e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home ఎడిట్‌ పేజీ విమోచన స్మరణలో..విద్వేష రగడ

విమోచన స్మరణలో..విద్వేష రగడ

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేడు తెలంగాణకు వస్తున్నారు. సెప్టెంబర్‌ 17 విమోచన దినం అని బీజేపీ వారు అదే పనిగా ఊరేగుతున్నారు. విలీన, విమోచన, విద్రోహ, విషాద దినం అంటూ తెలంగాణలో లోగడ చాలా చర్చే సాగింది. విమోచన దినం గురించి మాట తప్పారన్న ఆరోపణకు కేసీఆర్‌ గతంలోనే జవాబు చెప్పారు. చాలామంది విజ్ఞులను, చరిత్రను సంప్రదించానని అంటూ, అనేక విషాదాలతో కూడిన ఆ ఘట్టాన్ని ఉత్సవంగా జరపటం భావ్యం కాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. చరిత్రను పరిశీలిస్తే, భారత ప్రభుత్వంలోని కాంగ్రెస్‌ నాయకులకు నిజాంతో వైషమ్యం ఏమీ లేదని స్పష్టమవుతుంది.పోలీస్‌ యాక్షన్‌ తర్వాత కూడా నిజాంతో సత్సంబంధాలు కొనసాగాయి.

భారత సహ నిర్మాతలంటూ నాటి సంస్థానాధీశులను, మౌంట్‌బాటెన్‌ను వల్లభాయ్‌ పటేల్‌ కొనియాడారు. నిజాం లొంగుబాటు జరిగిన వెంటనే ఆయన భవిష్యత్తు గురించి పటేల్‌ను సంప్రదించానని, నిజాంను, ఆయన పేరిటే పాలననీ కొనసాగించాలని నిర్ణయించామని మీనన్‌ రాశారు.

- Advertisement -

తెలంగాణ చరిత్ర బొత్తిగా తెలియని ఉత్తరాది బీజేపీ నాయకుల అబద్ధాలను తేటతెల్లం చేయకుండా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. 2018 డిసెంబర్‌లో వికారాబాద్‌ ఎన్నికల సభలో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ ప్రసంగిస్తూ, బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ నుంచి నిజాం పారిపోయినట్టే ఓవైసీ సోదరుల పలాయనం తప్పద’ని చెప్పారు. నిజాం రజాకార్ల నేతృత్వంలో పనిచేశారనటం చారిత్రక అజ్ఞానం. ‘భారతదేశ సంస్థానాల విలీన గాథ ’ అనే పుస్తకంలో రచయిత వీపీ మీనన్‌ నాటి పరిణామాలను వివరించారు. పటేల్‌కు మీనన్‌ కుడి భుజం. విలీనాలు జరుపడానికి మౌంట్‌బాటెన్‌ అవసరమన్న మీనన్‌ సూచనను పటేల్‌ వెంటనే అంగీకరించారు(పే:68). హైదరాబాద్‌ గురించి ఉత్తర ప్రత్యుత్తరాలే కాక, కనీసం పది కీలక సమావేశాల్లో వైస్రాయి పాల్గొన్నారు. భారత సహ నిర్మాతలంటూ నాటి సంస్థానాధీశులను, మౌంట్‌బాటెన్‌ను పటేల్‌ కొనియాడారు.

కేంద్రం సుదీర్ఘ బేరసారాలు సాగించి 1947 నవంబర్‌ 27న యథాతథ ఒప్పందం చేసుకొని నిజాంను కొనసాగించింది. ఈ ఒప్పందాన్ని పటేల్‌ పూర్తిగా బలపరుస్తున్నారని; వెంటనే బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని మౌంట్‌ బాటెన్‌ 1948 మార్చి 2 సమావేశంలో చెప్పారు. ఆ పనిచేస్తే నిజాం, ఆయన వారసులు రాజ్యాంగబద్ధ పాలకులుగా శాశ్వతంగా కొనసాగుతారని చెప్పారు. అలా కాని పక్షంలో నిజాం గాడితప్పి తన సింహాసనాన్నే కోల్పోవచ్చని చెప్పారు. (పే: 235). పటేల్‌ గుండెపోటుతో, అనారోగ్యంతో 1948 మార్చి తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిం ది. మీనన్‌, మౌంట్‌బాటెన్‌ చర్చలు జరపడమే కాకుండా, కాసీం రజ్వీతో కూడా మాట్లాడారు. స్వయంగా ఉక్కుమనిషి కూడా రజ్వీతో భేటీ అయ్యారు.

విలీనం తర్వాత కూడా మీనన్‌ రజ్వీని కలిశారు. తనను జైల్లో బాగానే చూస్తున్నారని సమస్యలేమీ లేవనీ రజ్వీ చెప్పాడు. 1957లో అతన్ని పాకిస్థాన్‌కు క్షేమంగా పోనిచ్చారు. ఈ వివరాలన్నీ మీనన్‌ గ్రంథస్థం చేశారు. నిజాంతో ఘర్షణ 108 గంటల్లో ముగిసిందనీ, కమ్యూనిస్టుల అణచివేతకు మూడేండ్లకు పైగా పట్టిందని మీనన్‌ రాశారు (పే: 264-266); ప్రతిరోజూ వస్తున్న కమ్యూనిస్టు తిరుగుబాటు రిపోర్టులు చూసిన నాకు నిజాం విలీనం కన్నా అవే ఆందోళనకరంగా తోచాయని రాశారు.

1947 నవంబర్‌లో యథాతథ ఒప్పందం కుదిరాక, సంస్థానం అదనపు బలగాలతో 28 వేల సై న్యం కలిగి ఉండటానికి కేంద్రం అంగీకరించింది. నిజాం వ్యతిరేక పోరాటంలో విజయం సాధిస్తున్న కమ్యూనిస్టుల అణచివేత కోసం తమకు ఆయుధా లు కావాలని నిజాం కోరారని, పటేల్‌, కేంద్రం దా నికి అంగీకరించినారనీ (పే: 231) వెల్లడించారు.

రజాకార్లను రద్దుచేయాలని, అయితే అది ఒకేసారి కాక, క్రమంగా చేయాలనీ – నెహ్రూ, పటేల్‌, రాజాజీ అంతా అంగీకరించారు. (పే: 252). రైతుల పోరాటాన్ని అణచడానికే ఇది కూడా. సంస్థానంలో ఆంతరంగిక కల్లోలం గురించి తమకు బాగా తెలుసునని, ఈ ఒప్పందం కుదిర్చినందుకు మౌంట్‌బాటెన్‌కు కృతజ్ఞతలు చెప్తూ నవంబర్‌ 29న రాజ్యాంగసభలో పటేల్‌ మాట్లాడారు. అంతేకాక ఒప్పందం మేరకు కేంద్ర సైన్యాలను సంస్థానం నుంచి ఉపసంహరించుకున్నామనీ రాశారు. విమోచన నిజాం నుంచి కాదనటానికి ఇవన్నీ తిరుగులేని నిదర్శనాలు. 17న నిజాం లొంగుబాటు వెంటనే ఆయన భవిష్యత్తు గురించి పటేల్‌ను సంప్రదించానని, నిజాంను, ఆయన పేరిటే పాలననీ కొనసాగించాలని నిర్ణయించామని మీనన్‌ రాశారు (పే:257). 1956లో ఆంధ్ర ప్రాంతంతో బలవంతంగా తెలంగాణను విలీనం చేసేవరకు నిజామే రాజ ప్రముఖ్‌గా (గవర్నర్‌) కొనసాగారు. ఆయనతో పాటు రాజులందరికీ ప్రత్యేక హక్కులు, భరణాలుండేవి. 1970లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ వీటిని తొలగించేవరకు కొనసాగాయి. భరణాల రద్దును వాజపేయి పార్లమెంట్‌లో వ్యతిరేకించారు.

ఇది ముస్లింరాజు విలీనానికి అంగీకరించకపోవటం కాదు. హిందూరాజుల పాలనలోని ఇండోర్‌, మణిపూర్‌ కూడా విలీనాన్ని తోసిపుచ్చాయి. తిరువనంతపురం 1947 జూలై 14న కూడా స్వతంత్రంగా ఉంటామని ప్రకటించింది. మైసూరు ఆగస్టు 9 దాకా సంతకం చేయలేదు; 1949 జూన్‌ 1న గానీ భారత డొమినియనులో కలవలేదు. ఇవన్నీ కశ్మీర్‌ లాగే హిందూరాజుల పాలనలోవే.

ఫ్రెంచి వలసలు పుదుచ్చేరి, యానాం 1954 దాకా, పోర్చుగీసు వలసలు (గోవా)1961 డిసెంబర్‌ దాకా ఇండియాలో కలవలేదని అక్కడ మిలిటరీ జోక్యం లేదని గుర్తించాలి. హిందూ ప్రముఖులు నిజాం ప్రభుత్వంలో ముఖ్యపాత్ర వహించి, రాజభక్తి పరాయణులుగా ఉన్నారు. వారిలో అధికులు కాంగ్రెస్‌ స్థాపన తర్వాత కూడా అందులో చేరలేదు. ఎనమండుగురు హిందూ కులీనులు నిజాం రాజ్యంలో ప్రధాని పదవి కూడా (ఉదాహరణకు మహరాజా కిషన్‌ ప్రసాద్‌ 22 ఏండ్ల పాటు) నిర్వహించారు. నిజాంకు అప్పులిచ్చిన వారిలో ముఖ్యులు ధన్‌రాజ్‌గిర్‌ వంటి హిందూ వ్యాపారులే.

నాటి పోరాటం ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. ఆ పోరాటంలో ముస్లిం రైతు షేక్‌ బందగీ, విప్లవ కవి మఖ్దూం, ఫతేవుల్లాఖాన్‌ వంటి కార్మిక, జవ్వాద్‌ రజ్వీ వంటి విద్యార్థి నాయకులు, బాఖరుల్లాఖాన్‌ వంటి ముస్లిం వకీళ్లు, షోయబుల్లాఖాన్‌ ఎడిటర్‌గా ఉండిన ఇమ్రోజ్‌, మీజాను వంటి ఉర్దూ పత్రికలు, నిజాంకు వ్యతిరేకంగా సాహసంతో చేసిన కృషిని మరిచిపోలేం. భద్రాచలం వంటి అనేక గుడులకే కాదు, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి 1939లో రూ.లక్ష, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి రూ.యాభై వేలు నిజాం విరాళం ఇచ్చారు. (టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, నవంబర్‌ 23, 2019).

జన్‌సంఘ్‌ (నేటి బీజేపీ పూర్వరూపం) పితామహుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ ముస్లిం లీగ్‌తో చేతులు కలిపి మంత్రివర్గాల్లో పనిచేశారు.1915లో స్థాపించబడిన హిందూమహాసభ, 1925లో స్థాపించబడిన ఆర్‌ఎస్‌ఎస్‌ల పాత్ర 1940-51 నిజాము వ్యతిరేక పోరాటంలో సున్నా. పోరాటంలో కొంతమే ర పాల్గొన్న ఆర్యసమాజ్‌.. ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థ కాదు. 1952 ఎన్నికల్లో జనసంఘీయులు ఐదు సీట్లలో మాత్రం పోటీ చేశారు; మొత్తం ఐదున్నరవేల ఓట్లు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలు సెప్టెంబర్‌ 17పై చేస్తున్నది దేశభక్తితో కాదు, ఓట్లకోసం బరితెగించిన వైనమే ఇది.

ఆదిత్య కృష్ణ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement