ఒక నాయకుని పుట్టిన పుట్టుకనే కాదు, బతికిన బతుకునూ లెక్కించాలి. ఎందుకంటే- వర్గ పోరాటంలో శత్రువు మన ఎదురుగా ఉంటాడు, ఓట్ల రాజకీయాల్లో ప్రత్యర్థి మన పక్కన ఉంటాడు. అదే, కుల ఉద్యమాల్లో అయితే నిట్టనిలువునా ముంచేసేవాడు మనలోనే కొలువుదీరి ఉంటాడు. వాడు పైకి కనిపించడు. మనకు వ్యతిరేకంగా ఏనాడూ వినిపించడు, కనిపించడు. అంతా మనకోసమే అంటాడు, అన్నీ మనకోసమే అంటాడు. అన్నింటా నేనేనంటాడు.
అణుక్షణం మన జపమే చేస్తూ జాగ్రత్తగా మనల్ని అడ్డం పెట్టుకొని తన అధినాయకుడిని ప్రాధేయపడి, ప్రసన్నం చేసుకొని అందలమెక్కేస్తాడు. అధికారాన్ని సొంతం చేసుకుంటాడు. ఆ అధికారాన్ని చెలాయిస్తాడు. ఆ అధికారాన్ని తన ఆధిపత్యాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటాడు. తన చేతిలో అధికారం ఉన్నన్నినాళ్లు, ఆధిపత్యాన్ని సాగించగలినన్నాళ్లు సాగించి, తన స్థాయిని మరిచి, నేల విడిచి సాము చేసి, తన అధినాయకునికే ముప్పు తెచ్చేందుకు సాహసించి ఆ ప్రకియలో తుదకు తనకే ఊపిరి ఆడనపుడు తిరిగి తన పుట్టుకనే (కులాన్నే) ఆశ్రయిస్తాడు. అలా మనల్ని ఆశ్రయిస్తే, మనం అన్నీ మరిచిపోయి అండగా నిలుస్తామని నమ్ముతాడు. మన అజ్ఞానం మీద అతడికి అంత నమ్మిక! అవును, ఈటెల ఇప్పుడు ఇలాగే ఉన్నాడు. ఇలాగే చేస్తున్నాడు. ఇకపై కూడా ఇలాగే చేయాలనుకుంటున్నాడు.
నమ్మక ద్రోహమంటే అమ్మకు ద్రోహమే!: ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మకం తెలంగాణ ఆత్మ. నమ్మక ద్రోహమంటే ఆత్మ ద్రోహమనీ, అంతకు మించి అమ్మకు ద్రోహమనీ నమ్ముతుంది తెలంగాణ సమాజం. నమ్మిన మనిషికి ద్రోహం చేసిన ఏ మనిషినైనా, అతను ఏ స్థాయిలో ఉన్నా అతన్ని ద్రోహిగానే పరిగణిస్తుంది. మరీ ముఖ్యంగా ఆరుగాలం కష్టించే అణగారిన కులాల్లో నమ్మకానికి ఉన్న విలువ అపారం. నువ్వు ఒక మనిషిని ఆశ్రయించనే కూడదు, అతని నుంచి ఆయన అండదండల్ని ఆశించనే కూడదు, సహాయం, సహకారాలను పొం దనే కూడదు. ఒక్కసారి అవి జరిగిన తర్వాత మన చివరిశ్వాస ఉన్నంతవరకూ అతని చెడు కోరకూడదు- ఇవి ప్రతి తెలంగాణ ప్రజ నుదుటిపై మెరిసే అలిఖిత శాసనం. ఈ నమ్మకపు విలువే మొత్తం తెలంగాణ సమాజం కేసీఆర్‌ను నమ్మేలా చేసింది.
ఈ నమ్మకమే తెలంగాణకు కేసీఆర్ అవసరం, అనివార్యమని చాటిచెప్పింది. ఈ నమ్మకమే ఒక బక్కపలచటి వ్యక్తిని బాహుబలిని చేసింది. ఆ బాహుబలి సారథ్యంలో అందరూ అసాధ్యమనుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సుసాధ్యం చేసింది. తిరిగి, ఈ నమ్మకాన్ని కేసీఆర్ నుంచి తెలంగాణ జనం సంపూర్ణంగా పొందారు. ఇలా, ఆ నమ్మకాన్ని కేసీఆర్ నుంచి అందిరికన్నా అధికంగా పొందినవాడు ఈటల రాజేందర్. ఈ సత్యాన్ని అయనే చెప్పుకొన్నాడు. ఇప్పటికీ చెప్పుకొంటూనే ఉన్నాడు. అలా చెప్పుకోవడం ఆయన గొప్పతనానికి, గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం ఏ మాత్రం కాదు. అది ఆయన అవసరం. అది ఆయనకు అనివార్యం.
అయినప్పడు, అన్నం పెటిన చేతికి సున్నం రాయడం ఎందుకు? నీడనిచ్చిన చెట్టును నిలువునా తెగనరకాలనుకోవడం ఎందుకు? ఇది మూర్ఖత్వమా? మిడిసిపాటుతనమా? ఇది గర్వమా? పతనానికి పునాదా? ఏది ఏమైనా, నీ వ్యక్తిగత భేషజానికి తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? ఇందులో బీసీలకు ఏముంది బాధ్యత? ఎందుకు ఈటలను ఒడ్డున చేర్చే బాధ్యతను, ఈటలను హీరోను చేసే బాధ్యతను బీసీలమైన మనం భుజాలకెత్తుకోవాలి? ఒక వ్యక్తి స్వార్థం కోసం మనమెందుకు మన శక్తియుక్తులను ధారబోయాలి? అది మన కర్తవ్యమా? అంత ముందుచూపు లేనివాళ్లమా మనం?
సొంతం చేసుకోలేనివాడికి సొమ్ము చేసుకునే హక్కెక్కడిది?: మనది కుల సమాజం అన్నది ఎవరూ కాదనలేని సత్యం. మనం ఏ కులంలో పుడుతామన్నది మన చేతుల్లో లేని అంశం. మన ఇష్టాయిష్టాలతో, నిర్ణయాధికారంతో సంబంధం లేకుండా మన జీవితంలోకి ప్రవేశించి, మన జీవితాలను నిర్ణయించి, నిర్దేశించి, నడిపించే నిర్ణయాత్మక శక్తి కులం. కాబట్టే రాజకీయాల్లో కూడా కులం కొందరికి సోపానమై, మరికొందరికి శాపమై కూర్చింది. రాజకీయాల్లో కులం ఒక సోపానంగా ఉపయోగపడగల కులాలలో పుట్టిన వ్యక్తులు ఆ సోపానాన్ని వాడుకొని ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఎదగడం నేరమేమీ కాదు. అయితే, అలా ఎదిగే అర్హత ఆ వ్యక్తికి ఉందా, లేదా అన్నది తేల్చుకోవడం ఆయా కులాలకు తప్పనిసరి. ఆ తప్పనిసరి దుస్థితిలో పడేశాడు ఈటల రాజేందర్ మనల్ని ఇప్పుడు!
ఈటల ఎండమావుల్లాంటి తన
ఆర్థిక సౌధాలను చూపించి ఆ నాయకుల అనుచర గణాన్ని తన గుప్పెట బంధించి ప్రతి బీసీ నాయకుడినీ నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించడం నిజం కాదా? తన రాజకీయ, ఆర్థిక ఎదుగుదలకు బీసీ అన్న గుర్తింపును వాడుకున్నది నిజం కాదా? దీన్ని బీసీలు ఎందుకు భరించాలి?
ఆత్మగౌరవమా నువ్వు ఆత్మహత్య చేసుకోకు తల్లీ!: ఆత్మగౌరవం అన్న మాట అణగారిన కులాలకు సంబంధించిన విషయం. కాబట్టే, ఈటెల పదే పదే ఆత్మగౌరవమంటుంటే నాకు భయమవుతున్నది. బీసీగా పుట్టిన ఈటల, బీసీగా బతకని ఈటల, బీసీ గుర్తింపును అడ్డం పెట్టుకుని అందలమెక్కిన ఈటల, ఆర్థికంగా అమాంతంగా ఎదిగిన ఈటల.. నీ సొంత సంతానానికి బీసీ అన్న గాలే సోకకుండా రెడ్డి గుర్తింపులో భవిష్యత్‌ను వెతుక్కున్నావు? ఎందుకలా మరో గుర్తింపును ఇచ్చావు? అంటే, బీసీలు ఈ సమాజంలో విలువ లేనివాళ్లు, పనికిరాని వాళ్లూ అనే కదా? నువ్వు నీ కులాన్ని, నీ బీసీలనూ చిన్న చూపు చూస్తున్నావనే కదా? కుటుంబం కోసం బీసీలను ఇంతగా అవమాన పరచిన నీకు బీసీ అనే అర్హత ఉందా?
ఈటలా, నీ స్వార్థం కోసం కష్టజీవులైన బీసీలను కష్టాల పాల్జేయకు. నువ్వు మా బీసీలకు ఎలాంటి మేలు చేయలేదు, చెయ్యవు. స్వార్థం కోసం మమ్మల్ని బలిచేయకు. ఆ దుస్సాహసం చేస్తే చివరికి నువ్వే బలైపోతావు. చరిత్ర హీనుడవైపోతావు.
చిత్తరవు రహిత శిథిలమైపోతావు!
ఈటెల రాజేందర్ తనను తానెప్పుడూ బీసీగా గుర్తించుకోలేదు. బీసీలను తనవారిగా గుర్తించలేదు. ఈటల నోటి నుంచి ఏనాడైనా బీసీ అన్నపదం వెలువడిందా? ఈటలకు ఏనాడైనా బీసీలను అక్కున చేర్చుకున్న చరిత్ర ఉందా? దశాబ్దాలుగా బీసీల కోసం తన శక్తిమేరకు పనిచేసిన, చేస్తున్నవారిని ఆయన ఏనాడైనా గుర్తించారా? గౌరవించారా? అక్కున చేర్చుకున్నాడా? లేదు కాక లేదు!
కోప్ర