e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home ఎడిట్‌ పేజీ ఆధ్యాత్మికంలో అ, ఆ

ఆధ్యాత్మికంలో అ, ఆ

ఎంతటి పాండిత్యమైనా ‘అ, ఆ’లతోనే ప్రారంభమవుతుంది. ఇది అందరూ ఎరిగిన సత్యమే. అ, ఆలతో ప్రారంభమైన చదువు మనిషిని విద్యావేత్తగా మారుస్తుంది. పండితుడిగా తీర్చిదిద్దుతుంది. ఆ వ్యక్తికి కీర్తిని తెచ్చిపెడుతుంది. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిప్రదాతగా నిలబెడుతుంది. మరి ఆధ్యాత్మికంలో ‘అ, ఆ’ ఏమిటి? పాండిత్యానికి అ, ఆ ఎలాగైతే ప్రాథమికమో.. ఆధ్యాత్మిక యానానికీ ఈ రెండు అక్షరాలే ప్రామాణికాలు.

నిజానికి ఆధ్యాత్మికమనేది నాగరికులైన మానవులకే తప్ప ఇంకొక జీవజాలానికి కానేకాదు. అది మూలతత్త్వంతో మన సంబంధాన్ని తెలుసుకోవడానికి నిర్దేశించింది. ఆ కార్యంలో ‘అ’ అనేది అనాత్మను, ‘ఆ’ ఆత్మను సూచిస్తాయి. ఆధ్యాత్మికతలో ప్రవేశించేవారు నిశ్చయంగా తెలుసుకోవలసిన మూల విషయాలు అనాత్మ, ఆత్మ. మన కండ్లకు కనిపించే మన శరీరాన్నే ‘అనాత్మ’ అని భావిస్తారు. అంటే అది ఆత్మకు అన్యమైనది. ఇక మన కండ్లకు కనిపించనిది ‘ఆత్మ’. ఇది లేనిదే అనాత్మ (శరీరం) నిలిచి ఉండే అవకాశమే లేదు. అందుకే ఈ ఆత్మ, అనాత్మ గురించి తెలుసుకోవడంతోనే ఆధ్యాత్మిక విద్య ప్రారంభమవుతుంది.

- Advertisement -

సాధారణంగా అందరూ చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పురాణ శ్రవణం, మందిర దర్శనం, గ్రంథ పఠనం, భగవత్‌ పూజ, తీర్థయాత్రలు, దానం, పండుగలు వంటివి కనిపిస్తుంటాయి. నోములు, వ్రతాలు, దీక్షలు కూడా అందులోకే వస్తాయి. అయితే, వీటన్నిటి లక్ష్యం దాదాపుగా అనాత్మయైన శరీరానికి సుఖం, భోగం కలిగించడమే అవుతుంది. ఏ కొద్దిమందో అనాత్మకు ఆధారమైన ఆత్మ గురించి తెలుసుకునేందుకు వీటిని వారధిగా ఉపయోగించుకుంటారు. ఆధ్యాత్మిక కలాపాలతో దేహాన్ని ఎంత సుఖపెట్టాలని ప్రయత్నించినా అది శాశ్వతంగా నిలిచి ఉండదు. అందుకే, కర్తవ్యబోధ చేయడానికై శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ విషయాన్ని భగవద్గీత ప్రారంభంలోనే అర్జునునికి తెలియజేశాడు. శరీరానికి ఉండే తాత్కాలిక స్వభావాన్ని ఆ దేవదేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అలా గీతాజ్ఞానం కూడా ‘అ, ఆ’తోనే మొదలైంది.

భరత మహారాజు మహాభక్తుడు. రాజ్యపాలనలో గొప్ప విజయాన్ని సాధించి ఈ భూమిని తనపేరుతో పిలిచేంత గొప్ప పనులు చేశాడు. ఆయన పాలించిన మేర ప్రాంతం భారత వర్షంగా ప్రసిద్ధి చెందింది. అయితే చివరలో ‘అనాత్మ’ (జింకపిల్ల) పట్ల ఆకర్షణ కారణంగా పతనం చెంది, జింక శరీరాన్ని పొందాడు. అంటే ‘రాజ శరీరం’ (అనాత్మ) పోయి జింక శరీరం వచ్చింది. కానీ, జ్ఞానం మాత్రం నశించలేదు. దాని కారణంగానే మరుసటి జన్మలో ఉన్నతమైన మరో ఉపాధి పొందాడు. ఈ విధంగా అనాత్మ (శరీరం) మారుతూ వచ్చింది. కానీ, లోపల ఉండే ఆత్మ మారలేదు. ‘అనాత్మ’కు మారే స్వభావం ఉంటుంది. ‘ఆత్మ’ ఎన్నటికీ మారదు. అందుకే భరతుడు మరుసటి జన్మలో జడభరతుని రూపంలో అత్యంత సావధానంగా ప్రవర్తించి మోక్షసాధన చేశాడు, ముక్తిని పొందాడు.

అనాత్మతో తాదాత్మ్యం ఉన్నంతవరకు ఆత్మ కనిపించదు, ఇక ఆత్మ దర్శనం కాగానే అనాత్మతో పని ఉండదు. అంటే శరీరాలను ధరించవలసిన అవసరం కలగదు. కనుక ఆధ్యాత్మిక కలాపాలను ఆత్మదర్శియైన గురువు నిర్దేశంలో ‘అ,ఆ’లను నేర్చుకోవడానికి, అనుభూతం చేసుకోవడానికి నిర్వహించాలి. తద్వారా సాధకుడు ఇహపర సౌఖ్యాలను సాధిస్తాడు. ఇదే గీతా సందేశం! గీతలో ఆత్మ, అనాత్మ గురించిన సంపూర్ణమైన వివరణ మనకు లభిస్తుంది. ఆ దివ్యజ్ఞానంతో అందరూ మానవజన్మను సఫలం చేసుకోవాలి.

డా॥ వైష్ణవాంఘ్రిసేవకదాస్‌
98219 14642

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana