e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home ఎడిట్‌ పేజీ ‘హిమ్రూ’ కళకు జీవం

‘హిమ్రూ’ కళకు జీవం

చేనేతరంగంలో ‘హిమ్రూ’ కళ విశిష్టమైనది. నవాబులు, రాచరికపు కుటుంబాలకు చెందిన వస్ర్తాలకు కొత్త అందాలను తీసుకురావడంలో ఈ కళ ఉపయోగపడేది. పర్షియన్‌ బ్రోకేడ్‌ పూలు, లతల డిజైన్‌ను జరీతో నేయడమే ‘హిమ్రూ’ కళ ప్రత్యేకత. దక్షిణభారతంలో ప్రసిద్ధి చెందిన ఈ కళను హైదరాబాద్‌కు పరిచయం చేసిన కళాకారిణి సురయ హసన్‌ బోస్‌. డాబు దర్పాన్ని ఒలకబోసేలా వస్ర్తాలకు అందాలు తేవాలనే ఆలోచనతో ఆమె ఈ హస్తకళకు జీవం పోశారు.

చేనేత, హస్త కళాకారులతో హైదరాబాద్‌లో ఖాదీ ఉద్యమాన్ని మొదలుపెట్టి, నిజాం ఏలుబడిలో దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు సయ్యద్‌ బద్రుల్‌ హుస్సేన్‌ కూతురే సురయ హసన్‌. 1928లో జన్మించిన సురయ తండ్రి బాటలో నడుస్తూ చేనేత కళపై మక్కువ పెంచుకున్నారు. కోఠి మహిళా కళాశాలలో విద్యాభ్యాసం చేసి, ప్రభుత్వ ఆధీనంలోని చేతివృత్తుల కళాశాలలో చేరి చేనేతరంగంపై అధ్యయనం చేశారు. 1940లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో టెక్స్‌టైల్‌ విద్యలో పట్టా పుచ్చుకొని చేనేత వస్ర్తాలకు వన్నెలద్దే ‘హిమ్రూ’ కళపై పూర్తిస్థాయి ప్రావీణ్యాన్ని సంపాదించారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే ‘హి మ్రూ’ కళతో పరిచయం ఉన్న కళాకారులను ఔరంగాబాద్‌లో గుర్తించి, వారిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఓ చేనేత వస్త్ర కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. 1950లలో ఢిల్లీలోని ప్రభుత్వ హస్తకళల కార్పొరేషన్‌ ప్రతినిధిగా భారతీయ ఖాదీ వస్త్రరంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు సురయ.

- Advertisement -

స్వాతంత్య్రానంతరం ‘హిమ్రూ’, ‘మజ్జో’ వంటి కళాకృతులు కనుమరుగయ్యాయి. ఈ కళకు 1972లో కొత్త సొబగులు అద్ది రమణీయ వస్ర్తాలకు జీవం పోశారు సురయ. ఢిల్లీలోని కార్మిక నాయకుడు అరవింద్‌ బోస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అన్న కుమారుడే ఈ అరవింద్‌. సురయ చిన్నాన్న అబిద్‌ హుస్సేన్‌ సఫ్రానీ సుభాష్‌ చంద్రబోస్‌ వ్యక్తిగత కార్యదర్శిగా ఉండటంతో సురయకు అరవింద్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు పెండ్లి చేసుకున్న పదేండ్లకే అరవింద్‌ మరణించారు. 1972లో సురయ హైదరాబాద్‌కు వచ్చేశారు. వస్త్ర తయారీకి వేదికగా కుటీర పరిశ్రమను ఏర్పాటుచేసి, భర్తను కోల్పోయిన మహిళలకు ఉపాధిగా దీన్ని తీర్చిదిద్దారు. అక్కడే చిన్నాన్న పేరుతో ‘సఫ్రానీ మెమోరియల్‌ స్కూల్‌’ను ఏర్పాటుచేసి, చేనేత కేంద్రంలో పనిచేసే కుటుంబాల పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు.

‘హిమ్రూ’ కళకు జీవం పోసే క్రమంలో ఈ కళతో కూడుకున్న పాత వస్ర్తాలను సేకరించే పని చేపట్టారు. ఆమె ఆలోచన, నిబద్ధతతో వారసత్వ కళాసంపద ముందుతరాలకు అందివచ్చింది. సురయ రూపొందించిన అరుదైన డిజైన్లు లండన్‌లోని విక్టోరియా ఆల్బర్ట్‌ మ్యూజియంలో ప్రదర్శితమయ్యాయి. వస్త్ర పరిశ్రమకు చేసిన సేవలకుగాను 2017లో ‘యుధ్‌ వీర్‌’ పురస్కారం లభించింది. ఆమె జీవిత విశేషాలతో ఫ్యాబ్‌ ఇండియా ప్రత్యేకంగా ‘కాఫీ టేబుల్‌ బుక్‌’ను ప్రచురించింది. సురయ చేనేత ప్రయాణంతో కూడుకున్న ఆత్మకథను ‘సురయ హసన్‌ బోస్‌.. వీవింగ్‌ ఏ లెగసీ’ పేరుతో ఢిల్లీకి చెందిన ప్రముఖ రచయిత్రి రాధికా సింగ్‌ రాసిన పుస్తకంతో వస్త్ర పరిశ్రమకు ఒక లెజెండ్‌ చేసిన సేవ వెలుగులోకి వచ్చింది. సురయ తన 93 ఏండ్ల వయస్సులో ఈ నెల 3న కన్నుమూశారు. ఆమెకు ఇదే మా నివాళి.

కోడం పవన్‌కుమార్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana