e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021

సృజన

సృజన

మళ్ళా పాతకాలపు పవిత్రతను తట్టిలేపేలా
కొత్తగా చిత్రించు మిత్రమా..!
ఈ మనుషులంతా బంధ విముక్తులై
అలనాటి రెక్కలను తొడుక్కున్నా సరికొత్తగా మారిపోయేలా!
అప్పటి కాలపు నూత్నలోక వాసులై
ఉదాత్తమైన ఆలోచనా తీరాల్లో విహరిస్తూ
మట్టి స్పందనలకు ప్రతిస్పందించే విప్పారిన హృదయాలతో
చల్లని వెన్నెలలు ఒంపే నేలపై నెలవంకలై నడిచేలా
అజంతా కుడ్యాల వన్నెలతో అపూర్వ లోకాలను ఆవిష్కరించు!

మూసుకున్న ముక్కూ మూతులు
ఏడుపుగొట్టు కళ్ళతో కాక
మురిసిపోయే ముఖాలలో
మెరిసిపోయే కళ్ళను చిత్రించు..!

నిర్మానుష్య వీధుల్లో
బతుకు రాతలను మార్చి రాస్తున్న
అంబులెన్సులను గాక
గడచిన కాలపు మరచిన ఎడ్లబండ్లు, గుఱ్ఱపు బగ్గీలను తిప్పు
పూల తోపుడుబళ్ళతో..
పండ్ల గంపల ముసలమ్మలతో ఆడుకుంటున్న పిల్లలతో..
ఆడంబరంగా.. సందడి సందడిగా సంబరంగా తీర్చు..!

మిత్రమా.. నీ చిత్రాల్లో ఎక్కడా కొట్టేసిన చెట్ల మొదళ్లూ
రెక్కలూడిన పక్షులూ
కుంటుతున్న జంతుజాలం లేకుండా చూసుకో..

వాస్తవ దూరాలనిపించినా సరే..
ప్రపంచం ఎలా ఉండాలని ఆలోచించామో, చర్చించామో, ఆశించామో..
ఆ రంగుల కలలు కన్న
మన కళ్ళ కనురెప్పలను కుంచెలు చేసి గీయు..!

ఇప్పుడున్న కాలుష్య కర్కశ కల్లోలిత కన్నీటి ప్రపంచాన్ని
ఫొటోలు తీసినట్లుగా నువ్వు మళ్ళా గీయడమెందుకు కొత్తగా?
నీవు గీసిన చిత్రాలలోకి మనుషులు
వాళ్ళ వెనుక సమస్త జగత్తు తరలిపోయేలా..
ఒక అద్భుతాన్ని సృష్టించు.. ఆశ్చర్యాన్ని కలిగించు..!!

మడిపల్లి రాజ్‌కుమార్‌
99496 99215

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సృజన

ట్రెండింగ్‌

Advertisement