e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home ఎడిట్‌ పేజీ ఆ నల్లని రాళ్లతో .. నా యాది

ఆ నల్లని రాళ్లతో .. నా యాది

ఎ‘ది బ్రైటెస్ట్‌ ఇన్‌ది గెలాక్సీ ఆఫ్‌ మిడీవల్‌ టెంపుల్స్‌’గా రామప్పను కీర్తిస్తూ 1984లో ‘ది ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ’లో మాజీ ప్రధాని పీవీనరసింహారావు ఒక వ్యాసం రాశారు. రామప్ప శిల్పకళా వైభవాన్ని అద్భుతంగా వివరించారు. ప్రపంచ పర్యాటకులు రామప్పను సందర్శించాలని పీవీ ఆశించారు. ఆయన స్వప్నం ఇన్నాళ్లకు నిజమైంది. యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడాల జాబితాలోకి రామప్ప చేరింది.

రామప్ప దేవాలయాన్ని క్రీ.శ.1213లో కాకతీయ సామంత రాజైన రేచర్ల రుద్రయ్య రామప్ప గుడిని నిర్మించారు. దీని నిర్మాణానికి నలభై ఏండ్లు పట్టింది. శిల్పి పేర భారతదేశంలో కీర్తింపబడుతున్న ఏకైక దేవాలయం రామప్ప. దీన్ని పరిరక్షించింది నిజాం ప్రభుత్వం. తెలంగాణకు చెందిన ప్రముఖ కవి డాక్టర్‌ సినారె ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల మాటున.. ఏ గుండెలు మ్రోగెనో..’ పాటలో రామప్ప శిల్ప సౌందర్యాన్ని హృదయాలకు హత్తుకునేలా వర్ణించారు. కాకతీయ గణపతి దేవ చక్రవర్తి బావమరిది అయిన జాయప సేనాని రచించిన ‘నృత్త రత్నావళి’ అను గ్రంథం ఆధారంగా రామప్ప శిల్పాలను చెక్కినారని అంటారు. ‘పేరిణి శివ తాండవ నృత్యం’ కాకతీయుల పాలనలో ప్రజల్లో, సైనికుల్లో దేశ, దైవభక్తిని ప్రేరేపించే వీరరస ప్రధానమైన దేశీనృత్యం. గత ఏడు శతాబ్దాలుగా మరుగున పడిన ఈ నృత్యరీతికి ప్రముఖ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ రామప్పలోని శిల్పాల ఆధారంగా తిరిగి ప్రాణం పోశారు.

- Advertisement -

రామప్ప గుడి నెలవై ఉన్న పాలంపేట గ్రామం నా జన్మస్థలం. మా ఊరికి ప్రపంచపటంలో
యునెస్కో ద్వారా చెరగని స్థానం లభించినందుకు గర్వంగా ఉంది. నా జీవిత లక్ష్యమైన తెలంగాణ
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యంత ఆనందాన్నిచ్చింది రామప్పకు యునెస్కో గుర్తింపు.

రామప్ప చరిత్రను, విశేషాలను రాసిన నా గురువు మందల మల్లారెడ్డి ఇటీవలే మరణించారు. వారి ఆకాంక్ష మరణానంతరం నెరవేరింది. ఊహ తెలియని వయస్సు నుంచే రామప్ప గుడి, చెరువుతో నాకు అనుబంధం ఏర్పడింది. ఇంటికి, ఊరికి అతిథులు ఎవరు వచ్చినా గుడి, చెరువు చూపించటం తన బాధ్యతగా అస్సల్‌దార్‌ మాలీ పటేల్‌ అయిన మా బాపు వీరమల్ల రాజనర్సింగారావు భావించేవారు. ఆ రోజుల్లో రామప్పకు వచ్చే పర్యాటకులకు, అధికారులకు భోజన, వసతి సౌకర్యాలు లేకపోవటం వల్ల మా ఇల్లే వారికి ఆతిథ్యం ఇచ్చేది.

రామప్ప గుడి తూర్పు ద్వారాన్ని ఆనుకొని మా పొలం ఉన్నది. గుడి ప్రహరీ గోడ మా అడ్డాగా ఉండేది. ఎండకాలం సెలవుల్లో ఎక్కువకాలం ఈ ప్రహరీ గోడపై మా ఆటా పాట కొనసాగేది. రామప్పను సందర్శించే పర్యాటకులను ఆశ్చర్యంతో గమనించేవాళ్లం. బాల్యం నుంచి రోజూ చూసే గుడి కాబట్టి దాని గొప్పతనం మాకు తెలిసేది కాదు.

ఆ రోజుల్లో రామప్ప గుడికి వచ్చే సందర్శకులకు ఇక్కడి శిల్పకళా విశేషాలను వివరించటానికి గైడ్లు లేరు. 1968లో అప్పటి రాష్ట్ర గవర్నర్‌ కందూభాయ్‌ దేశాయ్‌ రామప్ప సందర్శనకు వచ్చినప్పుడు మా ఊరివాళ్లంతా రోడ్డుకిరువైపులా నిల్చొని వారికి టాటా చెప్పటం నాకిప్పటికీ గుర్తుంది. సీఎంలు, గవర్నర్లు రామప్పకు వచ్చినప్పుడు అక్కడి విశేషాలను చెప్పడానికి వరంగల్‌లోని ఏవీవీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న సోమేశ్వరరావును కలెక్టర్‌ పిలిపింంచేవారు. ఎవరైనా విదేశీ పర్యాటకులు వస్తే మా ఊరిలోని చర్చి ఫాదర్‌ను గుడి వాచ్‌మెన్‌ పిలిచేవారు. నాకు ఆంగ్ల భాషలో కొద్దిగా మాట్లాడటం వచ్చిన తర్వాత వాచ్‌మెన్‌ నన్ను విదేశీయులకు పరిచయం చేసి గుడి విశేషాలు చెప్పించేవాడు.

తొలి సినిమా చూడకముందే నేను 1965లో రామప్పలో జరిగిన ‘ఆత్మగౌరవం’ షూటింగ్‌ చూశాను. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. అక్కినేని, కాంచనలపై ‘ఒకే పూలబాణం-తగిలింది మదిలో..’అనే పాటను మూడు రోజులు చిత్రీకరించారు. వాళ్ల అవసరాలన్నీ మా బాపు చూసేవారు. ఆ మూడు రోజులు స్కూళ్లో టీచర్లు, విద్యార్థులం రామప్ప ప్రహరీపై కూర్చొని షూటింగ్‌ చూశాం.

ఆ రోజుల్లోనే నటరాజ రామకృష్ణ కొన్ని నెలల పాటు రామప్ప శిల్పాలను అధ్యయనం చేశారు. మా బాపు ఆయన అవసరాలు చూసేవారు. రామప్పతో నటరాజ రామకృష్ణ అనుబంధం చాలా కాలం కొనసాగింది. 1985 ఫిబ్రవరి 17న శివరాత్రినాడు పది వేల నూనె దీపాలను వెలిగించి తన శిష్య బృందంచే తాను పునరుద్ధరించిన దేశీ నృత్యమైన పేరిణీ శివతాండవ ప్రదర్శననిచ్చారు నటరాజ రామకృష్ణ. సమాచార పౌరసంబంధ శాఖ దినపత్రికలలో ఈ ప్రదర్శనకు బాగా ప్రచారం కల్పించటంతో వేలాది మంది సుదూర ప్రాంతాల నుంచి రామప్పకు వచ్చారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు గానీ, గ్రామాధికారిగా ఆ ఏర్పాట్లు దగ్గరుంచి జరిపించిన మా బాపు గానీ ఇంత భారీ సంఖ్యలో జనం వస్తారని అంచనా వేయలేదు. రామప్ప ప్రధాన కాల్వపై నిర్మించిన ఇరుకైన బ్రిడ్జి (మోరీ)పై ‘జామ్‌’ అయ్యింది. ఎక్కడి వారక్కడే గంటలపాటు నిలిచిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పొలాల గట్లపై నుంచి చీకట్లో నడుచుకుంటూ నేను మా ఇంటికి చేరుకున్నా.

ఆంధ్ర పాలకులు ఏ నాడూ రామప్పను పట్టించుకోలేదు. ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా రామప్పను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత శిథిలమైన కాటేశ్వరాలయాన్ని, రామప్ప పైకప్పును, నంది మండపాన్ని పునరుద్ధరించింది. రామప్ప ఆవరణలో దక్షిణాన ఉన్న కామేశ్వరాలయాన్ని పునరుద్ధరణ కోసం రాళ్లపై నంబర్లు వేసి భూమిపై పరిచారు. నిధుల లేమితో ఈ పనులు సాగడం లేదు. తెలంగాణ వస్తే ఏమొస్తదనేవాళ్లకు సమాధానమే రామప్పకు దక్కిన యునెస్కో గుర్తింపు. దీనికోసం 2009 నుంచి తెలంగాణకు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పాపారావు, వరంగల్‌ ఆర్‌ఈసీ (ప్రస్తుతం ఎన్‌ఐటీ) ప్రొఫెసర్‌ (రి) పాండురంగారావు కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ను స్థాపించి ఎంతో కృషిచేశారు. రామప్ప సమీప గ్రామం మల్లయపల్లెకు చెందిన ప్రొఫెసర్‌ సీతారాంనాయక్‌ ఎంపీగా ఉన్నప్పుడు (2014-18) మూడుసార్లు రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం లోకసభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ పట్టుదల వల్లే కేంద్రం 2018లో రామప్పను యునెస్కోకు నామినేట్‌ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క కట్టడం యునెస్కో జాబితాలో చేరలేదు. ఇప్పుడు తెలంగాణ రామప్పకు ఈ గుర్తింపు తెచ్చుకోగలిగింది.

వి.ప్రకాశ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana