e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home ఎడిట్‌ పేజీ పైలట్‌ ప్రాజెక్ట్‌ దేశానికే హైలెట్‌

పైలట్‌ ప్రాజెక్ట్‌ దేశానికే హైలెట్‌

జనగాం, మహబూబాబాద్‌, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు సరిహద్దు ప్రాంతం తిరుమలగిరి. ‘దళితబంధు’ పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపిక చేసిన తిరుమలగిరి మండలం చారిత్రక, భౌగోళిక, సామాజిక కోణంలో అన్నివిధాలా ఈ ఎంపికకు అర్హమైనది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి రాష్ట్రం ఏర్పడేవరకు సాగిన ఉద్యమాల్లో తిరుమలగిరి ప్రాంతానికి ప్రత్యేకత ఉన్నది. ఆయా ఉద్యమాల్లో అనేక దళిత కుటుంబాలు పాల్గొన్నాయి.

రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తిరుమలగిరి ప్రాంతంలో కేసీఆర్‌ పర్యటిస్తూ, ఇక్కడి ప్రజల స్థితిగతులు చూసి చలించిపోయారు. వీరి బతుకులు మారాలంటే ఎండిన కాల్వల్లో నీళ్లు పారాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీడు భూములకు కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాదుల ద్వారా గోదావరి జలాలను మళ్లించి తిరుమలగిరి ప్రాంతాన్ని సస్యశామలంగా మార్చారు. ఆ తర్వాత రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయం చేసి రైతులకు బాసటగా నిలిచారు. రైతుబంధుతో అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగింది. యాదవులు, ముదిరాజులు, గంగపుత్రులు, కల్లుగీత కార్మికులను ఆదుకునేందుకు అనేక పథకాలను తీసుకువచ్చారు. గొర్రె పిల్లల పంపిణీ ద్వారా యాదవులు, చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా పరిపుష్ఠులు అవుతున్నారు.

- Advertisement -

రైతుబంధుతో అన్నివర్గాలకు న్యాయం జరిగినా, భూమిలేని దళితుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. తిరుమలగిరి మండలంలో పలువురు కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్ల అమ్మకందారులుగా ఉన్నారు. వేరే ప్రాంతాలకు వలసవెళ్లి జీవనాన్ని కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు. దళితుల దీనస్థితిని ఉద్యమ సమయంలో స్వయంగా చూసిన కేసీఆర్‌, వీరి జీవితాలను మార్చాలనే దృఢసంకల్పంతో దళిత బంధు కోసం తిరుమలగిరి మండలాన్ని కూడా ఎంపిక చేశారు. తెలంగాణలో నాలుగు మండలాలను దళితబంధు పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా అందులో తిరుమలగిరి మండలం కూడా ఉంది. రూ.250 కోట్లను కేటాయించడం వల్ల తిరుమలగిరి మండలంలోని మొత్తం 2500 దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది.

తిరుమలగిరి మున్సిపాలిటీలో 800 దళిత కుటుంబాలు నివసిస్తుండగా, మండలంలోని పది గ్రామాల్లోనూ పెద్ద సంఖ్యలోనే దళితులున్నారు. బండ్లపల్లిలో 30, గుండెపురి గ్రామంలో 150, జలాల్పురంలో 200, మామిడాలలో 80 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయి. తాటిపాములలో 400 దళిత కుటుంబాలు ఉండగా తొండ గ్రామంలో 230, వెలిశాలలో 110, అనంతారంలో 150 కుటుంబాలున్నాయి. నందాపురంలో 49 దళిత కుటుంబాలతోపాటు, మాలిపురంలో 232 ఉన్నట్లు తాజా గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఈ కుటుంబాలు అన్నిటికీ ‘దళితబంధు’ పథకం అమలుకానున్నది.

‘దళితబంధు’ పథకం అణగారిన జీవితాల్లో ఆర్తిని తొలగించి చైతన్యమార్గాన నడిపించనున్నది. అటువంటి పథకంపై విపక్షాలు జుగుప్సాకరమైన విమర్శలు చేయడమంటే దళితులను అవమానించడమే కాదు, దళిత సంక్షేమంపై వారికి చిత్తశుద్ధి లేదని ఒప్పుకొన్నట్టే. ఏదైనా పథకాన్ని అమలుచేయాలంటే మొదట కొన్ని ప్రాంతాలను లేదా కొన్ని మండలాలను పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేయడం మామూలే. ఆ పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపికైన మండలాల్లో పథకం అమలు సందర్భంగా జరిగిన లోటుపాట్లను పరిగణనలోకి తీసుకొని, రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయడం ఆనవాయితీ. ఈ విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొనసాగిస్తుండగా కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతా అమలుచేస్తామని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నా, రాష్ట్రమంతా అమలుచేయాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. నిజంగా విపక్షాలకు దళితులపై ప్రేమ ఉంటే ‘దళితబంధు’ పథకం అమలు కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. డాక్టర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంపై విశ్వాసం ఉంటే దళితబంధు పథకంపై విమర్శలు, అబద్ధపు ప్రచారాలు చెప్పడం మానుకోవాలి.

అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాలకు సంయుక్తంగా ఉన్న ప్రాంతం చారగొండ మండలం. అచ్చంపేట దళిత ప్రజల జీవన విధానం అంతంత మాత్రంగానే ఉంటుంది. ముఖ్యమంత్రి ఎంతో ఆలోచించి చారగొండ మండలాన్ని ఎంపిక చేశారు. కర్ణాటక సరిహద్దున ఉండి భిన్నమైన జీవన విధానాలను అవలంబిస్తున్న వారు నిజాంసాగర్‌ మండల ప్రజలు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అభివృద్ధి జరుగని ప్రాంతం మధిర. అటువంటి ప్రాంతంలో ఉన్న దళితులకు ప్రయోజనం జరుగాలంటే, దళితబంధు పథకం అమలు అవసరమని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇగ తెలంగాణకు మధ్యన ఉన్న ప్రాంతం తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం. నాలుగు జిల్లాలకు సరిహద్దున ఉన్న మండలం కావడంతో ఇక్కడ దళితబంధు పథకం అమలుతో మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చునని తిరుమలగిరిని ఎంపిక చేశారు. ఈ ఎంపిక చేసిన తీరు దళితుల అభ్యున్నతి పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
(వ్యాసకర్త: తుంగతుర్తి శాసనసభ్యులు)

డాక్టర్‌ గాదరి
కిశోర్‌కుమార్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana