e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home ఎడిట్‌ పేజీ రక్షణ కవచాన్నిరక్షించాలి!

రక్షణ కవచాన్నిరక్షించాలి!

కరోనా నుంచి మానవాళిని కాపాడేది మూడు పొరల మాస్కులైతే.. అనాదిగా భూగోళంపై జీవజాతిని రక్షించే ఏకైక రక్షణ కవచం ఓజోన్‌ పొర. ఇది సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి భూగ్రహంపై ఉండే సకలజీవులనూ కాపాడుతున్నది. కానీ ప్రాణికోటికి ప్రకృతి అందించిన వరమైన ఓజోన్‌ మనిషి స్వార్థానికి బలవుతున్నది.

ఈ నేపథ్యంలో ఓజోన్‌ సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఐరాస ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 16ను ‘ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. ఈ ఏడాది నుంచి 2024 వరకు ప్రపంచ ఓజోన్‌ దినోత్సవాన్ని మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ -మనల్ని, మన ఆహారాన్ని, వ్యాక్సిన్లను చల్లగా ఉంచుతుందనే ఇతివృత్తంతో జరుపుకొంటున్నాం. భూ ఉపరితలం నుంచి 25-35 కి.మీ. ఎత్తులో ఉండే స్ట్రాటోస్పీయర్‌ ఆవరణంలో ఓజోన్‌ ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే అతి శక్తివంతమైన, ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలను స్ట్రాటోస్పీయర్‌ పరిధిలోనే ఓజోన్‌ సంగ్రహించుకుంటుంది.
పల్లె నుంచి పట్టణం దాకా కాలుష్యం కోరలు చాచ డం వల్లనే భూరక్షణ కవచం ప్రమాదంలో పడింది. ముఖ్యంగా పర్యావరణానికి హాని కల్గించే కర్బన సమ్మేళనాలైన హేలోన్స్‌, మిథైల్‌ క్లోరోఫామ్‌, మిథైల్‌ బ్రోమైడ్‌ క్లోరో ఫ్లోరో కార్బన్స్‌ వంటివి విచ్చలవిడిగా గాలిలో కలిసిపోతున్నాయి. మనిషి ఎక్కువగా, అనవసరంగా ఉపయోగిస్తున్న వస్తువుల వల్ల జరుగుతున్నదనేది వాస్తవం. మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల నుంచి వస్తున్న విషవాయువుల వల్ల కాలుష్యం రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. ఏరోసాల్స్‌ ఉత్పత్తులు, రిఫ్రిజిరేటర్లు, ఫోమ్‌ బ్లోయింగ్‌ అప్లికేషన్లు, ఇబ్బడిముబ్బడిగా ఏసీలను వాడటం వల్ల ఓజోన్‌ పొర పలుచబడుతున్నది. మానవ తప్పిదాల వల్ల సకల జీవరాసులపై ఈ ప్రభా వం పడుతున్నది. కంటి సమస్యలు, చర్మ క్యాన్సర్లు, జన్యుపరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. క్రమంగా క్షీణిస్తున్న ఓజోన్‌ పొరను 1987లో గుర్తించిన ఐరాస 1994, సెప్టెంబర్‌ 16న వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఓజోన్‌ క్షీణతను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. పర్యావరణ సమస్యపై ప్రపంచ దృష్టి గైకొనే చర్యలపై శ్రీకారం చుట్టాలని ప్రపంచ దేశాలకు నొక్కి చెప్పింది.

- Advertisement -

ఐరాస ఒప్పందంలో భాగంగానే 1993 నుంచే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ఓజోన్‌ రక్షణ కోసం పలు జాగ్రత్తలను తీసుకుంటోంది. మాంట్రియల్‌ ఒప్పందం మేరకు గడువు కంటే ముందుగానే అనేక నియంత్రణలు పాటించింది. ఈ క్రమంలోనే ఫ్లోరో క్లోరో కార్బన్ల వంటి ఉత్పత్తులను నిలిపివేయడంతో పాటు 296 కన్వర్షన్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 2008లో క్లోరో ఫ్లోరో కార్బన్స్‌ వినియోగాన్ని నిలిపివేసింది. మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ (2011), క్యోటో ప్రొటోకాల్‌ (2013)పై మన దేశం సంతకాలు చేసిన దరిమిలా 2020 నాటికే దేశంలో ‘హెలో హైడ్రో కార్బన్ల’ వినియోగాన్ని కొంతమేర కట్టడి చేసింది. ఓజోన్‌ సంరక్షణ కోసం భావితరాలు విలాసాలను తగ్గించాలి. ఏసీలు, కాస్మొటిక్స్‌, పర్ఫ్యూమ్‌ స్ప్రేల నుంచి నిత్యం వాడే సెల్‌ఫోన్లు, ప్లాస్టిక్‌ వస్తువుల వాడకంలో పరిమితులు పెట్టుకోవాలి. సోలార్‌ విద్యుత్‌ వాడకాన్ని వీలైనంతగా పెం చాలి. ఇంధన వాడకాన్ని తగ్గించాలి. క్లోరో ఫ్లోరో కార్బన్‌ పదార్థాల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా ద్రవ నైట్రోజన్‌ వాడాలి. మొక్కలు విరివిగా నాటడం, చెట్లను సంరక్షించడం వంటివి వేగవంతం చేయాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి. ప్రకృతి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి.

గుమ్మడి లక్ష్మీ నారాయణ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana