e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home ఎడిట్‌ పేజీ మొదటనే ఓడిన అమెరికా

మొదటనే ఓడిన అమెరికా

అఫ్గానిస్థాన్‌లో అమెరికా ఈ ఆగస్టు 15నే ఓడిందనుకుంటున్నారా? కాదు కాదు. అక్కడ బాంబింగ్‌ 2001 అక్టోబర్‌లో మొదలుకాగా, అసలు తమ లక్ష్యాలు, యుద్ధ ప్రణాళికలేమిటో అర్థం కావటం లేదని సాక్షాత్తూ రక్షణమంత్రి రమ్స్‌ఫెల్డ్‌ సహా అగ్రశ్రేణి అధికారులు 2002 ఏప్రిల్‌ నుంచే తలలు పట్టుకోవటం మొదలుపెట్టారు. ఆ విధంగా ఓటమికి అప్పుడే బీజాలు పడ్డాయి. పరిస్థితి తర్వాత కూడా మారలేదు. ఇదంతా ఇప్పుడు రహస్య పత్రాల ఆధారంగా వెలువడిన ‘ద అఫ్గానిస్థాన్‌ పేపర్స్‌’ పుస్తకంతో వెల్లడై అమెరికాలో పెద్ద సంచలనంగా మారింది.

అఫ్గాన్‌ సమాజమేమిటో చివరివరకూ అర్థం కాలేదు. అసలా ప్రయత్నమే చేయలేదు. తీవ్రవాదులను అంతం చేయగలమంటూ బయల్దేరి, అక్కడి సమాజాన్నే ప్రజాస్వామిక వ్యవస్థగా మార్చివేసి అన్నివిధాలుగా అభివృద్ధి పరిచి అఫ్గాన్‌ జాతి నిర్మాణం చేయగలమని మధ్యలో ఘనంగా చాటారు.

- Advertisement -

వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికలో పెంటగాన్‌ వ్యవహారాలు రిపోర్ట్‌ చేసే క్రెయిగ్‌ మైకేల్‌ విట్‌లాక్‌ రాసిన ఈ పుస్తకం పూర్తిపేరు ‘ద అఫ్గానిస్థాన్‌ పేపర్స్‌, ఎ సీక్రెట్‌ హిస్టరీ ఆఫ్‌ ద వార్‌’. తన రిపోర్టింగ్‌ ప్రతిభకు ఆయన గతంలో రెండు సార్లు పులిట్జర్‌ బహుమానానికి నామినేట్‌ అయ్యాడు. ఇప్పుడీ పుస్తకం కేవలం రెండు వారాల కిందట (ఆగస్టు 31) విడుదలై సెప్టెంబర్‌ 10 వచ్చేసరికి న్యూయార్క్‌ టైమ్స్‌ జాబితాలో నంబర్‌ 1 బెస్ట్‌ సెల్లర్‌గా మారింది. అమెరికాతో పాటు ప్రపంచమంతటా సంచలనాలు సృష్టిస్తున్నది. ఇందులోని సమాచారం యావత్తూ బుష్‌, ఒబామా, ట్రంప్‌ వంటి అమెరికా అధ్యక్షులు మొదలుకొని, రక్షణ మంత్రులు, అత్యున్నతస్థాయి సైనికాధికారులు, నాటో కూటమి ఉన్నతాధికారులు, అమెరికన్‌ రాయబారులు, క్షేత్రస్థాయి యుద్ధ కమాండర్లు స్వయంగా అన్న మాటలను, రహస్య ‘నోట్‌’లను ఆధారం చేసుకున్నటువంటిదే. అందులో రమ్స్‌ఫెల్డ్‌ నోట్స్‌ ఒక్కటే పదివేల పేజీలకు పైగా ఉంది. అదిగాక ఉన్నతస్థాయి వారినుంచి సాధారణ సైనికుల వరకు రచయిత స్వయంగానూ, వివిధ యూనివర్సిటీల ‘ఓరల్‌ హిస్టరీ ప్రాజెక్ట్‌’ల వారు దాదాపు వెయ్యి మందిని చేసిన ఇంటర్వ్యూల సారాంశం ఇందులోకి వచ్చింది. ఇదిగాక మరికొన్ని వేల పత్రాలున్నాయి. దీన్నిబట్టి క్రెయిగ్‌ విట్‌లాక్‌ రచన ఎంత సాధికారమైనదో గ్రహించవచ్చు. అది ఇంత సంచలనాత్మకం గా, నంబర్‌ వన్‌ బెస్ట్‌ సెల్లర్‌గా మారటానికి కారణం ఇదేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

పుస్తకంలో పేర్కొన్న ప్రతి అంశమూ ఆశ్చర్యకరమైనదే. అమెరికా, తనతో పాటు నాటో 20 ఏండ్ల పాటు సాగించిన యుద్ధం ఇంత లక్ష్యరహితంగా, ప్రణాళికా రహితంగా సాగటం నమ్మశక్యంగా తోచదు. ఇటువంటి వ్యాఖ్యలను పక్కన ఉంచి, రచయిత పేర్కొన్న అనేకానేక విశేషాలలో కొద్దిపాటి అంశాలు మాత్రం గమనించండి. 2002 ఏప్రిల్‌లో అప్పటి అధ్యక్షుడు సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ, తమకు అన్ని విషయాలలో స్పష్టత ఉందని, రష్యా చేసిన తప్పులు చేయబోమని అన్నారు. సరిగా అదే రోజున రమ్స్‌ఫెల్డ్‌ పెంటగాన్‌లో ఒక నోట్‌ రాస్తూ, యుద్ధం తర్వాత అఫ్గానిస్థాన్‌లో సుస్థిరత ఏర్పడేందుకు ఆలోచన చేయకపోతే అక్కడినుంచి తమ సైన్యం ఎప్పటికీ తిరిగి రాలేకపోవచ్చునని హెచ్చరించారు. వాస్తవానికి యుద్ధానికి ముందే అన్ని అంచనాలు తయారుకావాలి. కానీ 2001 అక్టోబర్‌లో బాంబింగ్‌ మొదలుకావటానికి ముందుగాని, యుద్ధం ఏడు నెలల పాటు సాగినంక 2002 ఏప్రిల్‌ వరకు గాని ఎటువంటి ప్రణాళికలు లేవని రక్షణ మంత్రి ఎత్తిచూపారు. రష్యా వంటి తప్పులు తాము చేయబోమని బుష్‌ హామీ ఇచ్చారు. కానీ తర్వాత 20 సుదీర్ఘ సంవత్సరాల పాటు తప్పుల మీద తప్పులు జరుగుతూనే పోయి చివరికి ఓటమికి, అవమానానికి దారితీశాయి.

కాబూల్‌లో 2002-03లో అమెరికా రాయబారిగా పనిచేసిన రాబర్ట్‌ ఫిన్‌ అన్నది గమనించండి. ‘మనం అఫ్గానిస్థాన్‌ వెళ్లినప్పుడు అందరూ ఒకటి రెండేళ్లంటూ మాట్లాడారు. కానీ ఇరవయ్యేండ్లలో రాగలిగితే మనం అదృష్టవంతులమేనని నేను వారితో అన్నాను’. ‘ఇటువంటివే మరికొన్ని మాటలు చూడండి:- ఆర్మీ జనరల్‌ డేన్‌ మెక్‌నీల్‌: ‘మాకు యుద్ధ ప్రణాళికలంటూ లేనే లేవు’ బ్రిటిష్‌ జనరల్‌ డేవిడ్‌ రిచర్డ్స్‌, నాటో బలాల అధిపతి: ‘మాకు ఎత్తుగడలు చాలానే ఉన్నాయి గాని, సవ్యమైన దీర్ఘకాలిక వ్యూహం లేదు’. లెఫ్టినెంట్‌ జనరల్‌ డగ్లస్‌ ల్యూట్‌: ‘మేము ఏం చేయనున్నామో ఎంతమాత్రం తెలియదు’. రిచర్డ్‌ బౌచర్‌, మధ్య ఆసియా, దక్షిణాసియాలకు బుష్‌ ప్రభుత్వ అగ్ర దౌత్యాధికారి: ‘మేము ఏమి చేస్తున్నామో మాకే తెలియదు’. 2001 అక్టోబర్‌లో బుష్‌: ‘గెరిల్లా యుద్ధాన్ని గెలవలేమనే ఒక ముఖ్యమైన పాఠాన్ని మేము వియత్నాంలో నేర్చుకున్నాము. కనుక భిన్నమైన తరహాలో యుద్ధం చేయనున్నాము’ అన్నారు.

బహుశా మరిన్ని కొటేషన్లు, ఇతర వివరాలు అవసరం లేదు. రచయిత చూపిన అసంఖ్యాకమైన సాక్ష్యాధారాలతో చివరికి తేలుతున్నదేమంటే, ఇరవయ్యేండ్ల పాటు ఏ ప్రభుత్వానికి కూడా తాము అఫ్గానిస్థాన్‌లో యుద్ధం చేయవలసింది అల్‌ కాయెదాతోనా, లేక తాలిబన్‌తోనా, లేక ఇద్దరితోనా అనే స్పష్టత లేదు. యుద్ధం ఏ తరహాది ఎక్కడెక్కడ సాగించాలో తెలియదు. అక్కడ తమ మిత్రులెవరో, శత్రువులెవరో బోధపడలేదు. లక్ష్యాల నిర్దేశన లేదు, ప్రణాళికారచన లేదు, వ్యూహాల రూపకల్పన గురించిన ఆలోచన లేదు. అఫ్గాన్‌ సమాజమేమిటో చివరివరకూ అర్థం కాలే దు. అసలా ప్రయత్నమే చేయలేదు. తీవ్రవాదులను అం తం చేయగలమంటూ బయల్దేరి, అక్కడి సమాజాన్నే ప్రజాస్వామిక వ్యవస్థగా మార్చివేసి అన్నివిధాలుగా అభివృద్ధి పరిచి అఫ్గాన్‌ జాతి నిర్మా ణం చేయగలమని మధ్యలో ఘనంగా చాటారు. అది అసాధ్యమని తమ నిపుణులే హెచ్చరించినా వినక, ఆ తర్వాతనేమో అది తమ లక్ష్యం కాజాలదన్నారు. లక్షల కోట్ల డాలర్లు, లక్షలాది ప్రాణాలు, ఒక పేద దేశపు విధ్వంసం తర్వా త, దేశాన్ని తిరిగి తాలిబన్లకు అప్పగించారు. అల్‌ కాయెదా, ఐసిస్‌లు పలు దేశాలకు విస్తరించాయి. ఇదీ 20 ఏండ్ల రక్తసిక్త యుద్ధ ఫలితం.

టంకశాల అశోక్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana