బతుక్కి డిసెంబర్ వచ్చింది
బాకీలు తీర్చుకోవాలి
బడివి కొన్ని.. బంధాలవి కొన్ని..
పాము కుబుసం విడిచినట్లు
వాదాలు వదిలివేయాలి
పుట్టుకతో కొన్ని.. పూసుకున్నవి కొన్ని..
చెట్టు ఆకులు రాల్చినట్లు
కోరికలు తుంచివేయాలి
దేహానివి కొన్ని.. మనసువి కొన్ని..
మేఘం తేలిక అయినట్లు
తేమను వదిలించుకోవాలి
కష్టాలవి కొన్ని.. కుట్రలవి కొన్ని..
పిట్ట.. గూడును వదిలినట్లు
పిల్లలకు పంచిపెట్టేయాలి
బాధ్యతలు కొన్ని.. మూలాలు కొన్ని..
బతుక్కి డిసెంబర్ వచ్చింది
నేలను ఇక వెతుక్కోవాలి
మళ్లీ మొలకెత్తడానికి..
మళ్లీ వికసించడానికి..!
బతుక్కి డిసెంబర్ వచ్చింది
రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయాలి
గుర్తులు కొన్ని.. ఆశయాలు కొన్ని.. !!
-దాసరి మోహన్ ,99853 09080