e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home Top Slides Telangana History | గుర్రం గుండు మీద పులి బొమ్మ

Telangana History | గుర్రం గుండు మీద పులి బొమ్మ

  • గుండ్ల పోచంపల్లిలో సింధు లోయ నాగరికత

స్పెయిన్‌లోని అల్టామీర గుహలు, అర్జెంటీనాలోని పేరిటో మోరెనో గుహలు, మహబూబ్‌నగర్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీర్ల గుట్ట.. ఈ మూడు ప్రదేశాల్లోనూ రాతి గోడల మీద చేతి ముద్రలు న్నాయి. ఈ సారూప్యత మానవ సమాజాలు వేర్వేరు ఖండాల్లో, వేర్వేరు సమయాల్లో ఆలోచించే పధ్ధతిలో ఉన్న ఏకరూపతను సూచిస్తుంది. మన మహబూబ్‌నగర్‌ దగ్గర ధర్మాపూర్‌ గ్రామ పీర్లగుట్టలో ఉన్న సుమారు 40 చేతి గుర్తులు కొత్త రాతి యుగానికి చెందినవే. ఇలా చేతి గుర్తుల్ని బొమ్మలుగా ఎందుకు వేసినట్టు?

ఇప్పటికీ గృహ ప్రవేశాలప్పుడు, సత్యనారాయణ కథ, వ్రతాలు చేసే సమయంలో కుంకుమలో అద్దిన చేతి ముద్రలు గోడ మీద వేసే ఆచారం ఉంది. అంటే మన మతపరమైన గుర్తుల మూలాలు మానవజాతి మొదటి ఆడుగుల్లో వెతుక్కోవాలి. ఇలాంటి చేతి గుర్తుల్ని ఎగువ పాతరాతి యుగంలో గుహల్లో వేయడం మొదలైంది. ఈ చేతి ముద్రలు వేయడం వెనుక రెండు మూడు కారణాలు ఉండొచ్చు. చేతి గుర్తులు వేయడం ద్వారా వారి ఉనికిని చెప్పుకొన్నారని లేక మాయ/మార్మికత వంటి భావాల మౌలిక చిహ్నంగా కానీ అనుకోవచ్చు.

- Advertisement -

హైదరాబాద్‌లోని కోకాపేటలో మధ్య రాతి యుగపు జింకల బొమ్మలున్నాయంటే ఆశ్చర్యంగా ఉండదా? పక్కనే ఉన్న మేడ్చల్‌లో కూడా సుమారు 35 వేల ఏండ్ల కిందట మానవ సంచారం ఉన్నది. అప్పటినుంచి 3 వేల ఏండ్ల క్రితం వరకు వాళ్ళు గీసిన రంగుల బొమ్మలు బండలపై ఇప్పటికీ ఉన్నయి.

మంజీరా చిత్రాలు
మంజీరా పరీవాహక ప్రాంతంలోని గుట్టలు మధ్యరాతి యుగం నుంచి కొత్త రాతి యుగం వరకు గీసిన చిత్రాలకు నెలవు. ఇప్పటివరకు మెదక్‌, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి 35కు పైగా స్థలాల్లో రాతి చిత్రాల్ని గుర్తించారు. మంజీరా పరీవాహక ప్రాంతంలోని మెజారిటీ రాతి చిత్రాల్ని పురాతత్వ పరిశోధకుడు, ‘రాతి చిత్రాల వేటగాడు’ బొగ్గుల శంకర్‌రెడ్డి గుర్తించారు. ఒక దశాబ్ద కాలంగా మంజీరా తీరంలోని కొండలు, గుట్టల్ని సర్వే చేస్తూ వీటిని వెలుగులోకి తెచ్చారాయన. హస్తలాపూర్‌, కాజిపల్లి, బస్వాపూర్‌, జింకలగుండు, గుర్రంగుండు, జక్కన్నపేట, సంతాయిపేట.. ఇలాంటి సుమారు 30కి పైగా రాతి చిత్రాల స్థలాలు ఈయన కృషి వల్లే వెలుగు చూసినయి.

అందమైన ఆర్ట్‌ గ్యాలరీ హస్తలాపూర్‌
ఎక్కువ సంఖ్యలో మనుషుల బొమ్మల్ని చిత్రించిన స్థలం ఇది. 2010లో శంకర్‌రెడ్డి వెలుగులోకి తెచ్చిన ఈ ప్రదేశాన్ని రాష్ట్ర పురావస్తుశాఖ రికార్డు చేసింది. ఇప్పటికీ ఎరుపు రంగు తాజాగా కనిపించే స్థలాల్లో ఇది ఒకటి. ఇక్కడి మనుషుల బొమ్మల్ని చూస్తే ‘వర్లీ పెయింటింగ్స్‌’లోని మానవ ఆకృతుల లాగానే కనిపిస్తాయి. మధ్యరాతి యుగం నుంచి అంటే సుమారు 8 వేల ఏండ్ల కిందటి నుంచి కొత్తరాతి యుగం వరకు ఈ స్థావరంలో చిత్రించినట్టు తెలుస్తున్నది. ఇక్కడ దొరికిన సూక్ష్మరాతి యుగపు పనిముట్లు, నియోలిథిక్‌ గ్రూవ్స్‌ ఆధారంతో ఈ కాలనిర్ణయం చేయొచ్చు. మనుషులే కాకుండా నెమలితదితర జంతువులు, రేఖాగణిత డిజైన్లు- అన్నిటితో ఈ చిత్రాలున్న బండ ఇప్పటికీ తాజాగా ఒక కాన్వాస్‌ మీద రంగుల బొమ్మలు పరిచినట్టుగా ఉంటుంది.

ఎనిమిది ఫీట్ల పెద్ద పులి బొమ్మ
మంజీరా ఏడుపాయల ప్రాంతంలోని నాగసాన్‌ పల్లి గ్రామానికి దగ్గరలోని పెద్ద కొండమీదున్న గుర్రంగుండుకు ఆ పేరు.. దాని మీదున్న ఒక పెద్ద బొమ్మ వల్ల వచ్చింది. ఇప్పటి వరకు అది గుర్రం చిత్రంగా భావించారు కాబట్టే గుర్రం గుండు అన్నారు. అయితే ఈ మధ్యే మా బృందం చేసిన పరిశోధనలో అది గుర్రం బొమ్మ కాదని, పెద్ద పులి బొమ్మని తేలింది. సుమారు 8 ఫీ ట్లున్న పెద్ద పులి బొమ్మ ఇప్పటి వరకు తెలంగాణలో దొరికిన అన్నింటిలో పెద్దది కావచ్చు.

చరిత్ర పరిశోధకులు తెలంగాణలో ఇప్పటి వరకు సుమారు 58 ప్రదేశాల్లో ‘రాక్‌ ఆర్ట్‌’ను గుర్తించారు. అందులో 45 దక్షిణ తెలంగాణలో ఉన్నాయి. దేశంలోనే పెద్దదైన భీంబేట్కా గుహల్ని 1957లో కనుగొనక ముందే, 1941లోనే కృష్ణ మూర్తి జియోలాజికల్‌ సర్వేలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో సంగనోనిపల్లి, దూపాడు గట్టు గ్రామాల్లో రాతి చిత్రాల్ని గుర్తించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ‘రాక్‌ఆర్ట్‌’పై తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్‌ చేసిన శ్రీనివాసాచారి దొంగలగట్టు, అక్కమహాదేవి గుహలు, మన్నెంకొండ, పోతనపల్లి, కోయిలకొండ, ధర్మపూర్‌.. ఇలా మొత్తం 16 ప్రదేశాల్ని రికార్డు చేసినరు.

ఎడితానూర్‌లో రాతి చిత్రాలు, చెక్కడాలు
సంగారెడ్డి సమీపంలోని ఎడితానూర్‌లో ఉన్న గుట్టల్లో 5 వేల ఏండ్ల కిందటి అంటే కొత్తరాతి యుగం, బృహత్‌ శిలాయుగం, చారిత్రక యుగం నాటి చిత్రాలు, చెక్కడాలు ఉన్నాయి. చౌడమ్మ గుట్ట, సిద్ధుల గుట్ట, గంగిఆవుల బండ, గడ్డగుండు అనే పేర్లతో ఉన్న గుట్టల్లో ఆయుధాలతో ఉన్న మనుషులు, జంతువుల బొమ్మలు, రేఖాగణిత డిజైన్లున్నాయి. ఒక గుహ కప్పు మీద ఒక వ్యక్తి ఈటెను విసురుతున్నట్టు, ఒక దుప్పుల జంట బొమ్మ.. వంటివి ఎన్నో ఉన్నాయి.

మేడ్చల్‌లో పులుల్ని ఒడిసి పట్టిన వీరుడు
సింధులోయ నాగరికతకూ మేడ్చల్‌జిల్లా గుండ్లపోచంపల్లికీ సంబంధం ఉందా? ఉందనే అంటున్నారు ఆర్కియలాజికల్‌ సర్వే అఫ్‌ ఇండియా, నాగార్జునకొండ మ్యూజియం క్యూరేటర్‌, దక్కన్‌ కాలేజి పరిశోధక విద్యార్ధి ఈసారపు సాయికృష్ణ. గుండ్ల పోచంపల్లి లోని ఒక రాతిపై ఒక మనిషి (స్త్రీ లేదా పురుషుడు) రెండు చేతులతో రెండు జంతువుల్ని ఒడిసి పట్టినట్టున్న అమూర్త చిత్రం ఉంది. సరిగ్గా ఇటువంటి చిత్రమే సింధులో య నాగరికతలోని ఒక సీల్‌ పై ఉంది. అందులో ఒక మనిషి రెండు చేతులతో రెండు పులుల్ని ఒడిసి పట్టినట్టుగా ఉంటుంది. గుండ్లపోచంపల్లిలోనే ఇంకో చిత్రంలో ఒక మూపురమున్న ఎద్దును పొడుగైన ఆయుధంతో ఒక వ్యక్తి పొడుస్తున్నట్లు ఉంది. సరిగ్గా ఇలాంటి చిత్రమే సింధులోయలో దున్న పోతును పొడుస్తున్నట్టు టెర్రకోట ‘సీల్‌’పై దొరికింది. ఈ రెండు బొమ్మలు కూడా కొత్తరాతి యుగానికి చెందినవే. ఇలాంటి విశిష్టతలపై ఇంకొంచెం లోతుగా అధ్యయనం జరిగితే ఇక్కడి రాతి చిత్రాల రహస్యమే కాదు, సింధులోయలోని సింబల్స్‌కూ, ఇక్కడి చిత్రాలకూ ఉన్న సంబంధం కూడా బయట పడుతుంది. గుండ్ల పోచంపల్లిలో ఉన్న కొన్ని మానవాకృతులు ఎగువ మధ్యరాతి యుగానివి కూడా కావచ్చు.

దాదాపు 35 వేల ఏండ్ల నాటి నుంచి మానవ సంచారపు ఆనవాళ్ళున్న ఈ గుట్టల ప్రాంతం నగర విస్తరణలో మాయమవుతున్నది. ఆర్కియలాజికల్‌ సర్వే అఫ్‌ ఇండియా లేక రాష్ట్ర హెరిటేజ్‌ శాఖ దీనిని సంరక్షించకపొతే కోకాపేట గుట్టల్లోని జింకల బొమ్మల లాగా విస్మరణ కావచ్చు లేదా మాయం కావచ్చు.

శిల్పాల తొలి రూపాలు పెట్రొగ్లిఫ్స్‌
చిత్రాలే కాకుండా రాళ్ళ మీద చెక్కే కుతూహలం, కౌశల్యం కొత్త రాతి యుగం నుంచే మనం చూస్తున్నాం. కరీంనగర్‌ జిల్లా రేకొండ, నీలాద్రి గుళ్ల లాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే రాతిచిత్రాల మీద జరిగిన కృషి వీటి మీద జరగలేదనే చెప్పొచ్చు. నల్గొండ జిల్లా కృష్ణా తీరంలో కృష్ణాపురం గ్రామ పరిధిలో డాక్టర్‌ డి. సూర్యకుమార్‌, డాక్టర్‌ ఎస్‌.జైకిషన్‌ బృందం వెలుగులోకి తెచ్చిన రాతి చెక్కడాలు కొత్త రాతి యుగం, చారిత్రక యుగానికి చెందినవి. ఎడితానూర్‌లో సైతం ఆయుధధారులైన మనుషులు ఏనుగు లాంటి జంతువును వశపరుచుకునే దృశ్యం ఉందని వి.వి.కృష్ణశాస్త్రి రికార్డు చేశారు.

తెలంగాణలో ఈ చరిత్ర పూర్వయుగం నాటి చిత్రాలున్న గుండ్లను చిత్తారి గుండ్లనీ, పాండవుల గుట్టలనీ, బొమ్మల గుట్టలనీ, దేవతల కుచ్చలనీ.. చిత్రమైన పేర్లతో పిలుస్తారు. ఈ గుట్టలు, వాటి పరిసరాల్లోని బృహత్‌ శిలాయుగపు సమాధులు, గుహల గోడలు, కప్పులపై సుమారు 30వేల ఏండ్ల నుంచి మూడు వేల ఏండ్ల కిందటి వరకు నాటి మానవ జీవితం రికార్డు చేసి ఉంది. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు, చరిత్ర ప్రేమికులు ఈ ఆధారాల్ని రికార్డు చేసి సంరక్షించుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది, ఈ ఆధారాల్ని కాంక్రీటు ముక్కలుగా మారకుండా, లేక ఆనాటి అందమైన చిత్రాలపై మన పేర్లు అసహ్యంగా రాయకుండా చూసుకోవటమే. ఈ మాత్రం గౌరవం చాలు ఈ ఆధారాలు సజీవంగా ఉండి తమ కథను తరతరాలు వినిపించడానికి.

సవరణ: సెప్టెంబర్‌ ఆరవ తేదీన నాలుగవ పేజీలో ప్రచురితమైన ‘పాండవుల గుట్టలో రంగుల కళ’ వ్యాసం చివరి పేరా సబ్‌ హెడ్డింగ్‌లో ‘రేగొండ- రేగొండ- బూడిగపల్లి’ అని పొరపాటుగా ఉంది. దీనిని ‘రేగొండ- రేకొండ- బూడిగపల్లి’ అని గమనించగలరు. ఆ తరువాత నాలుగవ లైన్‌ చివరి పదం రేగొండను ‘రేకొండ’గా చదువుకోగలరు.

డా. ఎం.ఏ. శ్రీనివాసన్‌
81069 35000

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana