తీరం గురుతొచ్చి ఉరికొచ్చే అలల్లా
నువు గురుతొచ్చిన ప్రతీసారి
కన్నీళ్ళు చెంపల తీరాన్ని ముద్దాడి పోతున్నాయి
సంకురాతిరికి ముసిరే పొగమంచులా
నీతో గడిపిన జ్ఞాపకాలన్నీ
తెరలు తెరలుగా కళ్ళ మీన కమ్ముకొని
ఆవల ఏదీ కానరాకుంటున్నది
తొలకరి జల్లులకు తడిసిన మట్టి వాసనలా
నీ జ్ఞాపకాల జల్లులో తడిసి మది గుబాళిస్తుంది
గదిలో పరుసుకున్న అగరుబత్తి వాసనలా
మనసునిండా నీ ఆలోచనలే తిరుగుతున్నయి
ఓ మూలన కాలుతూ
గుడిసెనంత ఏలుతున్న దీపం ఎలుగులా
నీ రూపం ఇంకా నా గుండె గుడిసెని ఏలుతూ
నిత్య దీపమై ఎలుగుతానే ఉన్నది
చిన్నపుడు నోటుబుక్కులో
పైలంగా దాసుకున్న నెమలీక లెక్క
నా కడవరకు నిన్ను జ్ఞాపకంగా
నా యెద బుక్కులో భద్రంగా దాసుకుంటా…
-వి.దిలీప్ ,8464030808