e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home ఎడిట్‌ పేజీ ఉన్న ఊర్లోనే ఉన్నతంగా..

ఉన్న ఊర్లోనే ఉన్నతంగా..

తెలంగాణలో 19వ శతాబ్దం మొదట్లో దళితత్రయంగా పిలుచుకునే భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బి.ఎస్‌.వెంకట్రావు లాంటివారు దళిత సాధికారత కోసం కృషిచేసినట్లు చరిత్ర మనకు చెప్తున్నది. అంటరానితనం వంటి తీవ్ర వివక్షతలున్న ఆ రోజుల్లోనే వీళ్లు ధైర్యంతో దళితుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అదే ధైర్యం, అదే తెగువతో నేడు దళితుల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ‘దళితబంధు పథకం’ ద్వారా చేస్తున్న ప్రయత్నం ఎన్నదగినది. ఈ పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

వరినోట విన్నా ఇప్పుడు ‘దళిత బంధు’ పథకమే వినపడుతున్నది. ఈ పథకాన్ని జాతీయస్థాయిలో ఆదర్శంగా ఉండేవిధంగా రూపొందించారు. ఈ పథకం విజయవంతం కావాలంటే కేసీఆర్‌ అన్నట్లు ప్రతి దళితబిడ్డ ‘దళిత బంధు’ కోసం పట్టుబట్టి పనిచేయాలె.

- Advertisement -

ఆర్యుల కాలం నుంచి నేటిదాకా దళిత వర్గం వివక్షకు, వెనుకబాటుతనానికి గురవుతూనే ఉన్నది. స్వాతంత్య్ర సమరంలో దళితులపై వివక్ష చూపించరాదన్న భావనతో మహా త్మా గాంధీ ఉద్యమంలో వారిని భాగస్వాములను చేశారు. దళిత సమాజం ఎదుర్కొంటున్న వివక్షను డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వివరించారు. దళితులు వివక్షకు గురికాకూడదని రాజ్యాంగంలో కొన్ని హక్కులతో పాటు, ప్రత్యేక నిబంధనలను తీసుకువచ్చారు. దళితుల విద్య, ఆర్థిక సాధికారతకు అన్ని ప్రభుత్వాలు కృషిచేయాలని రాజ్యాంగంలోని అధికరణం-46 చెప్తున్నది. అధికరణలు 15, 16, 17 అంటరానితనం, విద్య రిజర్వేషన్లు వంటి అంశాలను తెలియపరుస్తున్నాయి. చట్టసభల్లో దళిత నేతలకు ప్రాతినిధ్యం కల్పించడం కోసం రిజర్వేషన్లను అమలుచేశారు.

రాజ్యాంగంలో దళితుల అభ్యున్నతిపై అనేక అంశాలున్న ప్పటికీ గత ప్రభుత్వాలు వీటిపై చిత్తశుద్ధి చూపలేదు. గ్రామీ ణ ప్రాంతాల్లోని దళిత సమాజం అణగారిన వర్గంగానే ఉండిపోయింది. విద్య, వైద్యం, ఉపాధి లాంటివి సాధికారత మీదే ముడిపడి ఉంటాయి. ఎన్ని పథకాలు వచ్చినప్పటికీ దళిత సామాజిక వర్గం అభివృద్ధి సాధించలేకపోయింది. ‘నేషనల్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో’ ప్రకారం సుమారు 22 శాతం దళితులపై నేరారోపణలు, హత్యలు, స్త్రీలపై అఘాయిత్యాలు పెరిగాయి. ‘ప్రథం’ అనే స్వచ్ఛంద సంస్థ వార్షిక నివేదిక దళితుల్లో ఎక్కువ శాతం బాలబాలికలు అర్ధాంతరంగా విద్యను నిలిపివేస్తున్నారని వెల్లడించింది. 10-12 శాతం మంది మాత్రమే ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తున్నారని అభివృద్ధి నివేదికలు చెప్తున్నాయి.

దళితుల్లో అత్యంత అణగారిన వర్గాలు, ఆశ్రిత కులాలు ఎక్కువ. కులాల రిజిస్ట్రేషన్లలో వారిని చేర్చనందువల్ల చాలామంది రిజర్వేషన్లు కూడా పొందలేకపోతున్నారు. సంక్షేమ పథకాల్లో అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అందరి సంక్షేమం, అభివృద్ధి కోసం తెచ్చిందే ‘దళిత బంధు’ పథకం.

రాష్ట్రంలోని 54 లక్షల మంది దళితుల బాగుకోసం విద్య, వైద్యం, ఉపాధిని స్వతహాగా అభివృద్ధి చేసుకునేవిధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రతి నియోజకవర్గంలో అర్హులైన వంద మందికి రూ.10 లక్షల నగదు తమ సొంత బ్యాంకు ఖాతాలో నేరుగా జమవుతాయి. ఈ పథకం ద్వారా ప్రభుత్వం చేసే ఆర్థికసాయం పూర్తిగా ఉచితం. ఇది అప్పు కాదు. దళారుల ప్రమేయం ఉండదు. ఈ డబ్బుతో వివిధ చిన్న, మధ్యతరహా వ్యాపార రంగాలకు పెట్టుబడి పెట్టడం వల్ల వారి జీవితాల్లో నమ్మకం, భద్రత ఏర్పడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే అన్నిరకాల విముక్తి లభిస్తుంది. దళితులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కులవృత్తులకు సంబంధించిన వ్యాపారాలూ ప్రారంభించవచ్చు. సాధికారతే లక్ష్యంగా, ఉన్న ఊర్లోనే ఉన్నతంగా ఎదిగేందుకు దళితబంధు పథకం తోడ్పడుతుంది. దళిత సాధికారతతో పాటు దళితుల రక్షణ నిధిని కూడా ప్రభుత్వం ప్రకటించడం ‘దళిత బంధు’ లో ఉన్న మరొక గొప్ప విశేషం. దేశంలోని అన్ని రాష్ర్టాలు ‘దళిత బంధు’ లాం టి పథకాలు తీసుకువస్తే గత ఏడు దశాబ్దాల్లో సాధించని దళితుల సాధికారత, అభివృద్ధిని కొద్ది కాలంలోనే సాధించే అవకాశం ఉంటుంది.

-కన్నోజు శ్రీహర్ష

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana