారత చరిత్రలో ముఖ్యమైన ఘట్టం. ఇదే మన తొలి చారిత్రక దశను ఆవిష్కరించింది.

సుమారు క్రీస్తు పూర్వం 1300 తర్వాత సింధు లోయ నాగరికత క్షీణించి తొలి నగరీకరణ మాయమైన 600 ఏండ్లకు మళ్ళీ భారత ఉపఖండంలో ఏర్పడ్డ ఈ మహా జనపదాలు రెండో నగరీకరణకు మార్గం సుగమం చేసినయి. వ్యవసాయంలో మిగులు, చేతివృత్తుల అభివృద్ధి కారణంగా వ్యవసాయ, ఇతర ఉత్పత్తులు ఎన్నో రెట్లు పెరిగినయి. దీంతో వ్యాపార, వాణిజ్యాలు పెరిగి పట్టణాలు, నగరాల పుట్టుకను వేగవంతం చేసినయి.

మౌర్యుల నాణేలు
నంద వంశంతోపాటు, క్రీస్తు పూర్వం 322 నుండి సుమారు 140 ఏండ్లపాటు సాగిన మౌర్యుల పాలనలో తెలంగాణ ఉంది. కరీంనగర్‌ జిల్లా నుస్తులాపూర్‌లో దొరికిన ఇంపీరియల్‌ రకం నొక్కుడు నాణేలు మౌర్యుల ముందు, మౌర్యుల కాలం నాటివి. సూర్యుడు, షడార (ఆరు) చక్రం ఇలాంటి గుర్తులున్నవి మౌర్యుల పూర్వ నాణేలు. అయితే వాటి మీదే చంద్రరేఖ ముందు మూడు శిఖరాల కొండ బొమ్మ మౌర్యులది. ఇలా చలామణిలో ఉన్న నాణేల మీద కొత్తగా వచ్చిన వంశాలు తమ ముద్రల్ని కూడా వేసుకోవడం వల్ల ఒకే నాణెం రెండు వంశాల లేక రెండు కాలాల కథను మన ముందు ఉంచుతుంది. ఇలా అస్సక జనపద నాణేల నుండి మౌర్యుల నాణేల వరకు దొరకడం ఇక్కడ ఆర్థిక, రాజకీయ నిరంతరతను సూచిస్తుంది.

మన మొదటి రాజధాని ఆనవాళ్లు ఏనాటికైనా దొరికేనా?
బోధన్‌ చరిత్రపై పరిశోధన ఇప్పటికీ పెద్దగా జరగలేదనవచ్చు. 1914, 1974లో సర్వే, 1989-90, 1992-93లలో చిన్న స్థాయిలో తవ్వకాలు మాత్రం జరిగినయి.

ఒక వైపు పాత ఆధారాల మీద విస్తరించి ఉన్న ఇప్పటి బోధన్‌ పట్టణం, ఇంకోవైపు ఇప్పటికీ సరైన పద్ధతిలో పురావస్తు తవ్వకాలు జరగకపోవడంతో అస్సక మొదటి రాజధానిని సాహిత్య ఆధారాల్లో మాత్రమే చూసుకోవాల్సి వస్తున్నది. మగధ రాజధాని కోసం జరిపిన పురాతత్వ తవ్వకాలతో పాట్నా సమీపంలో కుమ్రహార్‌ ప్రాంతంలో మౌర్యుల నగరం పాటలీపుత్రం వెలుగులోకి వచ్చింది. తవ్వకాలు జరిగితే ఎంత చరిత్ర వెలుగు చూస్తుందో!

అస్సక జనపదం అంటే గోదావరీ లోయ అని చరిత్రకారులు భావిస్తున్నా, గోదావరీ-మంజీరా పరీవాహక ప్రాంతం అని అంటేనే సరైన అర్థం వస్తుంది. మధ్య గోదావరి పారుతున్న ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలు, మంజీరా నది ప్రవహించే సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలలో మనకు లభిస్తున్న ఆధారాలు అస్సక మహా జనపద విస్తృతిని తెలుపుతున్నాయి.

గుప్త నిధులలో నిక్షిప్తమైన చరిత్ర
ఇంపీరియల్‌ రకం నొక్కుడు నాణేల నిధి మొదటిసారి కరీంనగర్‌లో 1920-21లో దొరికింది. అందులో 367 నాణేలు ఉన్నాయి. ఇంకో నిధి మళ్లీ కరీంనగర్‌లో దొరికినా అది రికార్డు కాలేదు. మళ్లీ 1952లో కరీంనగర్‌ జిల్లా నుస్తులాపూర్‌లో దొరికింది. కోటిలింగాలలో 4221 నాణేలు, 1993లో ఈసనపల్లిలో, ఆ తర్వాత ఫణిగిరి తవ్వకాలలో నంద, మౌర్య నాణేలు దొరికాయి. 1985-86లో నాందేడ్‌ దగ్గర సిద్ధ-నాత్కి టేక్రి గ్రామంలో కిలో బరువున్న నొక్కు డు నాణేలు దొరికాయి. వీటిలో 12 నాణేలే న్యుమిస్మాటిస్ట్‌ గుప్తాకు చేరడంతో అస్సక జనపద నాణేలు వెలుగులోకి వచ్చినయి. వీటిలో 10 నాణేలు పనికిరాకుండా పోగా కేవలం 3 గ్రాముల బరువున్న రెండు నాణేలు ఈ చరిత్ర చెపుతున్నాయి. మిగతా 88 నాణేలను బంగారం దొరుకుతుందన్న ఆశతో కరిగించుకున్నారు. గుప్త నిధుల వేటగాళ్ల వల్ల చరిత్ర ఇట్లా కనుమరుగవుతున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement