e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home ఎడిట్‌ పేజీ సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు

సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు

సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు

డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ పీడిత వర్గాల అభ్యున్నతికి పరిశ్రమించిన సంస్కర్త. భారత జాతీయ సాంస్కృతిక వారథి. ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను అందించిన ఆధునిక రాజనీతి విశ్లేషకుడు. అంబేద్కర్‌ కుల వివక్షను ఎదుర్కొన్నారు. అందుకే ఆయన సంఘ సంస్కరణ కోసం, దళితుల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. గొప్ప రాజనీతిజ్ఞుడిగా రాజ్యాంగరచనా బాధ్యతనూ నిర్వహించారు.
1927లో మహాద్‌లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్‌ల నుంచి వేలమంది వచ్చారు. మహాద్‌ చెరువులోని నీటిని తాగేందుకు అంటరానివారికి ప్రవేశం లేకుండేది. అంబేద్కర్‌ నాయకత్వంలో వేల మంది ఆ చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం. 1927లో అంబేద్కర్‌ ‘బహిష్కృత భారతి’ అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించారు. ఆ పత్రికలో ఒక వ్యాసంలో- ‘తిలక్‌ గనుక అంటరానివాడిగా పుట్టి ఉంటే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’అని ఉండడు. అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మహక్కు అని ప్రకటించి ఉండేవాడు’ అని అంబేద్కర్‌ రాశారు. దీన్నిబట్టి నాడు అంబేద్కర్‌ కులతత్వవాదుల చేత ఎన్ని బాధలు అనుభవించారో తెలుస్తుంది. 1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంత్యుత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడు, బ్రాహ్మణుడైన బాలాయ శాస్త్రి అంబేద్కర్‌ను సాదరంగా ఆహ్వానించాడు. పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమేనని అంబేద్కర్‌ ఈ సందర్భంగా తమ ప్రసంగంలో అన్నారు.
భారత జాతీయ కాంగ్రెస్‌ను నడిపే జాతీయోద్యమంలో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ సాగిస్తున్న కృషికి కాంగ్రెస్‌ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించలేదు. వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని, ఎవరి కులవృత్తిని వాళ్లు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థికవ్యవస్థ భారతసమాజంలో ఉన్నదని గాంధీ సమర్థించారు. అయితే అంటరానివాళ్లుగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేస్తూ సమాజ బాగు కోసం తమ వృత్తులు చేస్తున్నారని, అలాంటివారిని ఇతర వర్ణాల వారు గౌరవించాలన్నారు. కుల, అంటరానితన సమస్యకు గాంధీ సామాజిక, సాంస్కృతిక పరిష్కారాన్ని చూపిస్తే అంబేద్కర్‌ ఈ విషయంలో గాంధీతో విభేదించారు. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజకీయాధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారం దొరకదని అంబేద్కర్‌ భావించారు.

కులం పునాదుల మీద ఒక జాతిని నీతివంతమైన వ్యవస్థగా తయారుచేయలేమన్న అంబేద్కర్‌ వ్యాఖ్య నేటి సమాజానికి ఆదర్శం, అనుసరణీయం. సాంఘిక నిరంకుశత్వం, రాజకీయ నిరంకుశత్వం కన్నాక్రూరమైనది కాబట్టి దాన్ని ఎదిరించే సంస్కర్త ప్రభుత్వాన్ని ఎదిరించే రాజకీయవాది కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ధైర్యవంతుడు, శక్తివంతుడై ఉండాలన్న అంబేద్కర్‌ మాటలు ఆలోచింపదగినవి.

1919 మాంటేగ్‌ చేమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి, నూతన రాజ్యంగ సంస్కరణలను సూచించేందుకు ఏర్పాటుచేసిన సైమన్‌ కమిషన్‌ 1928లో పర్యటించింది. ఈ కమిటీ నివేదికను చర్చించడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం మూడు రౌండ్‌టేబుల్‌ సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాలు 1930, 1931,1932లలో జరిగాయి. ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్‌ హాజరయ్యారు. రెండవ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్‌ తరపున గాంధీ హాజరయ్యారు. ఈ సమావేశంలోనే గాంధీ, అంబేద్కర్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్‌ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని గాంధీ వాదించారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెండవ రౌండ్‌టేబుల్‌ సమావేశం నుంచి గాంధీ బయటకువచ్చారు. 1932లో రామ్సే మెక్‌డొనాల్‌ కమ్యూనల్‌ అవార్డ్‌ ప్రకటించింది. ఇందులో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రతిపాదించారు. అప్పటికే శాసనోల్లంఘన ఉద్యమంలో అరెస్టయి ఎరవాడ జైల్లో ఉన్న గాంధీ ఈ ప్రతిపాదనకు నిరసనగా నిరాహారదీక్ష చేపట్టారు. దీంతో అంబేద్కర్‌పై నైతిక ఒత్తిడి పెరిగింది. చివరికి గాంధీ, అంబేద్కర్‌ మధ్య పూనా ఒప్పందం కుదిరింది. కమ్యూనల్‌ అవార్డ్‌ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజకవర్గాల్లో ఇచ్చేందుకు ఇరువురు అవగాహనకు వచ్చారు. దీనితర్వాత గాంధీ ‘హరిజన్‌ సేవక్‌ సమాజ్‌’ ఏర్పర్చి అస్పృశ్యత నివారణకు కృషిచేసారు. అంబేద్కర్‌ను కూడా భాగస్వామిని చేశారు. కానీ అంటరానితన నిర్మూలనలో గాంధీకి ఉన్న చిత్తశుద్ధి మిగతా కాంగ్రెస్‌ నాయకులకు లేదు. దీంతో అంబేద్కర్‌ గాంధీ ఉద్యమం నుంచి బయటకువచ్చి దళిత సమస్యల పరిష్కారానికి తనదైన పంథాలో ముందుకుసాగారు.
అంబేద్కర్‌ విశేష శ్రమకోర్చి రాజ్యాంగానికి రూపకల్పన చేయడం సామాజికవర్గాల అభ్యున్నతికి బలమైన పునాదులు వేసిన ప్రముఖమైన ఘట్టం. టి.టి.కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకసారి రాజ్యాంగ పరిషత్‌లో మాట్లాడుతూ అన్నీ తానై నడిపించి రాజ్యాంగ నిర్మాతగా శాశ్వత ఖ్యాతిని గడించిన ఘనత వారికి దక్కుతుందని పేర్కొన్నారు. కుల, మత, జాతి, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా, ప్రతిభ కలిగిన ఎవరైనా భారత పాలనావ్యవస్థలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించేవిధంగా రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థను భారత ప్రజలకు అందిస్తూ అంబేద్కర్‌ వేసిన మార్గం స్వర్ణాక్షరాలతో లిఖించదగినదనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
గొప్ప సాంస్కృతిక జాతీయత గల మహా పురుషుడు అంబేద్కర్‌. జాతీయ అనుసంధాన భాషగా సంస్కృతాన్ని బలపరిచారు. బౌద్ధ సూత్రాలు ఆపన్నులకు సామాజిక భద్రతను కల్పిస్తూ ధర్మమార్గాన నడిపిస్తాయని భావించి 1956 అక్టోబరు 14న నాగపూర్‌లో బౌద్ధమతాన్ని స్వీకరించారు. హిందువుగా పుట్టిన అంబేద్కర్‌ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరిపోసింది.
(వ్యాసకర్త: ఉపాధ్యాయురాలు)

సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు
Advertisement
సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement