ఇంటి ముందున్న ధ్వజస్తంభం లాంటి
చెట్టు దేవతలకు చేతులెక్కి మొక్కాలి
పూల పండుగ కోలాహలంలో తడిసే
ప్రకృతి ప్రేమికుల పరిమళత్వాన్ని
ఉదయ పూర్వకంగా మెచ్చుకొని తీరాలె
నేలకు వర్ణశోభిత చీర సారెల్ని
సమర్పించే వారసత్వ బంధువులను
అడిగినట్లు చెప్పాలె
ఫలాల్ని కాంక్షించే ప్రతి ఒక్కరు
పచ్చని క్షేత్రాలకై శ్రమగానం చెయ్యాలె
వాడ వాడన, ఊరు ఊరున
పర్యావరణ శోభను సమకూర్చే
కృషీవలురుగా అందరం మారాలె
అడుగడుగున చెట్లు నాటితె
భవిత వెన్నంటే ఉంటుందని భరోసా ఇవ్వాలె
వర్తమానాన్ని చేతబట్టుకొని
జీవన క్షేత్రాల్లో చెమట విత్తులు నాటుతుండాలె
హరిత స్వప్నాలను కలగనే
వృక్షప్రేమికుల అడుగులో అడుగేయాలె
ఆకుపచ్చని అవకాశాల్ని శోధించుకొని
ధరణిని అందంగ అలంకరించుకుందామని
అందరం మాట ఇవ్వాలె
హరిత నిధి కోసం అందరం తలో చేయి ఎయ్యాలె..!
వనిపాకల లచ్చిరెడ్డి
99668 97001