ప్రత్యామ్నాయ ప్రయాణికుడు

Mon,May 6, 2013 06:23 AM

ఓ రోజు డాక్టర్ కె హరీష్ గారు నన్ను ఇంటికి పిలిపించుకొని తన చిరకాల మిత్రుడు శివసాగర్ కవితా సంకలనం వేద్దాం వైజాగ్ వెళ్ళి కలిసిరా అన్నాడు. ప్రొఫెసర్ అత్తులూరి నర్సింహరావు ద్వారా కాంటాక్ట్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్టార్ 8లో తన చిన్న కూతురు శ్రీదేవి ఇంట్లో కలుసుకున్నాను. అది మే నెల 21, 2003. సమువూదతీరం ఉక్కపోత వల్ల చెమట్లు కక్కుకుంటూ సమాచారాన్ని శివసాగర్‌కు చేరవేశాను. ఏడుపదుల వయసు దాటినా ముఖంపై చెరగని చిరునవ్వుతో నన్ను ఇంట్లోకి ఆహ్వానించాడు.
అప్పటికి నాకు అతని సాహిత్యం, అడపాదడపా చదివినప్పటికీ రాజకీయాలు పెద్దగా తెలియవు. కాకుంటే ఆరోజు అతనితో మాట్లాడడం నా జీవితంలో ఒక మలుపు. నన్ను చూడగానే ఖమ్మంతో ముడిపడి ఉన్న జ్ఞాపకాల దొంతర ఒక్కసారిగా మదిలో మెదిలినట్లుంది. ఖమ్మం అడవుల్లో ఒక విప్లవ పార్టీకి రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తో న్న సమయంలో జరిగిన ఒక భయంకరమైన ఎదురు కాల్పుల నుండి ఎలా బయటపడ్డదీ, మరుసటి రోజే ‘జీవితమా! నా యవ్వనాన్ని నాకివ్వు’ అని రాసిన కవిత నేపథ్యాన్ని చెప్పాడు. ఆరోజంతా చాలా విషయాలు మాట్లాడాడు అలా శివసాగర్‌తో నా మొదటి పరిచయం.
కొన్నాళ్ళ తర్వాత వైజాగ్ నుండి కొరియర్‌లో ఒక పార్సల్ వచ్చింది. అది ఆయ న దస్తూరీతో రాసిన ఆత్మకథ. వెంటనే చదివాను. ఆయన అంటే ఒక అవగాహన ఏర్పడ్డది. ఒక కొత్త విషయం కూడా తెలిసింది. వాళ్ళ కుటుంబం ఆనాటి డొక్కల కరువులో బురద తాగుతున్న కాలంలో ఆ భీకరమైన కరువును తట్టుకోలేక ఖమ్మం నుండి ఎంతోమంది మాలలు కొల్లేరు దిక్కుగా నడిచారనీ, అలా ఖమ్మం నుండి రావడం ములాన తన ఇంటిపేరు కంభం (జ్ఞాన) సత్యమూర్తిగా మారింది అని తెలుసుకున్నాను.
వరంగల్‌లో తొలివిడత మొదలైన తెలంగాణా ఉద్యమానికి బహిరంగ మద్దతు తెలిపి, గుత్తికొండ బిలంలో చారుమజుందార్‌తో కలిసి విప్లవ బీజాలు వేసి గోదావరి లోయ, జగిత్యాల జైత్రయాత్ర మొదలు కొని బస్తర్ దాకా విస్తరించి నేడు మహోన్నతంగా నడుస్తోన్న దండకారణ్య నమూనా, మరియు జనతన సర్కార్‌లకు శివసాగర్ సృష్టించిన, సాహిత్య, సాంస్కృతిక విప్లవోద్యమ స్ఫూర్తి అనేది దాచేస్తే దాగని సత్యం.
డాక్టర్ గోపినాథ్ అన్నట్లు కమ్యూనిష్టులు ‘తెలంగాణా సాయుధ పోరాటాన్ని నిండాముంచిన తర్వాత 70వ దశకంలో కొండపల్లి సీతారామయ్య, కె.జి. సత్యమూర్తిలు వేసిన విప్లవ బీజాలే నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో బర్మార్లు అయి పేలుతున్నాయి’అనేది అక్షరాల నిజం. సెప్టెంబర్ 2004 నాటికి శివసాగర్ సాహిత్యం మొదటి ముద్రణ బయటకు వచ్చింది. తన 36 ఏళ్ళ ఉద్యమ కవితా ప్రస్థానం పేరుతో అక్టోబర్ 20న బషీర్‌భాగ్ ప్రెస్‌క్లబ్‌లో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ఓ మూల అనామకంగా ఆ పుస్తకంతో నాకేమీ సంబంధం లేనట్లుగా కూర్చొన్నా, పుస్తకం వేసే క్రమంలో ఖమ్మం నుండి వైజాగ్ మళ్ళీ హైదరాబాద్ అలా దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు తిరిగా. ఇంత కష్టపడి పుస్తకం బయటకు తెస్తె కనీసం నాపేరు సభలో ఉచ్ఛరించలేదు. ఆరోజు కె.కె.ఆర్, చేరా, సతీష్ చందర్, చూపు కాత్యాయని మాట్లాడగా, అరుణోదయ రామారావు, చంద్రశ్రీ పాటలు పాడారు. ఆ పాటల్ని నెమరేసుకుంటూ ఖమ్మం వెనుదిరిగాను. అలా మొదటిసారి హైదరాబాద్‌లో సాహిత్య దళారీల విశృంఖల రూపం మొదటిసారి ఆ మీటింగ్‌లో చూశా.
ఏప్రిల్ 17, 2012న శివసాగర్ ఇకలేడనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇలా ఆయనతో నాకున్న అనుబంధాన్ని మీతో పంచుకొనే అవకాశం కాలం నాకిచ్చింది. శివసాగర్ తాను నడిచిన నేలంతా పోరాట బీజాలు చల్లిపోయాడు. వ్యక్తిగత జీవితం లేకుండా ఒక మెరుగైన మానవీయ సమాజాన్ని కల గని ఒక ప్రత్నామ్నాయ ఆలోచనా స్రవంతిని ఈ లోకానికి అందించి మననుంచి వెళ్ళిపోయాడు. ఆ క్రమంలో దళిత సౌందర్య శాస్త్రానికి ఒక బలమైన స్థానిక ప్రతీకలు వాడుకొని ‘‘ఇంతకాలం దళిత సాహిత్యం కేవలం ఇంద్రియ జ్ఞానానికి కట్టుబడి వుండటం వల్ల, దళిత సమస్యను చారివూతక రాజకీయ తాత్విక దృక్పథం నుండి వీక్షించక పోవడం వల్ల, ఆ సాహిత్యం సంక్షోభంలో పడిపోయింది అని హెచ్చరించాడు. అంతే కాకుండా ఇది విప్లవ వాదానికీ, స్త్రీ వాదానికి కూడా హెచ్చరికగా వుండాలి అన్నాడు.
ఆయన ఎన్ని రాజకీయ పార్టీలు మారినా, ఎంత రాజకీయ సంక్షోభానికి గురైనా, తన జీవితం అంతా అతి నిర్మలంగా, స్వచ్ఛంగా నిజాయితీగా వ్యక్తిగత ఆస్తి లేకుండానే చనిపోయాడు.
సంప్రదాయ, విప్లవ కమ్యూనిస్టు శిబిరాల్లో కుల సమస్యపై తమ అవగాహనను మార్చుకోవాలి అని ఆనాడు ఆయన చేసిన ఒంటరిపోరాటం స్పూర్తి దాయకం. తత్ఫలితంగా, కమ్యూనిస్టు పార్టీలలో కుల చర్చ అనివార్యతను సంతరించుకుంది. సమాజంలో ఉన్న కులతత్వం కమ్యూనిస్టు పార్టీలలో ప్రవేశించిన తీరును ఎండగడుతూ తాను చేసిన అంతర్ బహిర్గత పోరాటానికి పరిష్కార మార్గాలు వెతుకులాడే క్రమంలో ఆయన నుండి కొన్ని తప్పులు దొర్లిన మాట వాస్తవమే. కానీ, జీవితాంతం తాను పడిన తపన నిరాడంబరత్వం కుహనా ప్రోగ్రెసివ్ శక్తులకు అప్రధానం అయింది. వామపక్ష, విప్లవ శిబిరాల్లో ఇదో విషాద పార్శ్యం.
నాల్గు దశాబ్దాలకు పైగా జరిగిన అతని ప్రస్థానంలో శివసాగర్‌తో పాటు తన కుటుంబ సభ్యులు తన రాజకీయాలలో భాగమైనారు. చివరికి ఆయన చనిపోయినపుడు ఆరడుగుల నేల సంపాదించుకోలేకపోవడం ఎంత బాధాక రం? లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న తన పెద్దకొడుకు సిదార్థ రెండు అద్దె గదులలో శివసాగర్‌ని చివరి రోజుల్లో సాకాడు. ఆయన చనిపోయినప్పుడు ఇంట్లో స్థలం సరిపోక పోతే ఎదురుగా ఉన్న ఒక పాడుబడ్డ చర్చిలో పార్థివ దేహాన్ని ఉంచాల్సిన దుస్థితి దాపురించడానికి కారణం కేవలం అతని నిస్వార్థపరత్వం, దళిత కుటుంబంలో పుట్టడం మాత్ర మే. అలాంటి దుస్థితి ఏ విప్లవ నాయకుడికి వచ్చినా అది అవమానమే, కానీ ఇది కేవలం దళిత విప్లవకారుల విషయంలో ఎక్కువగా ఎందుకు జరుగుతుందో కారణాలు కావాలిపుడు.
శివసాగర్ ఒక తండ్రిగా కుటుంబ పెద్దగా తన వాళ్ళకు ఏమీ చేయలేకపోయాడు. ‘మా నాన్న మా కెవరికీ చెప్పకుండానే తన దారి, గమ్యం ప్రజల్లో చూసుకున్నాడు దాదాపు నాల్గు దశాబ్దాల తర్వాత చిక్కిశల్యమై డస్సిపోయి ఇంటికి వచ్చాడు. మేము చిన్న పిల్లలుగా ఉన్నపుడు వెళ్ళాడు, మాకు తల్లీ, తండ్రీ అన్నీ మా అమ్మమావూతమే’ అని గద్గద స్వరంతో చెప్పింది శ్రీదేవి. ఆయన అందరిలా సంపాదించుకోలేదు. పేరు ప్రతిష్టల కోసం పాకులాడ లేదు, నమ్మిన సిద్దాంతం కోసం చివరి శ్వాస వరకు కష్టపడ్డాడు.
శివసాగర్ నోటినుండి నేను చివరిసారి విన్న మాటలు ఇవి- ఇది పెట్టుబడి దారీ సమాజం, ఇక్కడ కీర్తి కూడా పెట్టుబడిగా మారబడుతోందని, అది అత్యంత దయనీయమైన అవాంఛనీయమైన స్థితి అని. అలా కీర్తి పెట్టుబడి కాకూడదన్న క్రమంలోనే తన సాహిత్యాన్ని తాను వేసుకోలేదు అంటూ, కిక్కిరిసిన హైదరాబాద్, బషీర్‌భాగ్ ప్రెస్‌క్లబ్‌లో నావైపు వేలు చూపుతూ అగో! ఆమూల కూర్చున్న అతనే ఈ పుస్తకం వేశాడు అని అన్నాడు. అది ఇంకా నాకళ్ళల్లో మెదలుతూనే ఉంది. గడిచిన 9 ఏళ్ళలో ఎన్నో జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. చివరిగా ఆయన ఇష్టంగా పాడుకునేపాట ‘నామల్లియ రాలెను! నా మొగిలి కూడా రాలెను! నామల్లియ నీ మొగిలి ఆకాశం చెరెను!! ఆకాశం చేరెను!!’
నిజం శివసాగర్ ! నువ్వు భారతీయ విప్లవోద్యమంలో ఆకాశం చేరిన ధృవతారగా, దిక్కుచూపే చుక్కలా ఎప్పటికీ ఉంటావు.
-గుర్రం సీతారాములు
(గుర్రం సీతారాములు శివసాగర్ కవిత్వం పుస్తకానికి రాసిన ముందుమాటలోంచి కొన్ని భాగాలు)

212
Tags

More News

VIRAL NEWS