e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home ఎడిట్‌ పేజీ తెలుగు ప్రజల ప్రేమకు ధన్యుడను

తెలుగు ప్రజల ప్రేమకు ధన్యుడను

తెలుగు ప్రజల ప్రేమకు ధన్యుడను
  • తల్లిదండ్రుల్లా అభిమానించి, ఆదరించారు
  • అంతా మనోళ్లే అనే తెలంగాణ నైజాన్ని చాటారు
  • యాదాద్రి దర్శనం.. మధురానుభూతిని మిగిల్చింది
  • ప్రగతిశీల తెలంగాణ సమాజానికి కోటి వందనాలు.
  • తెలుగు ప్రజలకు సీజేఐ ఎన్వీ రమణ భావోద్వేగ లేఖ

తెలుగు ప్రజలకు వందనం.. తీర్చలేనిది ఈ రుణం పిల్లలు జీవితంలో రాణించాలని తల్లిదండ్రులు తపించడం సహజం. తమ విజయాలను చూసి తల్లిదండ్రులు గర్వించాలని, ఆనందించాలని పిల్లలు ఆశించడం కూడా అంతే సహజం. నేనూ అందుకు మినహాయింపు కాదు.

నేను భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరుకున్న ఈ సమయంలో నన్ను చూసి గర్వించడానికి, మనస్ఫూర్తిగా అభినందించడానికి నా తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేది. భారత ప్రధాన న్యాయమూర్తిగా నా ఈ వారం రోజుల తొలి పర్యటనలో తెలుగు ప్రజలు ఆ లోటు తీర్చారు. నన్నుగన్న తల్లిదండ్రుల వలె, నన్ను పసిబిడ్డ మాదిరి అక్కున చేర్చుకొని అపార ప్రేమాభిమానాలతో, ఆశీర్వచనాలతో ముం చెత్తిన నిష్కల్మష, ప్రగతిశీల తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు. నా జీవితంలో భావోద్వేగానికి గురైన సందర్భాలలో ఈ పర్యటన ఒకటి.
కొవిడ్‌కు సైతం వెరవక, వారించినా వినక, వారనక వీరనక అసంఖ్యాకంగా వచ్చి నన్ను తమలో ఒకడిగా, ఆప్తుడిగా భావించి, అభినందించి, వెన్ను తట్టి, ఆశీర్వదించిన పెద్దలు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు. న్యాయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువత, శ్రామికులు, మహిళలు, రైతులు, సకల జీవనరంగాలకు చెందిన వారు, కులమతాలకు అతీతంగా, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నన్ను పలుకరించారు, దీవించారు. స్వంత పనులు ఎవ్వరూ ప్రస్తావించలేదు. వారు కోరిందల్లా న్యాయవ్యవస్థను పటిష్టపరచమని మాత్రమే. తెలంగాణ సమాజపు నిస్వార్థగుణానికి, పరిణతికి ప్రతీకలు వారు.
వయోవృద్ధులు, గురుతుల్యులైన విశ్రాం త న్యాయమూర్తులు నన్ను దీవించడానికి ఏడాదిన్నర కొవిడ్‌ కాలంలో తొలిసారి గడప దాటటం నన్ను కదిలించింది. వారికి నమస్సులు.
ముఖ్యమంత్రి మొదలుకొని అతిసాధారణ పౌరుని వరకు ప్రతి ఒక్కరూ ఈ అసాధారణ సమయంలో వ్యయప్రయాసలకోర్చి నాకు స్వాగతం పలికి, ‘అంతా మనో ళ్లే’ అన్న తెలంగాణ నైజానికి, సుప్రసిద్ధ హైదరాబాదీ అతిథ్యానికి అద్దంపట్టారు. అనూహ్య స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌ గారికి, ముఖ్యమం త్రి గారికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, న్యాయమూర్తులకు, మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, సకల పక్షాల నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు.
దివ్యాతి దివ్యమైన దైవదర్శనానికి, ఆశీర్వచన ప్రాప్తికి అల్పవ్యవధిలో అన్ని ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి, యాదాద్రి, శ్రీశైలం దేవస్థానాల పాలక మండళ్లకు, ప్రభుత్వ ప్రతినిధులకు, స్థానిక అధికారులకు నేనూ, నా సతీమణి శివమాల సదా కృతజ్ఞులం. యాదాద్రిని దేశంలోనే అతి ముఖ్య తీర్థ యాత్రాస్థలాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం.
వారం క్రితం తెలుగు నేలపై కాలు మోపినప్పటి నుంచి, నేడు ఢిల్లీకి బయలుదేరే వరకు నన్ను, నా సిబ్బందిని కంటికి రెప్పలా చూసుకొన్న తెలంగాణ ప్రభుత్వ అధికారులకు, రాజ్‌భవన్‌ సిబ్బందికి, హైకోర్టు సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, ఎంతగానో సహకరించిన పాత్రికేయులకు కృతజ్ఞతలు.
కొవిడ్‌ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని శాస్త్రవేత్తలు, ప్రభుత్వం నిర్ధారించే వర కు దయచేసి తగు జాగ్రత్తలు పాటిస్తూనే ఉండండి. నిర్లక్ష్యం ఏ మాత్రం తగదు.
తెలుగు ప్రజల దీవెనల బలంతో నా రాజ్యంగబద్ధ విధులను సమర్థంగా నిర్వహించగలనన్న నమ్మకంతో తిరుగు ప్రయాణమవుతున్నా.

- Advertisement -

సెలవు నమస్తే,
మీ నూతలపాటి వెంకట రమణ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలుగు ప్రజల ప్రేమకు ధన్యుడను
తెలుగు ప్రజల ప్రేమకు ధన్యుడను
తెలుగు ప్రజల ప్రేమకు ధన్యుడను

ట్రెండింగ్‌

Advertisement