మహాకవి ‘సినారె’ జయంతి,
భవ్య గేయ కావ్యాల భవంతి
రసరమ్య గీతాల వైజయంతి
పులకిత భావాల పూబంతి!
ఆయన మాట్లాడితే
మాటలు మాత్రాబద్ధమై
అంతా మంత్రముగ్ధులయ్యేవారు!
ఎలుగెత్తి పలికితే
సుస్వర గానమై
విశిష్ట విపంచి అనిపించేవారు!
పంచె కట్టుతో
తెలుగు సంస్కృతి ప్రతిబింబంగా కనిపించేవారు!
పాఠం చెప్పితే
‘జ్ఞానపీఠం’గా తోచేవారు!
శ్రీనాథుని రాజసంతో సదా
చిరునవ్వు చిందించేవారు!
మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా
మధ్యలో మాట్లాడుతుంటే వెరువక
మౌనంగానే హెచ్చరించేవారు!
‘పద్మభూషణ్’ గానే గాక
కవికుల భూషణ్ గానూ
కడవరకూ మెలిగారు,
‘సినీగ్లామర్’ తోనే గాక
శిష్ట సాహిత్యపు ‘గ్రామర్’తో మెలిగారు!
నాతోటి శిష్యులకు
నవ్య మార్గాల్ని చూపారు!
అందుకే
ఆయన జయంతి అమరస్మృతికి
నా అక్షరాంజలిదే..
డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ
92465 41699