పాదయాత్రలు
అవగాహన కోసమైతే మంచిదే
ఆర్భాటాలకే ఐతే కాల హననమే!
బరి గీసి కొట్లాడుతున్నప్పుడు
నీవు కొత్త జెండా ఎత్తుకుంటే
సమూహాలు కదిలొస్త్తాయనుకుంటే భ్రమే!
పొసగకపోవడం వ్యక్తిగతమైతే
నీవు పాడే స్వార్థగీతానికి
బృందగానం కరువే!
తనకు నష్టం జరిగినప్పుడు
దేవుడైనా మానవ రూపంలోనే వస్తాడట
ఇదిగో ఇట్లా రోడ్డెక్కిస్తాడు!
మాటల్లో
ఎంత నిజాయితీ ఒలకబోసినా
దేవుని మాన్యాలు వెంటాడుతాయి!
పిడికిలెత్తిన చేతుల చరిత్ర
పాదాలు నేల విడిచి సాము చేస్తే
కనుమరుగు కావటానికి పెద్దకాలం పట్టదు!
పదవిది జీవితానిది
అరిటాకు మీది నీటి బొట్టు బంధమే
బొట్టు జారినా ఆకు పచ్చగ మెరవాలె!
అన్నీ చేసి ఇప్పుడు
నీవు అగ్ని పూనీతవన్నా
నీ కళ్ళలోని భయం పట్టిస్తుందబ్బ!
–కోట్ల వెంకటేశ్వరరెడ్డి
94402 33261