e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home ఎడిట్‌ పేజీ తిక్కనను ప్రభావితుణ్ని చేసిన తెలంగాణ దేశీయత

తిక్కనను ప్రభావితుణ్ని చేసిన తెలంగాణ దేశీయత

  • తెలంగాణ సాహిత్యప్రస్థానం 14

దక్షిణ భారతంలో పుట్టిన మహా పురుషుల చరిత్రలు, దేశీయమైన ద్విపద ఛందస్సును తీసుకొని పాల్కుర్కి సోమన కావ్యాలను రచించాడు. ఆ విధంగా స్వతంత్రమైన దేశీయమైన అనువాదం కాని కావ్యాలను రచించటంతో పాల్కుర్కి సోమనాథున్ని తెలుగు సాహిత్యంలో ‘ఆదికవి’ అంటున్నారు. సోమన దేశీమార్గంలో రచనలు చేయడమే గాక ‘జానుతెనుగు’లో అంటే ‘సంస్కృతమయం కాని అచ్చమైన తెనుగు’లో రచిస్తానని చెప్పుకొన్నాడు.

‘జాను తెనుగు’ అనే మాటను మొట్టమొదట ప్రయోగించినవాడు నన్నెచోడ కవి. నన్నెచోడుడు తెలుగుచోడ వంశానికి చెందిన వాడు. ఈ కవి ‘కుమార సంభవం’ అనే కావ్యం రచించాడు. ఇది ప్రబంధ లక్షణాలతో ఉన్నది. వనపర్తి ఆస్థానంలో మానవల్లి రామకృష్ణ కవి పరిశోధక పండితుడిగా ఉన్నప్పుడు అతనికి అక్కడి తాళపత్ర గ్రంథాలయంలో నన్నెచోడుని‘కుమార సంభవం’ రాతప్రతి లభించింది. ఆ రాతప్రతి సహాయంతో రామకృష్ణకవి 1910లో మొదటి భాగంగా, 1911లో రెండవ భాగంగా ‘కుమార సంభవ’ కావ్యాన్ని ప్రచురించాడు. ఆ విధంగా నన్నెచోడుని ‘కుమారసంభవం’ కావ్య ప్రచురణ తెలంగాణ నుంచి జరిగింది.

తిక్కనను ప్రభావితుణ్ని చేసిన తెలంగాణ దేశీయత

రామకృష్ణ కవి నన్నెచోడుడు నన్నయకు పూర్వం క్రీ.శ.940 కాలం వాడని ప్రకటించడంతో సాహిత్య లోకంలో సంచలనం చెలరేగింది. నన్నయకు పూర్వం ఒక కవి ఉన్నాడనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత పండితుల చర్చలతో నన్నెచోడుడు నన్నయ, తిక్కనల మధ్యకాలంలో క్రీ.శ.1240 ప్రాంతంలో జీవించినట్లు నిర్ణయించారు. నన్నెచోడుడు ‘జానుతెనుగు’ అనే పదాన్ని వాడిన మొట్టమొదటి కవి. ఆయన తొలి ‘జానుతెనుగు’లో రాస్తానని ప్రకటించి.., ‘సరళముగాగ భావములు జాను తెనుంగున నింపు పెంపుతో పిరిగొన వర్ణనల్‌’ అని రాశాడు. ‘జాను తెనుగు’ అంటే.. ‘సరళమైన భావాలు చెప్పే భాష’ అని విశదం చేశాడు. కన్నడభాషలో ‘జాణ్ణుడి’ అనే పదం ఉంది. సామాన్య జనులు మాట్లాడుకునే భాష ‘జాణ్ణుడి’. అదే తెలుగులో జాన్నుడి- జాను భాష- జనుల భాషగా ఏర్పడి ఉంటుంది. తెలుగులో ‘జాను తెనుగు’ అని కవులు రాశారు. అంటే, జనులు మాట్లాడే తెలుగు అని అర్థం.

బసవ పురాణంలో సోమన.. ‘ఉరుతర గద్యపద్యోక్తుల కంటె సరసమై పరగిన జాను తెనుగు చర్చింపగా సర్వసామన్యమగుట కూర్చెద ద్విపదలు కోర్కి దైవార’ అని సంస్కృత భూయిష్టమైన రచన జనులకు దూరమైందని జానుతెలుగు విశేషంగా ప్రజలకు అర్థమయ్యేది అని సోమన తన పండితారాధ్య చరిత్రలో చెప్పారు.

వీరశైవ కవులు తమ కవిత్వంలో దేశీ మార్గానికి భాషలో జానుతెనుగు అంటే ప్రజల నోళ్లలో ఆడే భాషకు ప్రాధాన్యం ఇచ్చారు. సాహిత్యంలో దేశీయత భావాలు మొదటి ప్రతాప రుద్రుని కాలంలోనే వీరశైవంతో పాటు తెలంగాణకు వచ్చి చేరాయి. గోన బుద్ధారెడ్డి దేశీయతను పాటించి దేశీమార్గంలో ‘రామాయణం’ రచించాడు. గణపతి దేవుని కాలంలో ఓరుగల్లు వచ్చిన తిక్కన కూడా ఇక్కడి దేశీయత చేత ప్రభావితుడయ్యాడు. అందుకే తన నిర్వచనోత్తర రామాయణంలో కన్నా మహాభారతంలో దేశీయమైన తెలుగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. పాత్ర చిత్రణలోనూ, దేశీయతను పాటించాడు. వీరశైవ సాహిత్యంలోని దేశీయత, జానుతెనుగుల ప్రభావం తిక్కనలో ఎక్కువగా కన్పిస్తుంది. అది అత డు తెలంగాణ రాకతోటే ప్రభావితుడయ్యాడని చెప్పాలె.

పాల్కుర్కి సోమనాథుడి కాలం గురించి చాలా అభిప్రాయ భేదాలున్నాయి. చాలామంది ప్రతాపరుద్రుడి కాలం వాడు అంటే, మొదటి ప్రతాపరుద్రుడని తీసుకున్నారు. ఒకవేళ సోమన మొదటి ప్రతాపరుద్రుడి కాలం వాడు అయితే బసవేశ్వరుడికి, పండితారాధ్యునికి సమకాలికుడవుతాడు. వారిద్దరినీ పురాణ పురుషులుగా చేసి సోమన చెప్పాడు. కానీ సమకాలికుడైన వారి గురించి ఆ విధంగా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ప్రతాపరుద్రుని చరిత్ర, సిద్దేశ్వర చరిత్రల ప్రకారం సోమన రెం డవ ప్రతాపరుద్రుని కాలం వాడు అనడం సమంజసంగా ఉం టుంది. అప్పటికీ వీరశైవంలో వీరావేశం తగ్గింది. సోమన అప్పుడే వేదానికి భాష్యం ‘సోమనాథ భాష్యం’ పేరుతో రాశాడు. దీంతో అతడు వీరశైవాన్ని వైదిక బద్ధం చేశాడు.

వీరశైవం జైనంలాగానే నాస్తిక మతం కాకుండా, వైదిక విదూరమైన మతం కాకుండా సోమన కాపాడాడు. కవిగానే కాక సోమనకు ఈ భాష్యం చేతకూడా కన్నడ దేశంలో కీర్తి, గౌరవాలు లభించాయి. వీరశైవ మతంలో అతడికి గొప్పస్థానం ఏర్పడింది. కన్నడ వీరశైవకవులు అతన్ని భృంగి అవతారంగా, పురాణ పురుషునిగా కీర్తించారు. అతని జీవిత చరిత్రను ‘తొంటదార్య’ అనే కవి ‘పాల్కుర్కి సోమేశ్వర చరిత్ర’ అనే పేరుతో కావ్యంగా రచించాడు. మల్లికార్జున అనే మరొక కవి సోమన చరిత్రను కన్నడంలో యక్షగానంగా రచించాడు.

కన్నడ భాషలో ప్రసిద్ధమైన వీరశైవ కవి రాఘవాంకుడు ఉన్నాడు. రాఘవాంకుడు, సోమన ఇద్దరూ స్నేహితులు. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ఓరుగల్లులో ఉన్నారని, ఏడవసారి జరిగిన మహ్మదీయుల దండయాత్రలో రెండవ ప్రతాపరుద్రుడు బంధీ అయినప్పుడు ఆ అరాచక పరిస్థితుల్లో వారిద్దరూ ఓరుగల్లును విడిచిపెట్టి కన్నడ దేశానికి పారిపోయారని, సోమన అక్కడ ఉండి ఎన్నో రచనలు చేశాక ‘కల్య’ అనే చోట లింగైక్యం చెందాడని కన్నడ సాహిత్య చరిత్రకారులు రాస్తున్నారు. ఇప్పుడు పాలకుర్తిలో సోమన సమాధి ఉన్నదంటే తర్వాతికాలంలో ఎవరో ఆయన సమాధిని నిర్మించి జాతర నిర్వహించి ఉంటారని చెప్పాలి. సోమన వేదానికి రచించిన ‘సోమనాథ భాష్యా’నికి ‘మనోహరీయం’ అనే తెలుగు వాఖ్యానం, ఇంకా కన్నడ టీకా కూడా ఉన్నాయి. సోమన రచించిన ‘బసవపురాణం’ను 14వ శతాబ్దంలో కన్నడ భాషలోకి భీమకవి అనువదించాడు. ఈ విధంగా సోమన కన్నడంలో రచనలు చేయడమే గాక, తెలుగులో రచించిన అతని రచనలు కన్నడ అనువాదాలుగా కూడా కనిపిస్తున్నాయి.


తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ-తిక్కనల మధ్య కాలాన్ని వీరశైవ కవియుగం అని చెప్పుకొంటున్నాం. కానీ ఆధునిక కాలం వరకు అనగా 20వ శతాబ్దం ఆరంభం వరకు కూడా తెలుగులో వీరశైవులు రచించిన రచనలున్నాయని, వీరశైవులున్నారని, వీరశైవ మతానికి ఈ స్థాయి ప్రాభవం ఉన్నదని మనకు తెలియదు!

బండారు తమ్మయ్య వంటి ఎందరో పరిశోధకులు గుట్టల కొద్ది ఉన్న తాటాకు రాత ప్రతులను శోధించి వెలికితీసి వీరశైవ కవులున్నారని, వారి రచనలున్నాయని చెప్పేంతవరకు మనకు ఈ విష యం తెలీదు. కవులెవరూ వీరశైవ కవులను పూర్వ కవి స్తుతిలో ఒక్కరిని కూడా స్తుతించలేదు. దీనికి కారణం వాళ్ల పరమత ద్వేషం కారణం కావచ్చును. వీరశైవ సాహిత్యం బయటపడిన తర్వాత ఎన్నో పరిశోధనలు జరిగాయి. తత్పరిణామంగా వీరశైవ సాహి త్యం, ప్రాభవం బయటపడింది. వారికంటూ ఒక ప్రత్యేక యుగా న్ని సృష్టించి ఆ కవుల గురించి మనం తెలుసుకుంటున్నాం, చదువుకుంటున్నాం.

నన్నెచోడుడు ‘జానుతెనుగు’ అనే పదాన్ని వాడిన మొట్టమొదటి కవి. ఆయన తొలి ‘జానుతెనుగు’లో రాస్తానని ప్రకటించి.., ‘సరళముగాగ భావములు జాను తెనుంగున నింపుపెంపుతో పిరిగొన వర్ణనల్‌ ’ అని రాశాడు. ‘జాను తెనుగు’ అంటే.. ‘సరళమైన భావాలు చెప్పే భాష’ అని విశదం చేశాడు. కన్నడభాషలో ‘జాణ్ణుడి’ అనే పదం ఉంది. సామాన్య జనులు మాట్లాడుకునే భాష ‘జాణ్ణుడి’. అదే తెలుగులో జాన్నుడి- జాను భాష- జనుల భాషగా ఏర్పడి ఉంటుంది. తెలుగులో ‘జాను తెనుగు’ అని కవులు రాశారు. అంటే, జనులు మాట్లాడే తెలుగు అని అర్థం.

ముదిగంటి
సుజాతారెడ్డి
99634 31606

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తిక్కనను ప్రభావితుణ్ని చేసిన తెలంగాణ దేశీయత

ట్రెండింగ్‌

Advertisement