e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home ఎడిట్‌ పేజీ సంస్కృతానికి జీవం.. సంస్కృతికి జవం

సంస్కృతానికి జీవం.. సంస్కృతికి జవం

  • నేటి నుంచి ‘సంస్కృతం’ భాషా వారోత్సవాలు

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటమే కాదు, వాటికి మూలాలను కూడా పరిరక్షించేందుకు ప్రభుత్వం పూనుకోవడం సంతోషదాయకం. ‘భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా..’ భారతదేశానికి సంస్కృతం, సంస్కృతి రెండు ప్రతిష్ఠాత్మకమైనవి. భారతీయ సంస్కృతి పరిరక్షణకు, సంస్కృత భాష పరిపుష్టికి భారతీయ సంస్కృతి పరస్పరాశ్రయ పద్ధతిలో వర్ధిల్లుతున్నాయి. సంస్కృత సాహిత్యం భారతీయ సంస్కృతికి ప్రతీక. మన సంస్కృతికి మూలమైన ఆధ్యాత్మిక, తాత్విక చింతనలు, నైతిక జీవనాన్ని, సమాజ శ్రేయస్సును కలిగించే వివిధ విషయాలు సంస్కృత గ్రంథాల్లో రాసి నిక్షిప్తం చేశారు. అలాగే ఆధునిక విజ్ఞాన విషయాలకు సంస్కృత సాహిత్యం భాండాగారం. ఇవే మన ప్రస్తుత సంస్కృతికి నిలువుటద్దాలై మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి. సంస్కృత సాహిత్యమే లేకుంటే భారతీయ సంస్కృతి అంతరించిపోతుందంటే అతిశయోక్తి కాదేమో.

ఏటా శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. దీనిలో భాగంగా సంస్కృత భాష గొప్పతనం, ఆ సాహిత్యంలో ఉత్తమ విలువలను తెలియజేసేలా వివిధ కార్యక్రమాలతో ఏడు రోజుల పాటు వారోత్సవాలను జరుపుకొంటున్నాం. రాష్ట్రంలో ఈసారి మరింత ఘనంగా, ఉత్సాహంగా సంస్కృత భాషాపండితులు, భాషాభిమానులు, సంస్కృతి పరిరక్షకులు ఈ ఉత్సవాలను నిర్వహించుకోనున్నారు.

- Advertisement -

ప్రపంచంలో అతి పురాతన భాషల్లో సంస్కృతం ఒకటి. మన దేశ అధికారిక భాషగా గుర్తించబడి గౌరవించబడుతున్నది. సంస్కృతం దేవ భాష, అమరవాణి, గీర్వాణిగా పిలవబడుతున్నది. ‘జనని సంస్కృతంబు సర్వభాషలకు’ అని క్రీడాభిరామంలో చెప్పినట్లుగా సంస్కృతం దేశ భాషలపైనే కాదు, ప్రపంచంలోని 876 భాషలపైన తన ప్రభావాన్ని కలిగి ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంస్కృత ప్రభావమేంటో అర్థం చేసుకోవచ్చు. సంస్కృతం, మన మాతృభాష తెలుగు విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉన్నాయి. తెలుగు భాషలోని 40 శాతం పదాలు సంస్కృతం నుంచే వచ్చాయని భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం. సంస్కృత భాషా పదాల కలయిక తెలుగుకు మరింత శోభనిచ్చింది. ఇప్పుడు తెలుగులో కొన్ని పదాలు చదివితే, కొన్ని పదాలు వింటే అవి సంస్కృతమా లేక తెలుగువా అనే సంశయం రాక మానదు. అంతగా తెలుగు, సంస్కృతం కలగలిసిపోయాయి. అలాగే తెలుగు పదాలు కొన్ని సంస్కృతభాషలోనూ మనకు తారసపడతాయి. తెలుగు, సంస్కృతం రెండు ఒకే భాషా కుటుంబానికి చెందకపోయినా ఒకటితో ఒకటి కలిసి మనగలగడం ఆశ్చర్యం.

ఇంతటి గొప్పనైన సంస్కృత భాష తెలంగాణ నేలలో ఎప్పటినుంచో పరిఢవిల్లుతున్నది. అలాగే మన సంస్కృతిలోనూ అంతర్భాగమైంది. ఇక్కడ శాతవాహనుల కాలం నుంచి అసఫ్‌జాహీల వరకు రాజులందరూ సంస్కృతాన్ని ఆదరించారు. పాణిని ‘అష్టాధ్యాయి’ అనే వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతం నేర్చుకోవడానికి రూపొందిస్తే, అంతకంటే సులువుగా సంస్కృత భాష నేర్పుతానని, నేర్చుకోవచ్చునని చెప్పి తెలంగాణ తొలి పాలకులైన శాతవాహన కాలం నాటి కవి శర్వవర్మ ‘కాతంత్రం’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రాశారు. ఆయనే స్వయంగా శాతవాహన చక్రవర్తికి మూడు నెలల్లో సంస్కృతాన్ని బోధించి, ఆ భాషలో ప్రావీణ్యుడిగా తీర్చిదిద్దిన ఘనత వారిది. విద్యానాథుడు ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ అనే అలంకార గ్రంథం రచించారు. తెలుగువారు సంస్కృతంలో రాసిన మొదటి అలంకార గ్రంథం ఇదే.

ఇక కాకతీయ రాజులు స్వయంగా గ్రంథాలను రాసి వెలువరించి సంస్కృత భాషపై తమకు గల అభిమానాన్ని చాటుకున్నారు. మొగల్‌ సామ్రాజ్య ఆస్థానంలో కూడా మన తెలంగాణ సంస్కృత పండితులు ఆదరించి గౌరవింపబడ్డారు. షాజహాన్‌ ఆస్థాన కవిగా జగన్నాథాచార్యులు ఓ వెలుగు వెలిగారు. తెలంగాణను పాలించిన కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు కూడా సంస్కృతాన్ని అక్కున చేర్చుకున్నారు. ఇలా వందల మంది కవులు, పండితులు ఈ నేలపై వేల రచనలు చేశా రు. తెలంగాణ సంస్కృత పండితులు, ఘనాపాఠీ లు భారతదేశపు నలుదిశలా విస్తరించారు. ఇంతటి ఘన సంస్కృత సాహిత్య చరిత్రకు మనం వారసులం కావడం గర్వకారణం.

తెలంగాణలో స్థాపించిన తొలి సంస్కృ త పాఠశాల కోరుట్ల. తర్వాత మంథని, వేములవాడలలో వరుసగా స్థాపించబడ్డాయి. హైదరాబాద్‌ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చొరవతో కౌన్సిల్‌ ఆఫ్‌ సంస్కృత్‌ ఎడ్యుకేషన్‌ ఏర్పాటుచేసి అప్పటివరకు నడుస్తున్న వివిధ సంస్కృత విద్యాసంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. దానితో కొన్ని పాఠశాలలు, కళాశాల స్థాయికి ఎదిగినా, కాలక్రమంలో అవి కనుమరుగయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వేములవాడ, యాదాద్రి, హైదరాబాద్‌లలో సంస్కృత విద్యాసంస్థలు నడుస్తున్నాయి.

సంస్కృత భాష, సాహిత్యాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో ‘కంపోజిట్‌ తెలుగు’ పేరుతో సంస్కృతాన్ని బోధించారు. తెలంగాణ ప్రభుత్వం సంస్కృత భాషా ప్రాధాన్యాన్ని, అవసరాలను గుర్తించి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ద్వితీయ భాషగా గుర్తించాలనే ఆలోచనలో ఉన్నది. ఇది హర్షణీయం. ఒకప్పుడు గొప్పగా ఈ నేలపై ఉజ్వలంగా వెలిగిన దేవభాషకు నేడు ప్రభుత్వం గొప్ప సంకల్పంతో జీవం పోయ నున్నది. సంస్కృతానికి జీవం పోయడమంటే భారతీయ సంస్కృతికే జీవం పోయడమే.

  • డాక్టర్‌ ఆవుల మల్లారెడ్డి
  • డాక్టర్‌ సందెవేని తిరుపతి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana