ఉదయాన్నే పుస్తకాల సంచిని భుజానేసుకొని
చెరువు కట్టమీద నడుస్తూ పక్క ఊరి బడికెళ్తుంటే
నా పాదాలను తాకుతూ మత్తడి నీళ్ళు గారాలు పోయేవి
తడిసిన కాళ్ళతో కట్ట మీద నడుస్తుంటే
నన్ను చూసి చల్లగా నవ్వేది చెరువు..!
చెరువునూ ఊరిని కాపాడే కట్ట పోచమ్మ గుడి ముందు
భవిష్యత్తు ఆశలు ముడుపులై వేలాడేవి
పగలంతా చెరువు కింది పొలాలను దున్నిన ఎడ్ల జతలు
చెరువు నీటిలో సేద తీరేవి!
రాత్రి వేసిన బతుకమ్మలు
చెరువు సింగారించిన చీర అంచుగా మారేవి!
పచ్చని ఆకుల్లోంచి బొడిపెలు తేలిన
పున్నమి చందమామల్లా సీతాఫలాలు..
నిండుకుండలా కట్టకింది రాట్నంబాయి
ఈత నేర్పే స్విమ్మింగ్ ఫూల్..
చెరువులో బుడుంగున మునిగే
బుడుబుంగుల ఆటలు..
మగ్గపండిన ఈత పళ్ళవాసన..
భాగ్యవంతమైన బాల్యం..!
బడి ఇడిసి కాళ్లీడ్చుకుంటూ
ఇంటి బాట పట్టినపుడు
పడమటి సూర్యుని బంగారు కాంతులతో
చెరువు కొత్త సింగారమై పలకరించేది
పల్లె ఎదపై విచ్చుకున్న జల పుష్పం చెరువు
జన జీవితానికి ఆదెరువు చెరువు
ఊరి ముఖం మీద చిరునవ్వు చెరువు
బాల్యపు వసంతంలోకి మునకేసి
బతుకును ఉత్సవం చేసింది చెరువు
ఇప్పుడు ఊరంటే.. చెరువు
చెరువంటే.. సంస్కృతి
చెరువే మనిషి.. చెరువే జీవనం
అవును.. ఇప్పుడొక చెరువు కావాలి..!!
-చెమన్ , 94403 85563