సగటు మనిషి ఆక్రోశం కాళోజీ కవిత్వం

Mon,September 10, 2018 01:10 AM

భావము, భాషల సహజీవనమే కవిత్వము. భావ ము ఆత్మ, భాష శరీరము. కొందరి కవిత్వము భాషాడంబర ప్రదర్శనశాల. కొన్ని సందర్భాల్లో పైపై మెరుగుల భ్రమలో పడి పాఠకుడు అందులోని ఆత్మను అందుకోలేకపోతాడు. మరికొందరి కవిత్వము ఆత్మసాక్షాత్కారానికి అనువైన పద ప్రయోగశాల. ఈ కోవలోని వారే కాళోజీ.
కవిత కోసమే పుట్టిన కారణజన్ముడు కాళోజీ. అతని కవిత పాఠకుడిని ఏవో లోకాలకు తీసుకెళ్లడానికి బులిపించేది కాదు. అన్యాయాలు, అక్రమాలపై ఝళిపించేది. కాళోజీ అన్న బీజాక్షరత్రయం చైతన్యసిద్ధిని ప్రసాదిస్తుంది. కైత చేత మేల్కొల్పకున్న కాళోజీ కాయము చాలింకఅని తన జీ(క)వన పరమార్థాన్ని ప్రకటించుకున్నారు. సమాజంతో అద్వైతస్థితిని పొందినవారు. అందుకే వారి నా గొడవ అంతా మన గొడవే. వారి ఆరాటం, పోరాటం మన కోసమే. వారికి నా అన్నదేదీ లేదు. చివరకు ప్రాణం వదిలిన దేహాన్ని కూడా మనకే వదిలివెళ్లారు. (వరంగల్ వైద్య కళాశాలకు దానం చేశారు)
అందరూ ఎరిగిన మాటలె
అందరు అనుకొను మాటలె
కాళోజీ అక్షరాల
ఆకారము అందుకొనెను
తెలిసిన మాటలతో తెలియనితనాన్ని పోగొట్టుకునేందుకు ఉద్యమించాడు కాళోజీ. ఇదొక హృదయాకర్షక కవితారీతి. తేటదనం, సూటిదనం, ఇరుదరులుగా సాగే అక్షర స్రవంతి కాళోజీ కవిత. ఈ ప్రవాహానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
banner
ఎడతెగని వాగుడుది
ఎడతెగక సాగునది
కాలమునకు ప్రతికూలముగా
సతతము పారునది పోరునది
కాలమునకే కాదు మహా
కాలునకును ఏనాడును
జీ అన్న కలేజాతో
కాళోజీ అనునది.. అక్షరాల జీవనది..
మనకు పట్టిన మాలిన్యాన్ని వదలగొట్టడం ఈ నది ప్రత్యేకత. మనిషి మనసు ఎంతగా మలినమైపోయిందంటే..
మానవుని మానవుడు మానవుని మాదిరిగ
మన్నించలేనంత మలినమైనాది ఈ మాలిన్య పంక ప్రక్షాళన జరగాలంటే కాళోజీ కవితా స్రవంతిలో సుస్నాతులు కావాల్సిందే.
అల్పాక్షరంబుల అనల్పార్థ రచనకు కాళోజీ కవిత్వం లక్ష్యప్రాయమనదగింది.
సాగిపోవుటే బ్రతుకు/ ఆగిపోవుటే చావు అంటూ సూత్రీకరించి నిత్య చైతన్యశీలంతో ముందడుగు వేయమనే సందేశాన్నందించాడు. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట ఉండడాన్ని చూసి మనసు మండిన కాళోజీ ఈ వ్యత్యాస అస్తవ్యస్త విధానాలపై అక్షరాస్ర్తాన్ని సంధించాడు. స్వసు ఖం కోసం ఇతరులను ఇబ్బందిపెట్టే స్వార్థపరుల మనసుకు పట్టిన బూజును దులపడానికి పూనుకొని..

సంతసముగ జీవింపగ
సతతము యత్నింతు గాని
ఎంతటి సౌఖ్యానికైన
ఇతరుల పీడింపలేను అంటూ తన జీవితాన్నే ఆదర్శంగా నిలిపాడు. సమాజాన్ని నిశితంగా పరిశీలించి తన అధ్యయన సారాన్నంతా అక్షరప్రాత్రలతో మనకు అందించాడు. కొట్టుకోవడానికి సవాలక్ష కారణాలుండవచ్చని, చిన్న విషయం కూడా తన్నుకోవడానికి కారణభూతమవుతుందని చెబుతూ..
చాప చింప, సామ్రాజ్యం
కోడిగుడ్డు, కోహినూరు
పాటిమన్ను, ప్లాటీనం
బస్సు సీటు బ్రహ్మరథం
ఏదైతేం.. ఏదైతేం..
పోటీపడి కాటులాడ అంటాడు. ఇందులో ప్రతిపాదంలో మొదట అల్పవస్తువును, తరువాత అనల్పమైన వస్తువును ప్రస్తావించడం గమనార్హం. గమనంలో తేడాలున్నా గమ్యం ఒకటేనని చమత్కారభరితంగా చెప్పారు.
రాయిరువ్వినా, రాకెట్ విసిరినా
గిట్టని వానిని కొట్టుటకేకద!
కాలనడచినా, కారుయెక్కినా
కోరిన చోటికి చేరుటనే కద..!
అందితే జుట్టు, అందకుంటే కాళ్లు పట్టుకునే వారినొక పట్టుపట్టాడు.
వీలున్న ప్రతిచోట విఱ్ఱవీగుచు అపర
హిట్లరౌతును నే హిట్లరౌతాను
తలదన్నువానికాడ తలవంచి దయమనుచు
గాంధినౌతాను నేన గాంధినౌతాను
మంది తప్పుల ఏరి మనసుఖాలు నింపి
వడ్డి వడ్డీకట్టి వల్లియతాను
నా తప్పులనుదాచ నానారకాలైన
ధర్మసూత్రాలతో దడికట్టుతాను..
అంటూ సగటు మనిషి వెగటు ప్రవర్తనను వెక్కిరించాడు.
ఎన్నికలలో పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడమని ఓటరును జాగృతం చేస్తాడు.
వేష భాషల దుస్థితిని గూర్చి బోరున ఏ కరువు పెట్టే ఆర్భాటవాదులను చూస్తే అరికాలి మంట నెత్తికెక్కుతుంది కాళోజీకి. అంతే-నోటివెంట అప్రయత్నంగా విస్ఫులింగాలు ఆవిర్భవిస్తాయి.
నీ భాష దీనతకు నీ వేష దుస్థితికి
కారకుడనీవయని కాంచవెందుకురా

అన్య భాషలనేర్చి ఆంధ్రంబు రాదనుచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అంటూ నిలదీస్తాడు. స్వస్థాన వేషభాషాభిమానాన్ని ప్రకటిస్తాడు ఆయా సందర్భాలలో
నీరులేని ఎడారియైనను
వాన వరదల వసతియైనను
అగ్గికొండల అవనియైనను
మాతృదేశము మాతృదేశమె అంటూ దేశాభిమానాన్ని దీపింపజేశాడు. సమాజ గమనానికి సాయపడే రైతు గొప్పదనాన్ని ప్రస్తావిస్తూ..
ధార్మికుని దానాలు-పండితుని భాష్యాలు
వర్తకుని వ్యాజ్యాలు-వకీళ్ళ వాదాలు
సైనికుని శౌర్యాలు-మాంత్రికుని యంత్రాలు
యోధుల యుద్ధాలు-రాజుల రాజ్యాలు
కర్షకా! నీ కఱ్ఱు కదలినన్నాళ్లేనంటాడు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు పుట్టెడు కష్టాల్లో కూరుకుపోకుండా చూడాల్సిన బాధ్యతను గుర్తుచేశాడు. బాధ్యత ఎరుగని స్వేచ్ఛ బానిసత్వ లక్షణమని తెలుసుకోమన్నాడు. జాతీయ నాయకుల పట్ల ప్రదర్శిస్తున్న రిక్తభక్తిని వ్యంగ్యంగా చిత్రిస్తాడిలా..

ఓ గాంధీ
ఇంకేమి కావాలె? ఇంకేమి చేయాలె?
బ్రతికినన్నాళ్లు నిను బాపు అని పిలిచితిమి
చచ్చిపోయిన నిన్ను జాతిపిత జేసితిమి
పెక్కుభంగుల నిన్ను చెక్కినిలవేసితిమి
వేడ్కతో ఇంటింట వ్రేలాడదీసితిమి...!
అనుప్రాస విన్యాసం కాళోజీ కవిత్వానికి అదనపు ఆకర్షణ. ఈ పంక్తులను చూడండి
చితిని జేర్పగ చింత ఏదైననేమి
కొల్లగొట్టగ కొంప ఏదైననేమి
కోయదలిచిన గొంతు ఏదైననేమి
బాకుదూయక సాకు ఏదైననేమి..
పద ప్రయోగ నైపుణిలో కాళోజీ అందెవేసిన చేయి. పార్టీవ్రత్యము అనే కొత్తపదబంధాన్ని సృష్టించాడు. వల్లూరి బసవరాజును కోడెరాజు అంటాడు. కుక్కబుద్ధిని శౌనకేయ మనస్థితిగా మార్చాడు. సరస్వతీపుత్రుణ్ణి మాటమ్మకొడుకుగా మలిచాడు. అమెరికా, రష్యా దేశాలను అరదేశాలుగా కుదించాడు. ముఖ్యమంత్రిని ముమగా నిలబెట్టాడు. సామాన్యుడి నుంచి సర్వోన్నతుని వరకు ఆయన కలం పోటును తప్పించుకున్నవారు లేరు.
పోతన శ్రీకైవల్యపదాన్ని కైవల్యము శ్రీపదమున కలదని భావింతునేను అంటూ పారిమార్థిక చింతనను పరమ అర్ధ చింతనగా మార్చి వ్యాఖ్యానించాడు. దేవుని వలెనే గప్పాలు కూడా తర్కానికి లొంగవనడం, శ్రీశ్రీని డబుల్ శ్రీమంతుడనడం ఆయన కలం చేసిన విన్యాసాలలో కొన్ని మాత్రమే. సురవరం ప్రతాపరెడ్డి గారిని వైతాళికుడని చెప్పడానికి కోడి పుంజై వెలుగుజాడ పాడిన మనిషి అంటూ సరికొత్త రీతిన వ్యాఖ్యానించాడు.
పుట్టుక నీది
చావు నీది
బ్రతుకంతా దేశానికి.. అని మూడు పాదాలలో జీవన పరమార్థాన్ని చాటిన కవి త్రివిక్రముడు కాళోజీ.

- పల్లెర్ల రామమోహన రావు
9440193278

304
Tags

More News

VIRAL NEWS