ట్రంప్ నిష్క్రమించినా అమెరికాతో యూరప్ దేశాలకు పొసుగుతున్నట్టు లేదు! ఇటీవల అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుంచి ఫ్రాన్స్ తమ రాయబారులను ఉపసంహరించుకోవడాన్ని బట్టి బైడెన్ వచ్చినా పరిస్థితి మారలేదని స్పష్టమవుతున్నది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడంపై ఇటీవల బ్రిటన్, ఆస్ట్రేలియాలతో అమెరికా సమాలోచనలు జరిపింది. ఇంతవరకు ఫ్రాన్స్‌కు అభ్యంతరం లేదు. కానీ జలాంతర్గాముల సరఫరాకు గతంలో తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆస్ట్రేలియా ఏకపక్షంగా రద్దు చేసుకొని, అమెరికాకు ఆ కాంట్రాక్టు ఇవ్వడం ఫ్రాన్స్‌కు మింగుడుపడటం లేదు. మిత్రదేశమైన ఫ్రాన్స్ నెత్తికొట్టి ఈ కొత్త కాంట్రాక్టును దక్కించడానికి అమెరికా సంకోచించలేదు. ఆస్ట్రేలియా కూడా ఫ్రాన్స్‌కు మాట మాత్రంగానైనా చెప్పలేదు. అంతర్జాతీయ సంబంధాలలో చోటుచేసుకుంటున్న మార్పును ఈ ఉదంతం సూచిస్తున్నది.
రెండవ ప్రపంచయుద్ధం వల్ల బలహీనపడిన యూరప్ దేశాలు బలపడిన నేపథ్యం, సోవియెట్ యూనియన్ ప్రాబల్యం వేగంగా విస్తరిస్తుండటం, ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతున్న ఉద్యమాలు అమెరికాను అప్పట్లో కలవరపెట్టాయి. టర్కీ, గ్రీస్‌లలో (వాస్తవానికి ఇతర దేశాలలో కూడా) ప్రభుత్వాలను కూలదోయకుండా తాము తోడ్పడతామని అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ప్రకటించారు. ఈ విధాన నిర్ణయానికి ట్రూమన్ డాక్ట్రిన్ అనే పేరు వచ్చింది. యూరప్ దేశాలు నిలదొక్కుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలని కూడా అమెరికా నిర్ణయించింది. ఈ విధానం (ఆ దేశ విదేశాంగ మంత్రి పేర) మార్షల్ ప్లాన్‌గా పేరొందింది. ఇప్పుడు అమెరికా పరిస్థితే బాగా లేదు. యూరప్ దేశాలను కూడా ఆర్థిక అనిశ్చితి పీడిస్తున్నది. రక్షణరంగంలో అమెరికా వైముఖ్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. అమెరికా-బ్రిటన్ మధ్య పేగు బంధం చెదిరిపోదు. కానీ ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు తమ ప్రయోజనాల కోసం భిన్న వైఖరిని ప్రదర్శించవచ్చు. అసియా-పసిఫిక్ తెరపై ప్రతిబింబిస్తున్నది ఈ కొత్త దృశ్యమే!
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఫ్రాన్స్‌కు స్థావరాలున్నాయి. అణు జలాంతర్గాములతో సహా రక్షణ సామగ్రిని సరఫరా చేయగలిగే స్థితిలో ఉన్నది. అమెరికా వైఖరి వల్ల పరాభవ భారంతో ఫ్రాన్స్ కుమిలిపోతున్న పరిస్థితిని భారత్ అనుకూలంగా మార్చుకోవచ్చు. చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట పడాలని భారత్ భావిస్తున్నప్పటికీ, పూర్తిగా అమెరికా మీద ఆధారపడటానికి సంకోచిస్తున్నది. అమెరికా నేతృత్వంలోని చతుర్భుజ కూటమి (క్వాడ్)లో కొనసాగుతూనే ఫ్రాన్స్ వంటి బలమైన (యూరప్) దేశంతో కూడా చేతులు కలపడం వల్ల సమతుల్యం సాధించవచ్చు. అమెరికాకు ఉపగ్రహంగా కాకుండా, చైనా వ్యతిరేక శక్తులకు కేంద్రబిందువుగా భారత్ మారవచ్చు. అంతర్జాతీయ పరిణామాలు అనూహ్యంగా ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం.