వరి మడి నీ ‘చిరునామా’
బియ్యపు గింజ నీ ‘ఉనికి’
గింజ గింజపై
నీ చెమట చుక్కల ఆనవాళ్లు…
పుట్టుక, బతుకు, చావు సమస్తం
నీవు దుక్కిదున్నే భూమే…
శ్రమ నీది, కల నీది, ఎత నీది
ఆరుగాలం కరిగిన కండ నీది
చిదిమిన రక్తం నీది
కురిసిన చెమట నీది…
ఎదగడానికి ఎరువు
చీడపీడకు మందు
ఉదయం నుంచి అస్తమయం దాకా
ఒకటే ఉరుకులు పరుగులు…
పెట్టుబడులు.. పుట్టెడు అప్పులు
తూర్పారబట్టంగ మిగిలిందేదో
వాకిట్ల వాలింది…
కొంటమన్నరు కొనమన్నరు
నూకలన్నరు నూకేస్తున్నరు
సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు…
మండుతున్న గుండెల్ని
ఒక్కో గింజా ప్రశ్నిస్తున్నది
ఉబుకుతున్న కన్నీళ్లని
దిగూట్ల దీపం నిలదీస్తున్నది…
కన్నీళ్లు ఉప్పుగానే ఉంటయి
ఉప్పెనయి ఎగిసి దుముకుతాయి
తప్పదిక
సింహాసనాలు మునగాల్సిందే!
-వారాల ఆనంద్ , 94405 01281