e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఎడిట్‌ పేజీ చర్చలే పరిష్కారం

చర్చలే పరిష్కారం

చర్చలే పరిష్కారం


పశ్చిమాసియాలో పాలస్తీనా- ఇజ్రాయెల్‌ వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. పాలస్తీనా హమాస్‌ మిలిటెంట్లు తాజాగా 200 రాకెట్లతో దాడి చేయగా, ఇజ్రాయెల్‌ సేనలు మిలిటెంట్లు లక్ష్యంగా విమానదాడులు చేస్తున్నది. ఫలితంగా నలభై మంది సాధారణ పాలస్తీనా పౌరులు, 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 1966 తర్వాత ఇరుదేశాల మధ్య ఇంత పెద్ద ఎత్తున దాడులు, ప్రతిదాడులు జరగటం ఇదే మొదటిసారి. ఇరువర్గాల ఘర్షణలతో అక్కడ అత్యవసర పరిస్థితి ప్రకటించాల్సి వచ్చింది. లాడ్‌ నగర మేయర్‌ తాజా ఘర్షణలను అంతర్యుద్ధంగా అభివర్ణించిన తీరు, అక్కడి పరిస్థితి తీవ్రతను తెలుపుతున్నది. టెల్‌ అవీవ్‌ సమీప నగరం లాడ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన అరబ్‌ జాతీయుడు ప్రయాణిస్తున్న కారుపై రాకెట్‌ దాడి జరిగి ఓ తండ్రీ, కూతురు మరణించారు. దీంతో ఆ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. అరబ్బులు, యూదుల పరస్పర దాడులతో ఆప్రాంతం దద్దరిల్లింది.

కారుపై రాకెట్‌ దాడి పాలస్తీనా- ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలకు తక్షణ కారణంగా కనిపిస్తున్నా, ఈ మధ్య కాలంలో కొన్ని ఘటనలు ప్రధాన హేతువులుగా చెప్పవచ్చు. షేక్‌జారా ప్రాంతంలోని వ్యాపార సముదాయమైన 12 అంతస్తుల అల్‌ జవారా టవర్‌ నుంచి అరబ్బులను తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ అల్టిమేటం ఇచ్చింది. ఆ వ్యాపార సముదాయం ఉన్న ప్రాంతం తనదని ఓ యూదు జాతీయుడు ఇజ్రాయెల్‌ కోర్టు నుంచి తీర్పును పొందటంతో అరబ్బుల్లో అసంతృప్తి కట్టలు తెంచుకున్నది. తూర్పు జెరూసలెంలోని అల్‌-అక్సా మసీదు ప్రాంతంపై ఇజ్రాయెల్‌ సేనలు చేసిన దాడులు ఆగ్రహం కలిగించాయి. పాలస్తీనా భూ భాగాలను ఇజ్రాయెల్‌ ఆక్రమిస్తూ తమ మనుగడకే ముప్పుకలిగిస్తున్నారనే భావన అరబ్బుల్లో గూడుకట్టుకొని ఉన్నది. ఈ అసంతృప్తులు, ఆక్రమణల నేపథ్యమే తాజా యుద్ధ వాతావరణం.
మొదటి ప్రపంచ యద్ధానంతరం 1917- బెల్‌ఫోర్‌ డిక్లరేషన్‌ కారణంగా పాత ఒట్టోమాన్‌ సామ్రాజ్య ప్రాంతమైన నేటి పాలస్తీనా భూభాగానికి ప్రపంచ నలుమూలల నుంచీ యూదుల వలస మొదలైంది.

1933-45 మధ్య రెండో ప్రపంచ యుద్ధకాలంలో కూడా మరోసారి యూదుల వలసలు పరాకాష్ఠకు చేరాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ స్థాపనను యూదునాయకుడు డేవిడ్‌ బెన్‌ గురియన్‌ ప్రకటించినప్పటి నుంచి ఆ ప్రాంతం అల్లకల్లోలమైంది. ఒకవైపు ఉద్రిక్తతలు నెలకొని ఉన్నా మధ్యే మార్గం ద్వారా పరిష్కారం సాధించడానికి ప్రయత్నాలు సాగాయి. గత మూడు దశాబ్దాలుగా పరిస్థితి మరింత జటిలమైంది. ట్రంప్‌ హయాంలో అమెరికా అనుసరించిన విధానాలు ఇజ్రాయెల్‌, పాలస్తీనా ప్రాంతంలోనే కాకుండా మొత్తం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ వచ్చిన నేపథ్యంలో చర్చల ద్వారా శాంతి స్థాపనకు కృషి జరగాలి. హింసాద్వేషాల మూలంగా సమస్య ఏనాడూ పరిష్కారం కాదని అన్ని పక్షాలు గ్రహించాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చర్చలే పరిష్కారం

ట్రెండింగ్‌

Advertisement