e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home ఎడిట్‌ పేజీ నదుల తీరాల్లో నాగరికథ

నదుల తీరాల్లో నాగరికథ

నదుల తీరాల్లో నాగరికథ

నీరు ఈ భూమ్మీద ప్రతి జీవికి ప్రాణం పోసింది. మట్టికి ప్రాణం పోసే గుణాన్ని అందించింది. మనిషికి నడక నేర్పింది. మన నాగరికత నదీ లోయల్లో విస్తరించింది. గోదావరీ, కృష్ణలు తెలంగాణలో గ్రామాల్ని సాకి పెంచి పెద్ద చేసి పట్టణాలు, నగరాలుగా మార్చాయి. అందుకే ఇకడి ప్రతి ప్రవాహం ఏదో ఒక చారిత్రక కాలపు కథ చెపుతుంది. అందుకేనేమో చరిత్రను ప్రవాహంతో పోలుస్తారు. ఈ సజీవ స్రవంతులు వినిపించే కథే మన చరిత్ర.

సింధు, గంగ వంటి నదీ లోయల్లో విలసిల్లిన నాగరికతల కథే భారత చరిత్రగా చదువుతున్నాం. ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్‌ అన్నట్టుగా గంగా తీర ప్రాంతాల చరిత్ర మాత్రమే భారత చరిత్రలో ప్రధాన ఘట్టాలుగా నమోదైనాయి. దక్షిణ భారత చరిత్ర విస్మరణకు గురైతే మన తెలంగాణ చరిత్ర మరింత నిరాదరణకు గురైంది. అందుకే ఇకడి మానవ ప్రస్థానాన్నీ, మనం రాసుకోవాల్సిన తెలంగాణ చరిత్రను- గోదావరీ లోయ, కృష్ణా లోయ, మంజీరా లోయ, మూసీ లోయ వంటి పదాల్ని కాయిన్‌ చేసుకొని రాసుకుంటే కానీ ఇకడి ప్రత్యేకత, విలక్షణత అర్థం కావు.

- Advertisement -

నదీ తీరాల్లో నిజాం ప్రభుత్వ ఆరియాలజీ శాఖ, ఆ తర్వాత 1950ల నుండి నేటి వరకు రాష్ట్ర ఆరియాలజీ శాఖ, ఆర్కియాలజికల్‌ సర్వే అఫ్‌ ఇండియా జరిపిన ముఖ్యమైన తవ్వకాలు, సర్వేలు ఎంతో విలువైన చారిత్రక అంశాల్ని మన ముందుంచాయి.

తొలి నాళ్ళ బౌద్ధానికి గోదావరి నెలవుగా ఉంటే, మహాయాన బౌద్ధ వికాసానికి కృష్ణా నది సాక్షిగా నిలిచింది. శాతవాహన కాలానికి గోదావరి ప్రతినిధి అయితే, శాతవాహనుల తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులకు కృష్ణా నది ఆతిథ్యమిచ్చింది.

తెలంగాణలో ప్రవహిస్తున్న నదులు, ప్లీస్టోసీన్‌ యుగం (26 లక్షల నుండి 11,700 ఏళ్ళ కిందటి వరకు)లో ఏర్పడ్డాయి. అందుకే ఇకడి చరిత్ర, సంసృతి మొత్తం గోదావరి, కృష్ణలు, వాటి ఉపనదులు, వాటికి శాఖలుగా ఉన్న ఏరులు నిర్మించిందే. గోదావరి ఉపనదులైన మంజీరా, ప్రాణహిత, మానేరు, పెన్‌ గంగ, శబరి, వార్ధా, ఇక కృష్ణ ఉపనదులైన మూసీ, డిండి, పాలేరు, భీమా, మున్నేరు, హాలియా మొదలైనవి జీవధారలుగా ఉన్నాయి. మానవ శరీరంలో నాడీ వ్యవస్థ లాగా అల్లుకొని ఉన్న నదులు, వాటి ఉపనదులు, ఏరులు తెలంగాణ నేలను పరుచుకొని మానవ జీవనానికి విసృ్తతిని కల్పించినయి.

రాతి యుగం మానవులు, కొండ గుహల్లో తల దాచుకున్నా, వారి ఆవాసాలూ, కదలికా నీరు ఉన్న ప్రాంతాల చుట్టే ఉన్నాయి. అందుకే ఏదైనా చారిత్రక ప్రదేశం గురించి పరిశీలన చేసే ముందు మొదటగా చూసేది నీటి తావులు ఎకడ ఉన్నాయనేదే. ఎందుకంటే నీళ్లు లేనిదే అకడ మనుషులు ఉండలేరు, సంసృతీ నాగరికతలు పెరగలేవు.

ఈ నేలా, నీరూ సుమారు 550 మిలియన్‌ ఏళ్ళ కింద గోండ్వానా ల్యాండ్‌గా పిలవబడే ప్రాంతంలో భాగమే దకన్‌ పీఠభూమి. తూర్పు దకన్‌ పీఠభూమిలో తెలంగాణ ఒక భాగం. ఇకడి మట్టి కింది పొరలు విస్తారమైన గ్రానైట్‌ రాతి షీట్స్‌తో ఏర్పడ్డాయి. ఈ రాతి పొరలు వర్షపు నీటిని తమలో నిలువ చేసుకున్నాయి. రెండున్నర లక్షల ఏళ్ళ క్రితం మొదలైన పాత రాతి యుగం నుండి కొత్త రాతి యుగం వరకు, ఆ తర్వాత కొత్త రాతి యుగంలో మనం వ్యవసాయాన్ని నేర్చుకుని గ్రామీణ జీవితానికి మారే వరకు మనం నీటినే అంటి పెట్టుకుని బతికాం. ప్రకృతితో పోరాటం చేయటంలో భాగమే నీటి తావుల కోసం అన్వేషణ. నిజానికి పరిణామ క్రమంలో మానవుల మెదడు పరిణామం పెరగటం మనకు లాభపడింది కానీ, ఎప్పుడూ చాలా జంతువుల కంటే బలం, వేగంలో మానవులు బలహీనులే. అందుకే ప్రైమేట్స్‌ (వానర జాతి) నుండి ఎదిగిన మనిషి దట్టమైన అడవులు కాకుండా, చిట్టడవులు, గుట్టలు, కొండలు వంటి వాటిని ఆశ్రయించాడు. నదీ తీరాల్లోని గుట్టలు, కొండలు, గుహలు రాతి యుగపు మానవుల ఆవాసాలు అయినాయి. నీరు రక రకాల ఖనిజాలతో కూడిన సారవంతమైన నేలల్ని సాగుకు తయారు చేసి ఇచ్చింది. అందుకే తెలంగాణలో ఉన్న రకరకాల నేలలు వైవిధ్యమైన పంటల్ని ఇచ్చినయి. ఈ పునాది మీద గ్రామీణ సంసృతి, దాని మీదే పట్టణ నాగరికత విలసిల్లినయి.

గోదావరి మన సంసృతికి నాదఝరి
ఠాకూర్‌ రాజారాం సింగ్‌ చేసిన అన్వేషణ తెలంగాణలో ప్రవహిస్తున్న గోదావరి పొడుగునా సాగింది. ఉత్తర తెలంగాణలో పాత రాతి యుగం నుండి తొలి చారిత్రక యుగం వరకు ఆధారాల్ని గోదావరి, దాని ఉప నదులు, ఏరులు తమ ఒడ్డున నిక్షిప్తం చేసుకున్నాయి. పాత రాతి యుగపు చేతి గొడ్డళ్లు మొదలు, మధ్య రాతి యుగపు సూక్ష్మ పని ముట్లు (మైక్రోలిత్స్‌) ఇప్పటికీ ఆదిలాబాద్‌, నిర్మల్‌. కరీంనగర్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో మనకు దొరుకుతాయి. ఇక తొలి చారిత్రక కాలానికి వస్తే అశ్మక మహా జనపదానికి గోదావరి పురుడు పోసింది. గోదావరీ మంజీరల ప్రవాహమే అశ్మక మహాజనపదమని చెప్పే ఆధారాలు మనకు ఎన్నో దొరికాయి. బౌద్ధ్ధ సాహిత్యం ఇస్తున్న ఆధారాలతో అల్లుకొని సాగిన పురావస్తు తవ్వకాల ఫలితాలు మనకు అశ్మకమంటే మధ్య గోదావరి అని నిరూపిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలోని కోటలింగాల, పెద్దపల్లి జిల్లాలోని ధూళికట్ట, పెద్దబంకూరు తవ్వకాలలో శాతవాహన పూర్వ రాజులతో మొదలైన మన తొలి చారిత్రక యుగపు ఆధారాలు దొరికాయి. మంజీరా తీరంలోని బోధన్‌, కొండాపూర్‌ వంటి స్థలాలు ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన గోదావరీ సంసృతిని ఎత్తి పడతాయి.

కృష్ణా తీరం చెప్పే కథలు
మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో మైదానాల్నీ, నల్లమల అడవినీ తడిపిన కృష్ణా నది పాత రాతి యుగం నుండి తొలి చారిత్రక యుగం వరకు ఎన్నో ఆధారాల్ని అందిస్తూ ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో చరిత్ర పూర్వ యుగానికి చెందిన ఎన్నో ఆధారాల్ని రాష్ట్రఆరియాలజీ శాఖ వెలికి తీసింది. బృహత్‌ శిలా యుగపు సమాధులు, వింత ఆకారాల్లో ఉండే శవ పేటికలు, ఇలా ఎన్నింటినో మ్యూజియంలలో చూడొచ్చు. తొలి నాళ్ళ బౌద్ధానికి గోదావరి నెలవుగా ఉంటే, మహాయాన బౌద్ధ వికాసానికి కృష్ణా నది సాక్షిగా నిలిచింది. సుమారు 1800 ఏళ్ళ ముందు శ్రీపర్వతంగా పిలవబడ్డ నాగార్జునసాగర్‌ ప్రాంతంలో ఏలేశ్వరం వంటి ఆరియాలజికల్‌ సైట్‌ మాత్రమే కాదు, నాగార్జునసాగర్‌ డ్యామ్‌ ప్రాంతంలో ఉండేటి సుమారు 47 తెలంగాణ గ్రామాలు వేల ఏళ్ళ చరిత్రను తమ నేల పొరల్లో దాచుకుని ఇప్పుడు శాశ్వతంగా నీట మునిగాయి. గోదావరి శాతవాహన కాలానికి ప్రతినిధి అయితే, శాతవాహనుల తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులకు కృష్ణా నది ఆతిథ్యమిచ్చింది.

అభివృద్ధి మింగేస్తున్న ఆధారాలు
నదీ తీరాల్లో, ఏర్ల పొంటి, ఊళ్ళ పొలిమేరల్లో ఉన్న బండలు, కొండలు, గ్రానైట్‌ గుట్టలు వేల ఏళ్ళ ఆధారాల్ని దాచుకుని ఉన్నాయి. గృహ నిర్మాణ పరిశ్రమ పెరగడంతో ఈ కొండలు కరిగి పోతున్నాయి. వీలున్నంత త్వరలో చారిత్రక ప్రదేశాలను సర్వే చేసి రికార్డు చేయకపోతే ఎన్నో ఆధారాలు శాశ్వతంగా కనుమరుగవుతాయి. అప్పుడు మన అపార్ట్‌మెంట్‌ పునాదికి వేసిన కాంక్రీట్‌లో ఏ శాతవాహన శాసనమో, కొత్తగా ఏర్పడ్డ కాలనీ కింద ఏ బౌద్ధ స్థూపమో, జైన ఆలయమో ఆనవాళ్ళు కూడా మిగలకుండా మాయమౌతాయి. చాళుక్యుల, కాకతీయుల స్తంభాలు పొలాలకు కడీలుగా, సరిహద్దు రాళ్లుగా మారి పోతాయి. ఇప్పుడు కావల్సింది అభివృద్ధికీ, పురాతత్వ పరిరక్షణకు మధ్య సమతౌల్యత.

పురాతత్వ పరిశోధన ఒక సాహసం

నదీ లోయల్లో, అడవుల్లో చరిత్రను తవ్వితీసే శోధకులు ఎన్నికష్టాల్ని, ఆపదల్ని ఎదురొని మన ముందుంచుతారో తెలిస్తే మ్యూజియంలలో మనం అలవోకగా తిరుగుతూ చూసే ప్రతీ ప్రదర్శిత వస్తువు (exhibit) వెనుక ఎంత శ్రమ ఉంటుందో అర్థం అవుతుంది.
కృష్ణా లోయలో నాగార్జున కొండ తవ్వకాల్లో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన గురించి ప్రముఖ ఆరియాలజిస్టు వి వి కృష్ణశాస్త్రి గారు రాసారు. 1938 లో టి ఎన్‌ రామచంద్రన్‌ అనే ఆరియాలజిస్ట్‌ చూళ దమ్మగిరి దగ్గర తవ్వకాలు చేసే క్రమంలో జరిగిన సంఘటన ఇది. రామచంద్రన్‌ గారి భార్య రాత్రి భోజనం తర్వాత విస్తళ్ళు బయటకు పారేయడానికి వెళ్లి మళ్ళీ రాలేదు. అడవి మధ్య ఉన్న క్యాంపులో ఆ రాత్రి పులి ఆమెను చంపేసింది. ఆ బాధను దిగమింగి రామచంద్రన్‌ గారు అకడే తన అన్వేషణ కొనసాగించారు. ఇలాంటి వ్యక్తుల సంకల్పమే పురాతత్వానికి జీవాన్నిచ్చింది. సుమారు 1700 ఏళ్ళ కిందట ఇక్ష్వాకుల రాజధాని ప్రాంతమైన ఈ కృష్ణా లోయ ఈ తవ్వకాల నాటికి దట్టమైన అడవితో పులులు, చిరుతల వంటి అటవీ మృగాల నిలయమైంది. ఆ పరిస్థితుల్లో నాగార్జున సాగర్‌ డ్యాం నిర్మాణం పూర్తయ్యేనాటికి భూమిలో దాగిన చారిత్రక అవశేషాల్ని వెలికి తీయడం కోసం ఎందరు అడవి బాటల్లో, చీకటి రాత్రుల్లో, ఎన్ని సంవత్సరాలు శ్రమిస్తే ఇప్పుడు చూస్తున్న చారిత్రక అవశేషాలు, చదువుతున్న చరిత్ర మనకు అందిందో అర్థం అవుతుంది.

కృష్ణా తీరంలో తవ్వకాలు

యాపర్లదేవిపాడు, గుమ్మడం, ఈర్లదిన్నె (వనపర్తి జిల్లా), చినమారూరు
(జోగులాంబ గద్వాల్‌), కూడలి సంగమేశ్వరం (నాగర్‌ కర్నూల్‌ జిల్లా)

మంజీరా పరీవాహక ప్రాంతం కొండాపూర్‌ (సంగారెడ్డి జిల్లా)
మూసీ తీరంలో..చైతన్యపురి (హైదరాబాద్‌)
వాగుల ఒడ్డుల్లో … హుస్సేన్‌ మియా వాగు – ధూళికట్ట, పెద్ద బంకూరు (పెద్దపల్లి జిల్లా)
భికేరు – ఇంద్రపాలనగరం లేదా తుమ్మలగూడెం (యాదాద్రి భువనగిరి), వర్ధమానుకోట, ఈటూరు – గాజుల బండ స్తూపం (సూర్యాపేట జిల్లా)

గోదావరి తీరంలో తవ్వకాలు

  1. కోటిలింగాల (జగిత్యాల జిల్లా) – తవ్వకాలు జరిగాయి, ఇంకా చాలా జరగాల్సి ఉంది. శాతవాహన రాజధాని అయిన ఈ చారిత్రిక స్థలం శ్రీపాదసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ ముంపులో ఉంది.
  2. కర్ణమామిడి ( మంచిర్యాల జిల్లా) – పాక్షికంగా తవ్వకాలు
  3. ఇటిక్యాల (మంచిర్యాల జిల్లా) – ఉపరితల పరిశీలన, సర్వే
  4. 70 రూపాయల చెలక (జగిత్యాల జిల్లా) – ఉపరితల పరిశీలన, సర్వే
  5. బావాపూర్‌ కుర్రు (నిర్మల్‌ జిల్లా) – నది మధ్య ఉన్న ద్వీపంలో తొలి నాళ్ల స్థూపం

నదుల తీరాల్లో నాగరికథఎం.ఏ. శ్రీనివాసన్‌
81069 35000

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నదుల తీరాల్లో నాగరికథ
నదుల తీరాల్లో నాగరికథ
నదుల తీరాల్లో నాగరికథ

ట్రెండింగ్‌

Advertisement